Vaikunta Ekadasi 2023 Date And Time: తిరుమల/హైదరాబాద్: మార్గశిర మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్ల పక్ష ఏకాదశినే ఉత్తర ద్వార దర్శన ఏకాదశి అంటారు. ఈ ప్రత్యేక ఏకాదశినే ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. ఈ అత్యంత శుభదినాన ప్రతి దేవాలయంలో ఉత్తరం ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకున్నవారికి పునర్జన్మ ఉండదని మోక్షం సిద్ధిస్తుందని పండితులు చెబుతారు. అందుకోసమే తెలుగు రాష్ట్రాల్లో భక్తులు శుక్రవారం అర్ధరాత్రి నుంచే ఆలయాలకు పోటెత్తారు. వాస్తవానికి శుక్రవారమే తిథి వచ్చినా.. డిసెంబరు 23 శనివారం రోజు వైకంఠ ఏకాదశి ఉదయం 7 గంటల 56 నిముషాల వరకు ఉంది. కొన్ని ఆలయాల్లో శుక్రవారం సాయంత్రం నుంచే ఉత్తర ద్వార దర్శనభాగ్యం కల్పిస్తున్నారు.


తెలుగు రాష్ట్రాల్లో భక్తులు ఆలయాలకు క్యూ కట్టారు. వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తరద్వార దర్శనంతో మోక్షం లభిస్తుందని దీన్ని మోక్షద ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు శ్రీ మాహావిష్ణువుని పూజిస్తే అమ్మ లక్ష్మీదేవి అనుగ్రహం కూడా సిద్ధిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. కష్టాలు దూరమై, సంపదతో పాటూ సంతోషాలు వెల్లివిరుస్తాయని భక్తులు వేంకటేశ్వర స్వామి, విష్ణు ఆలయాలకు, రామాలయాలకు క్యూ కడుతున్నారు. వైష్ణవ ఆలయాలైన తిరుమల, భద్రాచలం, చిలుకూరు బాలాజీ లాంటి ప్రసిద్ధ ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం చేసుకుని మోక్షం పొందేందుకు భక్తులు భారీ సంఖ్యలో ఆలయాలకు పోటెత్తారు.  


వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలో భక్తులు పెద్ద ఎత్తున వెళ్లి ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటున్నారు. ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశిగా వ్యవహరిస్తారు. వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, ప్రవచనాలు, ప్రసంగాలతో ఆలయాలు కళకళలాడుతున్నాయి. ఈ రోజున కొందరు భక్తులు వేకువజామునే స్వామి వారిని దర్శించుకుని వెళ్లి ఉపవాసం ఉండి ఆపై జాగరణ చేస్తారు. 


తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం..
శుక్రవారం అర్ధరాత్రి 1:45 గంటలకు వైకుంఠ ద్వారంను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా తెరిచారు. ముందుగా శ్రీనివాసుడికి నిత్య కైంకర్యాలు, తిరుప్పావై పఠనం చేసిన అనంతరం వైకుంఠం ద్వారం గుండా శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి టిటిడి అధికారులు భక్తులను అనుమతిస్తున్నారు. దీంతో ఇలవైకుంఠం తలపించేలా శ్రీవారి ఆలయంకు ఆనుకుని ఉన్న వైకుంఠ ద్వారంను వివిధ రకాల ఫలపుష్పాలు, విద్యుత్ దీపాలు దేదీప్యమానంగా అలంకరించారు.


కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరుడి సన్నిధిలో వైకుంఠ ద్వార దర్శనాన్ని అదృష్టంగా భావిస్తారు భక్తులు. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమల క్షేత్రంలో 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నారు. డిసెంబరు 23 నుంచి జనవరి 1 వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాటు చేసినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. వైకుంట ఏకాదశిని పురస్కరించుకుని భక్తులు శుక్రవారం నుంచే పెద్ద ఎత్తున తిరుమలకు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. నిన్న దర్శనాలకు సైతం బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. 
Also Read: ఒక్కో ఏకాదశికి ఒక్కో ప్రత్యేకత, వైకుంఠ ఏకాదశికి ఉపవాసం ఎందుకంటే!


ఆదిలాబాద్ జిల్లా బెజ్జూర్ మండల కేంద్రంలోని శ్రీరంగనాయక స్వామి క్షేత్రం విశిష్టతను కలిగి ఉంది. ఇక్కడ స్వామివారు శేషతల్పముపైన శేయనించి నాభిమధ్యాన బ్రాహ్మ కలిగి అనంత దేవతామూర్తులతో కనిపించును. ఇక్కడ ఉన్నట్లుగా స్వామివారి విగ్రహం మరేచోట దర్శనం ఇవ్వదు. ఇక్కడ వైకుంట ఏకాదశి 3 రోజుల పాటు జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి.
Also Read: నవగ్రహాల్లో ఏ గ్రహం ఏ స్థానంలో ఉంటే ఇబ్బందులు మొదలవుతాయో తెలుసా!