Badlapur Abuse Case: మహారాష్ట్రలోని (Maharastra) ఠాణె జిల్లా బద్లాపూర్‌లో (Badlapur) ఇటీవల ఓ పాఠశాలలో ఇద్దరు బాలికలపై స్వీపర్ లైంగిక దాడికి పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కేసు విచారణలో భాగంగా నిందితుడు అక్షయ్ శిందే (23) పోలీసులు తలోజా జైలు నుంచి బద్లాపూర్‌కు తీసుకొస్తున్న సమయంలో అతను పోలీసులపై తిరగబడ్డాడు. కారులో ఉన్న సమయంలోనే ఓ పోలీస్ నుంచి రివాల్వర్ తీసుకుని పోలీస్ బృందంపై అనేకమార్లు కాల్పులు జరిపాడు. ఈ క్రమంలో పోలీస్ అధికారులకు గాయాలయ్యాయి. దీంతో పోలీసులు సైతం ఎదురుకాల్పులకు జరపగా నిందితుడు తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం అతన్ని ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ నిందితుడు మృతి చెందినట్లు తెలుస్తోంది. బద్లాపూర్ పాఠశాలలో అత్యాచార ఘటనకు సంబంధించి విచారణ కొనసాగుతుండగా.. నిందితునిపై అతని మొదటి భార్య పెట్టిన కేసుకు సంబంధించి పోలీసులు ప్రశ్నించేందుకు సిద్ధమయ్యారు.


ఇందులో భాగంగానే నిందితుడిని తలోజా జైలుకు వెళ్లి.. అక్కడి నుంచి కారులో తీసుకొని బద్లాపూర్‌కు బయలుదేరారు. వాహనం ముంబ్రా బైపాస్‌కు చేరుకున్న సమయంలోనే పోలీస్ అధికారి నుంచి తుపాకీ లాక్కొన్న నిందితుడు కాల్పులకు తెగబడ్డాడు. వెంటనే అప్రమత్తమైన  మరో పోలీస్ అధికారి ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఘటనలో నిందితునితో పాటు పోలీసులు గాయపడ్డారు. 




ఇదీ జరిగింది


ఆగస్ట్ 13న బద్లాపూర్ స్కూల్‌లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య ఈ ఘటన జరిగింది. లైంగిక దాడి జరిగిన విషయాన్ని బాలికలు తమ కుటుంబ సభ్యులకు చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బాధిత బాలికల కుటుంబ సభ్యులు ఆగస్ట్ 16న పోలీసులకు విషయం చెప్పారు. అనంతరం బాలికలిద్దరికీ వైద్య పరీక్షలు చేయించడంతో నిజం వెలుగు చూసింది. ఈ ఘటనపై బద్లాపూర్‌లో భారీ నిరసనలు జరిగాయి. నిందితుడు అక్షయ్ శిందేను ఆగస్ట్ 17నే అరెస్ట్ చేసి కస్టడీకి పంపారు. 


Also Read: Snake Bite: పాముకాటుతో వ్యక్తి మృతి - అతని చితిపైనే పామును సజీవ దహనం చేసిన గ్రామస్థులు, ఎక్కడంటే?