Pawan Kalyan Comments On TTD Assets: తిరుమలలో లడ్డూ వివాదం కొనసాగుతోన్న వేళ తితిదే ఆస్తులపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan) కీలక ప్రకటన చేశారు. తిరుమల శ్రీవారి ఆస్తుల పరిరక్షణ బాధ్యత కూటమి ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరునిపై అచంచల విశ్వాసంలో లక్షలాది మంది భక్తులు ఆస్తులిచ్చారని.. వాటిని నిరర్థక ఆస్తులంటూ గత టీటీడీ పాలక మండలి అమ్మే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. గత ప్రభుత్వం భగవంతుడి ఆభరణాలకు, టీటీడీ ఆస్తులకు రక్షణ కల్పించిందా.? లేదా.? అనే కోణంలో విచారణ అవసరమని అన్నారు. శ్రీవాణి ట్రస్టుకు వచ్చిన విరాళాలు, ఖర్చుల లెక్కలు, స్వామి వారి ఆభరణాలను పరిశీలించాలని చెప్పారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.


సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి


టీటీడీకి ఏపీతో పాటు తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక ఇంకా చాలా రాష్ట్రాల్లో ఆస్తులున్నాయని.. ముంబయి, హైదరాబాద్ నగరాల్లో భవనాలున్నాయని పవన్ చెప్పారు. 'శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆస్తులను గత పాలకమండళ్లకు నేతృత్వం వహించిన వారు కాపాడారా.? వాటిని అమ్మేశారా.? అనే సందేహాలు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం శ్రీవారి ఆస్తులను పరిరక్షించే బాధ్యత తీసుకుంటుంది. గత పాలక మండళ్లు టీటీడీ ఆస్తులు విషయంలో చేసిన నిర్ణయాలపై సమగ్ర విచారణ జరిపించాలని సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తున్నా. అలాగే, తిరుమల శ్రీవారికి కొన్ని శతాబ్దాలుగా రాజులు, భక్తులు విలువైన నగలు, ఆభరణాలు అందజేశారు. వాటి జాబితాను పరిశీలించాలని టీటీడీ అధికారులకు సూచిస్తున్నా. ప్రతి భక్తుడి నుంచి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా రూ.10,500 తీసుకుని.. రూ.500కే బిల్లు ఇచ్చారు. ట్రస్ట్ ఏర్పాటు చేసినప్పటి నుంచి వచ్చిన ఆదాయాన్ని అప్పటి పాలక మండళ్లు ఎటు మళ్లించాయో కూడా విచారించాలని ఇప్పటికే సీఎంను కోరాను. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా కశ్మీర్ నుంచి బెంగాల్ వరకూ ఆలయాలు నిర్మించేస్తామని అప్పటి పాలకులు చెప్పారు. అసలు ఆ ఆలయాలు ఎవరి ద్వారా నిర్మాణం చేపట్టారు.?. ఆ సంస్థ ఏమిటి.? ఎంత మేరకు శ్రీవాణి ఆదాయం మళ్లించారో భక్తులకు తెలియజేయాల్సిన అవసరం ఉంది.' అని పవన్ పేర్కొన్నారు.


టీటీడీ మాత్రమే కాకుండా.. దేవాదాయ శాఖ పరిధిలోని అన్ని ఆలయాలు, సత్రాల ఆస్తుల విషయంలోనూ సమీక్ష అవసరం అని సీఎం చంద్రబాబుకు పవన్ కల్యాణ్ సూచించారు. ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టిన గత పాలకులు దేవుడి మాన్యాలు, ఆస్తుల జోలికి వెళ్లకుండా ఉంటారా.? అనే సందేహం ప్రజల్లో ఉందని.. ఆయా వివరాలు అందుబాటులోకి వస్తే దేవుడి ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా ఉండడం సహా.. ఆలయాల పాలక మండళ్లు జవాబుదారీతనంతో పని చేస్తాయని అన్నారు. ఇందుకు తగిన చర్యలను ప్రభుత్వం తీసుకుంటుందని పవన్ స్పష్టం చేశారు. అటు, తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న వివాదం సాగుతోన్న క్రమంలో పవన్ 11 రోజులు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు.


Also Read: CM Chandrababu: అమరావతిలో 100 ఎకరాల్లో లా కాలేజ్- న్యాయ శాఖపై సమీక్షలో చంద్రబాబు వెల్లడి