Monkeys Saved A Life: దేశంలో అత్యాచార ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. నిత్యం ఎక్కడో ఒకచోట ఈ తరహా అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌లో ఆరేళ్ల చిన్నారిపై కామాంధుడు అత్యాచారానికి ప్రయత్నించగా, కోతులు ఆ చిన్నారిని రక్షించాయి. ప్రస్తుతం ఈ విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా అడవుల్లో ఉండాల్సిన కోతులు జనావాసాల్లో తిరుగుతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేయడాన్ని ఇప్పటి వరకు మనం చూసి, విని ఉంటాం. కానీ ఉత్తరప్రదేశ్ భాగ్ పట్ లోని దౌలా గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తే మాత్రం ప్రతి ఒక్కరూ షాక్ అవ్వాల్సిందే. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తాయనే భావన ఉన్న కోతులు ఒక చిన్నారి నిండు జీవితాన్ని నిలబెట్టాయి అనే విషయం ఇప్పుడు ఉన్నత స్థాయి అధికారుల్లోనూ చర్చకు కారణమైంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. 


ఉత్తరప్రదేశ్‌లోని బాగ్ పత్ పరిధిలోని దౌలా గ్రామంలో ఈనెల 20వ తేదీన ఇంటి బయట ఆడుకుంటున్న ఆరేళ్ల చిన్నారిని గుర్తు తెలియని దుండగుడు బలవంతంగా ఎత్తుకొని వెళ్లిపోయాడు. సమీపంలోని పాడుబడిన బంగ్లాలోకి తీసుకెళ్లి బెదిరించి అఘాయిత్యానికి ప్రయత్నించబోయాడు. ఆ చిన్నారి ఒంటిపై ఉన్న దుస్తులను తొలగించి లైంగిక దాడికి ప్రయత్నించబోయాడు. ఈ సమయంలో అక్కడే ఉన్న కొన్ని కోతులు అతడి వైపు దూసుకొచ్చి దాడికి ప్రయత్నించాయి. దీంతో భయపడిన కామాంధుడు బాలికను అక్కడే వదిలేసి పరారయ్యాడు. అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకొని ఇంటికి వెళ్లిన ఆ చిన్నారి తల్లిదండ్రులకు విషయాన్ని వివరించింది. ఆ కామాంధుడు నుంచి కోతులు తనను ఎలా రక్షించాయో ఆ చిన్నారి తల్లిదండ్రులకు స్పష్టంగా తెలియజేయడంతో వెంటనే వెళ్లి చూసిన వారికి అక్కడ కోతుల గుంపు కనిపించింది.


అత్యాచార యత్నంపై ఆ చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు గుర్తు తెలియని నిందితుడిపై ఫోక్సో కేసును నమోదు చేశారు పోలీసులు. పరారీలో ఉన్న అతడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు అనంతరం మాట్లాడిన చిన్నారి తల్లిదండ్రులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. కోతులు లేకపోతే ఆ దుర్మార్గుడు తమ బిడ్డ జీవితాన్ని నాశనం చేసేవాడిని కంటతడి పెట్టుకున్నారు. ఇంటి బయట ఆడుకుంటుండగా తన కుమార్తెను నిందితుడు తీసుకెళ్లినట్లు తెలిపారు. ఇరుకు సందు నుంచి పాపను తీసుకెళ్లడం సమీపంలో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయిందని చిన్నారి తండ్రి వివరించాడు. నిందితుడిని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారని, వాడు తన కూతుర్ని చంపుతానని బెదిరించాడు చిన్నారి తండ్రి తెలియజేశాడు. సమయానికి కోతులు అక్కడికి రాకపోయి ఉంటే తన కుమార్తె చనిపోయి ఉండేదని బాలిక తండ్రి వాపోయాడు.


బాగ్పత్ సర్కిల్ ఆఫీసర్ హరీష్ బదోరియా మాట్లాడుతూ బాలికపై అత్యాచారం జరగకుండా కోతులు అడ్డుకున్నాయనే విషయం మా దృష్టికి వచ్చింది. అత్యాచార యత్నంపై దర్యాప్తు చేపట్టామని వివరించారు. ఆ చిన్నారి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో భారత న్యాయ సంహిత చట్టం సెక్షన్ 74, 76 తోపాటు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. అవసరమైతే మరిన్ని సెక్షన్లను జోడిస్తామని పేర్కొన్నారు. నిందితుడిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. త్వరలోనే అతడిని పట్టుకుంటామని వివరించారు.


ప్రస్తుతం కోతులు ఒక చిన్నారిని కాపాడాయన్న విషయం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆ హనుమంతుడే ఆ చిన్నారి జీవితాన్ని రక్షించాడు అంటూ పలువురు ఈ విషయం తెలిసి కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా కోతులు ఒక నిండు ప్రాణాన్ని నిలబెట్టాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.