గాంధీ ఆస్పత్రిలో జరిగిన గ్యాంగ్ రేప్, ఓ మహిళ మిస్సింగ్ వ్యవహారాలు నాలుగు రోజులుగా మిస్టరీగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో కీలక పురోగతిని పోలీసులు సాధించారు. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చాక కనిపించకుండా పోయిన సెక్యూరిటీ గార్డును పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతణ్ని విచారణ జరపగా.. తాను బాధితురాలిపై అత్యాచారం చేసినట్లు ఒప్పుకున్నాడు. ఈ విషయాన్ని పోలీసులు వెల్లడించారు. ఘటన జరిగిన రోజు విజయ్‌ అనే వ్యక్తితో కలిసి బాధితురాలు వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజీలో పోలీసులు గుర్తించారు. 


అయితే, బాధితురాలు అతనితో ఇష్టపూర్వకంగా వెళ్లిందా? లేక బలవంతంగా వెళ్లిందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. అంతేకాక, ఈ ఘటన జరిగినప్పటి నుంచి కనిపించకుండా పోయిన బాధితురాలి చెల్లెలిని కూడా పోలీసులు గుర్తించారు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా పోలీసులు ఆమె ఆచూకీని గుర్తించారు. నారాయణగూడలోనే ఆ మహిళ సురక్షితంగా ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. రెండు రోజుల పాటు ఆమె ఓ వ్యక్తితో ఉన్నట్లుగా తేల్చారు. ఆ వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 


అసలేం జరిగిందంటే..
మహబూబ్‌నగర్‌ జిల్లాకి చెందిన ఓ మహిళ కిడ్నీల సమస్యతో బాధపడుతున్న తన భర్తను గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చింది. తోడుగా తన చెల్లిని కూడా వెంటబెట్టుకొని కొద్ది రోజుల క్రితం ఆసుపత్రికి వచ్చింది. అక్కడ ఈ అక్కా చెల్లెళ్లపై ఐదుగురు వ్యక్తులు సాముహిక అత్యాచారం జరిగినట్లుగా తొలుత ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆమె భర్త నర్సింహులు ఈ నెల 4న గాంధీ ఆస్పత్రిలో చేర్చారు. గాంధీ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగి అయిన ఉమామహేశ్వర్ అనే వ్యక్తిది కూడా నర్సింహులు సొంత ఊరే. అయితే, ఆయన ఉన్నాడన్న భరోసాతో నర్సింహులు కుటుంబంతో సహా ట్రీట్‌మెంట్ కోసం వచ్చాడు. ఈ నెల 11వ తేదీన అతనికి కిడ్నీ సంబంధిత చికిత్స నిర్వహించారు. చివరికి అతను డిశ్చార్జ్ అయ్యే సమయానికి తన భార్య, చెల్లెలు కనిపించకుండా పోయారు.


ఇలా హైదరాబాద్‌లో మిస్ అయిన అక్కాచెల్లెళ్లలో ఒకరు మహబూబ్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్ దగ్గర ప్రత్యక్షమైయ్యారు. ఆమెను పోలీసులు ప్రశ్నించగా.. తన అక్కను, తనను కిడ్నాప్ చేశారని, కొందరు లైంగికంగా వేధించారని, రేప్ చేశారని ఆమె చెప్పుకొచ్చింది. తాను మాత్రం వాళ్ల కళ్లుగప్పి ఏదోలా తప్పించుకున్నానని వివరించింది. బాధితురాలి ఫిర్యాదుతో మహబూబ్‌ నగర్‌లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దాన్ని హైదరాబాద్‌లోని చిలకలగూడ పీఎస్‌కు బదిలీ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆమెను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించి, ఉమామహేశ్వర్‌‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ జరిపారు.