TTD Clarity On Laddu Gutka Packet Fake News: తిరుమల (Tirumala) శ్రీవారి లడ్డూ ప్రసాదంలో పొగాకు పొట్లం వచ్చిందంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమని టీటీడీ (TTD) స్పష్టం చేసింది. ఈ అంశంపై క్లారిటీ ఇస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. 'పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదంలో పొగాకు పొట్లం ఉన్నట్లు కొంతమంది సోషల్ మీడియాలో వైరల్ చేయడం సరికాదు. తిరుమలలోని లడ్డూ పోటులో శ్రీవైష్ణవ బ్రాహ్మణులు అత్యంత భక్తి శ్రద్ధలు, నియమ నిష్టలతో ప్రతిరోజూ లక్షలాది లడ్డూలను తయారు చేస్తారు. సీసీ టీవీల పర్యవేక్షణలో ఈ లడ్డూ తయారీ ఉంటుంది. ఇంతటి పకడ్బందీగా లడ్డూలు తయారు చేసే వ్యవస్థలో పొగాకు ఉన్నట్లు ప్రచారం చేయడం శోచనీయం. భక్తులు ఈ విషయాన్ని గమనించాలి' అని టీటీడీ పేర్కొంది.


ఇదీ జరిగింది


ఖమ్మం జిల్లా గొల్లగూడెం పంచాయతీ పరిధిలోని కార్తికేయ టౌన్ షిప్‌లో నివాసం ఉంటున్న దొంతు పద్మావతి తన బంధువులతో కలిసి సెప్టెంబర్ 19న తిరుపతికి వెళ్లారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకుని.. మిగతా భక్తుల్లాగే తన బంధువులు, సన్నిహితులకు పంచేందుకు తిరుమల లడ్డూను ప్రసాదంగా తీసుకొచ్చారు. లడ్డూని తెరిచి చూడగా..  ఆ పేపర్లో గుట్కా ప్యాకెట్, చిన్న పొగాకు ముక్కలు కనిపించడంతో ఆమెతో పాటు ఇరుగుపొరుగు వారు ఒక్కసారిగా షాకయ్యారు. అయితే, ఈ ప్రచారంపైనే టీటీడీ క్లారిటీ ఇచ్చింది. ఇది తప్పుడు ప్రచారం అంటూ స్పష్టం చేసింది. ఇలాంటి ప్రచారాలను ఎవరూ నమ్మొద్దని.. లడ్డూ తయారీ పూర్తి నియమ నిష్టలతో సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరుగుతుందని తెలిపింది.


కాగా, ఇప్పటికే తిరుమలలో లడ్డూ వివాదం కొనసాగుతోంది. లడ్డూ తయారీకి వాడే నెయ్యిలో పందికొవ్వు, జంతువుల కొవ్వు కలిపారని తేలడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై రాజకీయ వివాదం కొనసాగుతోంది. అటు, తిరుమలలో సంప్రోక్షణ, శాంతి హోమం నిర్వహించారు. దీని ద్వారా భక్తులు లడ్డూ ప్రసాదం, నైవేద్యం నాణ్యతపై భక్తులు తమకున్న భయాలు, అపోహలు పక్కన పెట్టవచ్చని ప్రధానార్చకులు వెల్లడించారు. మరోవైపు, తిరుమల లడ్డూ విషయంలో జరిగిన అపవిత్రతపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సైతం ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. మంగళవారం దుర్గగుడిలో శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. 


కీలక వ్యాఖ్యలు


ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూ మతానికి, సనాతన ధర్మానికి ఇంత అవమానం జరుగుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని హిందువులను ప్రశ్నించారు. ఇదే వేరే మతంలో వేరే ప్రాంతంలో జరిగి ఉంటే పరిస్థితి ఇలానే ఉండేదా అని అన్నారు. హిందువుల మౌనాన్ని చేతకానితనంగా భావిస్తున్న కొందరు ఇష్టం వచ్చినట్టు మట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా పలువురు చేసిన కామెంట్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.  


అటు, లడ్డూ లడాయి సుప్రీంకోర్టుకు చేరింది. వైసీపీ, బీజేపీ నేతలు ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపించాలని న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పిటిషన్ వేశారు. బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి సైతం మరో పిటిషన్ వేశారు. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై విచారణ జరిపించాలన్నారు.


Also Read: Raghurama custodial torture case : వెంటాడుతున్న మరో కేసు - రఘురామ కేసులో ముందస్తు బెయిల్‌కు నో - ఆ పాల్‌తో పాటు జగన్‌నూ ?