UP Police Arrested Young Men Who Doing Crazy Reels On The Road: తక్కువ టైంలో ఎక్కువగా ఫేమస్ అయిపోవాలని అందరికీ ఉంటుంది. దానికి యువతకు ఉండే ఏకైక మార్గం సోషల్ మీడియా. వ్యూస్, ఫాలోవర్స్ కోసం కొందరు పిచ్చి పిచ్చి రీల్స్ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటే.. మరికొందరు రహదారిపైనే ఇతరులకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తిస్తుంటారు. తాజాగా, అలాంటి ఘటనే యూపీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూపీ (UP) ఝాన్సీలో (Jhansi) నిత్యం రద్దీగా ఉండే నవాబాద్ ప్రాంతంలోని రోడ్డుపై ఇద్దరు యువకులు హల్చల్ చేస్తూ వికృత చేష్టలకు పాల్పడ్డారు. అదే రోడ్డులో ఓ వృద్ధుడు సైకిల్‌పై వెళ్తుండగా అతని పట్ల అనుచితంగా ప్రవర్తించారు. ఓ యువకుడు బైక్ నడుపుతుండగా.. వెనుక కూర్చున్న మరో యువకుడు వృద్ధుడి ముఖంపై తెల్లటి ఫోమ్ స్ప్రే చేశాడు. దీంతో సదరు వృద్ధుడు తీవ్ర ఇబ్బందికి గురయ్యాడు. కొంతదూరం వెళ్లాక మరో వ్యక్తితోనూ ఇలాగే ప్రవర్తించారు. ఈ తతంగాన్నంతా ఫోన్‌లో చిత్రీకరించారు. దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది.


నెటిజన్ల తీవ్ర విమర్శలు


యువకుల చేష్టలపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన మానాన తాను వెళ్తున్న వృద్ధునితో ఇలా ప్రవర్తించడం సరి కాదని.. వ్యూస్ కోసం ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడడం దారుణమని అన్నారు. రద్దీగా ఉండే ప్రాంతంలో వృద్ధుని ముఖంపై ఫోమ్ కొట్టడం వల్ల అతను కింద పడితే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదని పేర్కొన్నారు. ఎన్ని చర్యలు తీసుకున్నా కొంతమందిలో మార్పు రావడం లేదని వాపోయారు. ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కామెంట్స్ చేశారు.


యువకుని అరెస్ట్


అటు, ఈ వీడియో వైరల్ కాగా.. దీనిపై యూపీ పోలీసులు స్పందించినట్లు తెలుస్తోంది. నిందితున్ని అదుపులోకి తీసుకున్న తమదైన శైలిలో బుద్ధి చెప్పినట్లు సమాచారం. ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించినట్లు తెలుస్తోంది.






Also Read: US Indians : అమెరికాలో ఉద్యోగం పోతే 60 రోజులే గడువు - లేఆఫ్‌లతో విలవిల్లాడిపోతున్న ఇండియన్స్ - వెనక్కి రాక తప్పదా ?