MLA Balineni Controversies Continue In YSRCP: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి  (Balineni Srinivas Reddy) వ్యవహారశైలి వైసీపీ (YSRCP) అధిష్ఠానానికి తలనొప్పిగా మారిందా ? బాలినేని పార్టీతో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారా ? లేదంటే పార్టీనే ఆయన సేవలు వద్దని భావిస్తోందా ? సొంత పార్టీనే ధిక్కరించేలా ఎందుకు మాట్లాడుతున్నారు ? ఇదే ఇప్పుడు ప్రకాశం (Prakasam) జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.


అంతుచిక్కని అంతరంగం


గత కొన్ని నెలలుగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలు, వ్యవహారశైలి ఎవరికి అంతుచిక్కడం లేదు. మంత్రివర్గం నుంచి తప్పించినప్పటి నుంచి గుర్రుగా ఉన్నారు. ఆ తర్వాత రీజినల్ కోఆర్డినేటర్ పదవిని ఆయన వదులుకున్నారు. పార్టీలోనే ఉంటూనే, పార్టీ నేతలపై విమర్శలు చేస్తున్నారు. అలా అని పార్టీ మారుతానని ఎక్కడా చెప్పడం లేదు. పార్టీ మారడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శలు వచ్చినపుడల్లా, వాటిని ఎప్పటికపుడు ఖండిస్తూనే ఉన్నారు. వైసీపీనీ వీడేది లేదని ఖరాఖండిగా చెబుతున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎప్పటికపుడు తాడేపల్లికి పిలిపించి మాట్లాడుతున్నారు. బాలినేని శ్రీనివాస్ రెడ్డికి సర్ది చెప్పి పంపిస్తున్నారు. 


చర్చనీయాంశంగా మారిన కామెంట్స్


ముఖ్యమంత్రి ముందు అన్నిటికీ ఓకే అని చెబుతున్న ఆయన, బయటకు వచ్చిన తర్వాత షరా మమూలే. తాను చెప్పాలనుకున్న విషయాలను కుండబద్దలు కొట్టినట్లు బహిరంగ సమావేశాల్లోనే చెప్పేస్తున్నారు. ఆయన వ్యాఖ్యలు ప్రతిపక్ష పార్టీలకు అస్త్రంగా మారుతున్నాయి. పార్టీకి తలనొప్పిగా మారిన బాలినేని శ్రీనివాస్ రెడ్డిని వదిలించుకోవాలని వైసీపీ హైకమాండ్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. తాడేపల్లి డోర్స్ కూడా క్లోజ్ చేసినట్లు వైసీపీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు జిల్లా వ్యాప్తంగా పార్టీ నేతలు, కేడర్ నిర్వహించాయి. సీఎం జన్మదిన వేడుకలకు బాలినేని శ్రీనివాస్ రెడ్డి డుమ్మా కొట్టారు. ఎప్పుడు సీఎం జన్మదిన వేడుకల్లో ఆయన హడావుడి చేసేవారు. కానీ ఈసారి మాత్రం ఆ పరిస్థితి కనిపించలేదు.  తాడేపల్లికి వెళ్లి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పుష్పగుచ్చం కూడా అందించలేదు. ఫ్లెక్సీలు వేయలేదు, సోషల్ మీడియాలో కూడా జగన్ కు విషెస్ చెప్పలేదు. 


 


బస్సు యాత్రకు దూరం


గత నెలలో ప్రకాశం జిల్లాలో జరిగిన బస్సు యాత్రకు దూరంగా ఉన్నారు. మార్కాపురం నుంచి వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి పోటీచేస్తారని, ఆయన్ను గెలిపించుకోవాలని పార్టీ నేతలకు సూచించారు. రోజంతా కలిసే ఉన్నా తమకు చెప్పకుండా ఏకపక్షంగా నాగార్జునరెడ్డి అభ్యర్థిత్వాన్ని ప్రకటించడంపై బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఎంపీ విజయసాయిరెడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఇంటికి వెళ్లినపుడు బాలినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కాపురం టికెట్‌ ఆశిస్తున్న పార్టీ జిల్లా అధ్యక్షుడు జంకె వెంకటరెడ్డి సైతం కనిగిరి పర్యటనకు దూరంగా ఉన్నారు. నియోజయవర్గంలో 25వేల ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తే పోటీ చేస్తానని ప్రకటించారు. దీన్ని ప్రభుత్వం ఈజీగా తీసుకుంది. అటు మంత్రివర్గం నుంచి తప్పించారు. ఇటు నియోజకవర్గ సమస్యలను పరిష్కరించడం లేదు. దీంతో బాలినేని తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. అందుకే ఆయన పార్టీతో టచ్ మీ అన్నట్లు వ్యవహరిస్తున్నారు. హై కమాండ్ సైతం ఆయనను లైట్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.


నకిలీ భూదస్తావేజుల కేసుతో రగడ


ప్రకాశం జిల్లాలో నకిలీ భూ దస్తావేజుల కేసులో తీరుపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు. పోలీసుల తీరుకు నిరసనగా గన్‌మెన్‌లను ప్రభుత్వానికి సరెండర్‌ చేశారు. నకిలీ భూపత్రాల కేసులో ఇప్పటి వరకు 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎంతటి వారినైనా వదిలిపెట్టవద్దని కలెక్టర్‌ సమక్షంలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఎస్పీని కోరారు. నాలుగేళ్ల నుంచే ఇలాంటి విచిత్ర పరిస్థితులు చూస్తున్న బాలినేని, ఇపుడు జగన్ జన్మదిన వేడులకు దూరమయ్యారు. కొన్ని రోజులక్రితం 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతే మన పరిస్థితి ఏంటని కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిస్తే మన పరిస్థితి ఏమిటి ? భవిష్యత్తు ఎలా ఉంటుందో ఓసారి ఆలోచించుకోవాలని బాలినేని శ్రీనివాసరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.  తాము అధికారంలోకి వస్తే వైసీపీ నాయకుల తాట తీస్తామంటూ జనసేన, టీడీపీ నాయకులు హెచ్చరికలు గుర్తు చేశారు. టీడీపీ నిజంగానే అధికారంలోకి వస్తే మన పరిస్థితి ఎలా ఉంటుందో పార్టీ శ్రేణులు ఆలోచించుకోవాలని సూచించారు.