Villagers Burnt Alive The Snake That Killed The Man In Chattishgarh: పాముకాటుతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా.. ఆ పామును గ్రామస్థులు అతని చితిపైనే పెట్టి సజీవ దహనం చేశారు. ఈ ఘటన ఛత్తీస్ గఢ్ (Chattishgarh) కోర్బా జిల్లాలోని (Korba District) బైగామర్ గ్రామంలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దిగేశ్వర్ రథియా అనే వ్యక్తిని శనివారం ఓ విషపూరిత పాము కాటు వేసింది. ఇంట్లో రాత్రి పడుకున్న సమయంలో పాము కాటు వేయగా గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం దిగేశ్వర్ ప్రాణాలు కోల్పోయాడు. ఈలోగా ఆ వ్యక్తిని కాటేసిన పామును ఇంట్లో స్థానికులు పట్టుకున్నారు.


చితిపై పాము సజీవ దహనం


మృతి చెందిన వ్యక్తికి ఆదివారం అంత్యక్రియలు నిర్వహిస్తోన్నసమయంలో అతని చావుకు కారణమైన పామును చితిపై సజీవంగా పెట్టి కాల్చేశారు. అంత్యక్రియల ఊరేగింపు సమయంలో దిగేశ్వర్ ఇంటి నుంచి పామును తాడుకు కట్టి దహనం చేసే ప్రదేశం వరకూ లాక్కెళ్లారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాము మరెవరినైనా కాటేస్తుందనే భయంతో అతని చితి మంటల్లోనే సజీవంగా వేయగా కాలి బూడిదైంది. మరోవైపు, ఈ ఘటనపై కోర్బా జిల్లా సబ్ డివిజనల్ ఆఫీసర్ అశిష్ ఖేల్వార్ స్పందించారు. పామును చంపిన గ్రామస్థులపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని.. పాములు, పాముకాట్ల పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తామని చెప్పారు.


Also Read: Viral Video: రీల్స్ కోసం వృద్ధుని ముఖంపై ఫోమ్ కొట్టిన యువకులు - పోలీసులు ఏం చేశారంటే?