Nellore News In Telugu: నెల్లూరు జిల్లాలో ఇరు వర్గాల మధ్య జరిగిన దాడిలో ఒకరు ప్రాణం కోల్పోగా మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటన జిల్లాలో రాజకీయ సంచలనంగా మారింది. దాడికి పాల్పడినవారు వైసీపీ వారని, హత్యకు గురైన వ్యక్తి టీడీపీ నాయకుడని ప్రచారం జరుగుతోంది. అయితే పోలీసులు మాత్రం ఇవి వ్యక్తిగత గొడవలని వీటికి రాజకీయ రంగు పులమొద్దని చెబుతున్నారు. 


అసలేం జరిగింది..?
నెల్లూరు జిల్లాలోని కావలి పట్టణం ముసునూరు ఆటోనగర్‌ లో ఈరోజు మధ్యాహ్నం జరిగిన హత్య సంచలనంగా మారింది. ఆటోనగర్ కు చెందిన పుల్లా సుబ్బారెడ్డి, సురేష్‌ కుటుంబాల మధ్య చీటీ పాటల విషయంలో వివాదాలు ఉన్నాయి. చీటీపాట డబ్బులు అడ్జస్ట్ మెంట్ చేయడంలో ఇరు కుటుంబాలకు మధ్య గొడవలు ఏర్పడ్డాయి. సురేష్ కి సుబ్బారెడ్డి చీటీపాట డబ్బులు బాకీ ఉన్నాడని తెలుస్తోంది. పలుమార్లు సుబ్బారెడ్డిని ఈ డబ్బుల విషయంలో హెచ్చరించినా అతడు తిరిగి చెల్లించలేదు. దీంతో సురేష్ కుటుంబ సభ్యులు కూడా సుబ్బారెడ్డి ఇంటికి వెళ్లి డబ్బుల విషయంపై నిలదీశారు. సుబ్బారెడ్డిపై ఒత్తిడి పెంచారు. దీంతో సుబ్బారెడ్డి కక్షగట్టి సురేష్ కుటుంబంపై దాడికి తెగబడ్డాడు. ఈ దాడిలో సురేష్ అక్కడికక్కడే చనిపోయాడు. 


సుబ్బారెడ్డి వైసీపీ..
పదే పదే డబ్బుల విషయంలో ఒత్తిడి తేవడంతో సుబ్బారెడ్డి తన బంధువైన చలంచర్ల విజయ్‌ రెడ్డితో కలిసి సురేష్‌ ఇంటిపై దాడికి వెళ్లాడు. కత్తులతో తెగబడ్డాడు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలై సురేష్ అక్కడికక్కడే చనిపోయాడు. హతుడు సురేష్ టీడీపీ సానుభూతిపరుడని అంటున్నారు. హంతకుడు సుబ్బారెడ్డి అతని బంధువులు వైసీపీనాయకులనే ప్రచారం జరుగుతోంది. డబ్బులకోసం జరిగిన హత్య అని అంటున్నా.. దీనికి రాజకీయ రంగు పులుముకోవడం సంచలనంగా మారింది. 


అద్దెకు ఉన్న కారణంగా..
ఈ దాడి ఘటనలో సురేష్ అక్కడికక్కడే మరణించగా, అతడిని కాపాడే క్రమంలో మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. ఆ ముగ్గురు సురేష్ ఇంటిలో అద్దెకు ఉండేవారు కావడం విశేషం. సురేష్ కి చెందిన భవనంలో అద్దెకు ఉంటున్న శ్రీనివాసులు, సుష్మ, సుధాకర్‌ దాడి ఘటన తెలియగానే వారించే ప్రయత్నం చేశారు. సురేష్ పై దాడిని అడ్డుకునేందుకు బయటకు వచ్చారు. అయితే కత్తులతో వచ్చినవారు సురేష్ తోపాటు ఆ ముగ్గురిపై కూడా విరుచుకుపడ్డారు. విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో దాడిలో వారికి కూడా గాయాలయ్యాయి. గాయాలపాలైన వారిని నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 


కావలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు రాజకీయాలకు సంబంధం లేదని అంటున్నారు పోలీసులు. అయితే హత్య చేసిన వారు వైసీపీకి చెందిన నేతలు కావడంతో పోలీసులు కావాలనే వారిని తప్పించారని ఆరోపిస్తున్నారు బాధిత కుటుంబ సభ్యులు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో సంచలనంగా మారింది. జిల్లాకు చెందిన టీడీపీ నేతలు కూడా ఈ హత్యపై స్పందిస్తున్నారు. బాధితులను పరామర్శించేందుకు కావలి వస్తున్నారు. టీడీపీ నాయకులు మాత్రం ఇది ముమ్మాటికీ పొలిటికల్ మర్డర్ అంటున్నారు. కావాలని టీడీపీ నేతని టార్గెట్ చేసి హతమార్చారని, దీనికి ఆస్తి వివాదం, చీటీ పాటల వివాదం అని కారణాలు చెబుతున్నారని మండిపడుతున్నారు.