KTR Auto Drivers Problem:

  హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన మహాలక్ష్మీ పథకంతో ఆటో డ్రైవర్ల సమస్యలు పెరిగిపోయాయి. దాంతో రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పైన విస్తృతంగా అధ్యయనం చేయడానికి పార్టీ కార్మిక విభాగం ఆధ్వర్యంలో ఒక కమిటీని వేస్తున్నట్లు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు (BRS Working President KTR) తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరుగ్యారంటీలలో భాగంగా మహాలక్ష్మీ పథకం కింద మహిళలు, బాలికలు, విద్యార్థినులు, థర్డ్ జెండర్ వారికి ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అందిస్తున్నారు. డిసెంబర్ 9వ తేదీ నుంచి ఈ పథకం కింద వీరు రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ప్రయాణిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి ఈ మొత్తం చెల్లించనుంది.


తెలంగాణ వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు జిల్లాల్లో ఎక్కడ పడితే అక్కడ పలు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. తమ స్థితిగతుల పైన ఆందోళన వ్యక్తం చేస్తున్న క్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసిఆర్ ఆదేశాల మేరకు.. ఆటో డ్రైవర్ల సమస్యలను తెలుసుకుని, వారు కోరుకుంటున్న పరిష్కార మార్గాలను తెలుసుకునేందుకు ఈ కమిటీని వేస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు.  ఈ కమిటీలో భాగంగా కార్మిక విభాగం నాయకులు రూప్ సింగ్, రామ్ బాబు యాదవ్, మరయ్య లు ఆటో డ్రైవర్ల ప్రతినిధులతో మాట్లాడుతారు. 


కేవలం ఆటో డ్రైవర్లే కాకుండా రాష్ట్రంలో ఉన్న ఓలా, ఉబెర్, ఇతర టాక్సీ డ్రైవర్లతో కూడా వీరు చర్చించి ఒక నివేదికను పార్టీకి అందజేయనున్నారు. కార్మిక విభాగం నాయకులు అందించే నివేదిక ఆధారంగా తెలంగాణ ప్రభుత్వానికి అవసరమైన సలహాలు, సూచనలను ఇస్తామని, ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం పార్టీ తరఫున ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకువస్తామని కేటీఆర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.