విజయవాడ వ్యాపారవేత్త రాహుల్‌ మర్డర్ కేసులో డొంక కదులుతోంది. ఈ కేసు విచారణలో పోలీసులు పురోగతి సాధించారు. వ్యాపారవేత్త రాహుల్‌ హత్యలో నలుగురి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కొరడ విజయ్‌కుమార్‌, కోగంటి సత్యం పాత్రపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వ్యాపార లావాదేవీల్లో వివాదాలు తలెత్తి హత్యకు దారితీసినట్లు తెలుస్తోంది. రాహుల్.. కొరడ విజయ్‌కుమార్‌తో కలిసి గత రెండేళ్లుగా వ్యాపారం చేస్తున్నాడు. అయితే విజయ్‌కుమార్‌ ఆర్థికంగా నష్టపోవడంతో వీరి మధ్య వివాదం తలెత్తినట్లుగా తెలుస్తోంది. 


ఆ నలుగురు 


ఈ హత్యలో వ్యాపార భాగస్వాముల పాత్ర ఉందనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. కేసులో నలుగురు నిందితుల పాత్ర ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఆ నలుగురి ఆచూకీ కోసం ఐదు బృందాలను ఏర్పాటు చేశారు. మృతుడి తండ్రి రాఘవ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వ్యాపార భాగస్వాములపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.


కారులో మృతదేహం


కెనడాలో చదివిన కరణం రాహుల్‌ స్వదేశానికి వచ్చి నాలుగేళ్ల క్రితం కృష్ణా జిల్లా జి.కొండూరు మండలం చెరువు మాధవరంలో సిలిండర్ల తయారీ కంపెనీ ప్రారంభించారు. ఈ వ్యాపారంలో ముగ్గురిని వ్యాపార భాగస్వాములుగా చేర్చుకున్నాడు. ఇటీవల చిత్తూరు జిల్లా పుంగనూరులో మరో కంపెనీకి శంకుస్థాపన కూడా చేశారు. రాహుల్ పోరంకిలో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఎవరినో కలవడానికి వెళ్తున్నానని చెప్పి కారులో బయటకు వెళ్లాడు. ఎంతకీ ఇంటికి తిరిగి రాకపోవడంతో రాహుల్‌ తండ్రి రాఘవ పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గురువారం ఉదయం మొగల్రాజపురంలో కారులో గుర్తుతెలియని మృతదేహం ఉన్నట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. దీంతో మాచవరం ఇన్‌ఛార్జి సీఐ సత్యనారాయణ, సెంట్రల్‌ ఏసీపీ ఖాదర్‌ బాషా ఘటనాస్థలికి చేరుకుని ఆరా తీశారు. ఆ మృతదేహం రాహుల్‌‌దేనని అతడి తండ్రి గుర్తించారు. 




Also Read: Vizianagaram News: విజయనగరంలో దారుణం... పెళ్లిచేసుకోబోయే యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన యువకుడు... యువతి పరిస్థితి విషమం


పలు కంపెనీలు 


రాహుల్ 2015లో జిక్సిన్ సిలిండర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, 2017లో జిక్సిన్ ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, 2018లో జిక్సిన్ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్‌, 2019లో జిక్సిన్ పేపర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రారంభించారు. 2020లో జిక్సిన్ వెస్సల్స్ పేరుతో ఓ కంపెనీ ప్రారంభించగా... ఈ మధ్యే ఒంగోలులోనూ మరో కంపెనీకి శంకుస్థాపన చేసినట్లు తెలుస్తోంది. ఈ కంపెనీలలో కొరడ విజయ్‌కుమార్‌, బొబ్బా స్వామికిరణ్, కరణం రాఘవరావు భాగస్వాములుగా ఉన్నారు.


ఛార్జిషీట్ లో వారి పేర్లు 


కొరడ విజయ కుమార్‌ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి 2019 సార్వత్రిక ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. రాహుల్ హత్య కేసులో విజయ్ కుమార్, అతని భార్య పద్మజ, మరో మహిళ గాయత్రి, రౌడీషీటర్‌ కోగంటి సత్యం పాత్ర ఉన్నట్లు పోలీసులు నిర్థారించారు. వారి పేర్లను ఛార్జిషీట్ లో చేర్చారు. 


 Also Read: Gandhi Hospital Gang Rape: గాంధీ హాస్పిటల్ రేప్‌ కేసు మిస్టరీలో ట్విస్టు.. ఆ మహిళ ఆచూకీ గుర్తించారు కానీ..


కారులో మరికొందరు


రాహుల్‌ హత్యకు ప్రధాన సూత్రధారి రౌడీషీటర్‌ కోగంటి సత్యం అని పోలీసులు భావిస్తున్నారు.  ఎన్నికలలో ఓడిపోయిన విజయ్ కుమార్‌ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. తన వాటా తీసుకుని డబ్బులు ఇవ్వాలని కొంతకాలంగా రాహుల్‌ను అడుతున్నాడని సమాచారం. తన వద్ద అంత డబ్బు లేదని రాహుల్‌ చెప్పడంతో మొత్తం తానే తీసుకుంటానని కోగంటి సత్యం ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. అందుకు రాహుల్ అంగీకరించకపోవడంతో..దానిపై మాట్లాడదామని ఫోన్ చేసి బయటకుతీసుకెళ్లినట్లు పోలీసుల విచారణంలో తేలింది. కారులో రాహుల్ తో పాటు మరికొందరు ఉన్నట్లు పోలీసులు నిర్థారించారు. రాహుల్ చేతులను వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తులు వెనక్కి లాగి గట్టిగా పట్టుకోగా, మరో వ్యక్తి దిండుతో ముఖంపై నొక్కడంతో ఊపిరాడక చనిపోయి ఉండవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. 


 


Also Read: Vijayawada News: మాచవరంలో పార్క్ చేసిన ఫోర్డ్ కారులో మృతదేహం.. హత్యా లేదా ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు