Leaders Photoshoot In Front Of Tirumala: తిరుమల పుణ్యక్షేత్రానికి భక్తితో వస్తున్న భక్తులు తరచూ చేస్తున్న పనులు వివాదాస్పదమవుతున్నాయి. ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ప్రియురాలు దివ్వెల మాధురి ఫొటో షూట్ చేసి కేసుల్లో ఇరుక్కున్నారు. ఇప్పుడు మరో వైసీపీ సానుభూతిపరుడు కూడా తిరుమలలో ఫోటో షూట్ చేసి విమర్శలపాలు అవుతున్నారు. 


మాడ వీధుల్లో నలుగురు ఫొటోగ్రాఫర్లతో ఫొటోషూట్


తిరుమల శ్రీనివాసుడిని ఈ ఉదయం దర్శనం చేసుకున్న వైసీపీ సానుభూతిపరుడు, మైనింగ్ వ్యాపారి వంశీధర్ రెడ్డి మాడవీధుల్లో హల్ చల్ చేశారు. నలుగురు వ్యక్తిగత ఫొటోగ్రాఫర్లతో ఆలయం వద్ద ఫొటోలు తీసుకోవడం వివాదానికి దారి తీసింది. ఇదంతా చూస్తున్న భక్తులు ఏంటని ప్రశ్నిస్తే వారిని కూడా పట్టించుకోకుండా ఫొటో షూట్ కంటిన్యూ చేశారు. 


చూసి పట్టించుకోని టీటీడీ సిబ్బంది


ఇదంతా చూస్తున్న టీటీడీ సిబ్బంది కానీ, టీటీడీ విజిలెన్స్ అధికారులు కానీ వంశీధర్‌ రెడ్డి ఫొటో షూట్‌ గుర్తించి ఆపేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదు. ఫొటో షూట్‌ చేస్తున్న విషయాన్ని చిత్రీకరిస్తున్న మీడియాపై కూడా వంశీధర్ రెడ్డి అనుచరులు దురుసుగా ప్రవర్తించారు.


వంశీధర్ రెడ్డిని అరెస్టు చేయాలని జనసేన డిమాండ్


వంశీధర్‌ రెడ్డి ఇలా తిరుమల మాడవీధుల్లో ఫొటో షూట్ చేయడంపై జనసేన నేత కిరణ్‌ రాయల్ స్పందించారు. తిరుమల పవిత్రతను కాపాడేందుకు ఇలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భక్తి భావంతో వచ్చే వాళ్లకు మాత్రం అనుమతి ఇవ్వాలని ఇలాంటివి ప్రోత్సహిస్తే ప్రమాదకరమని అన్నారు. ఆయన్ని అరెస్టు చేస్తే భవిష్యత్‌లో ఇలాంటి పనులు చేయాలంటే భక్తులు భయపడతారని లేకుంటా ప్రతి ఒక్కరూ ఇలా చేస్తారని అన్నారు. 


Also Read: టీటీడీకి చెన్నైకి చెందిన భక్తుడు రూ.2.02 కోట్ల భారీ విరాళం


ప్రాంక్ చేసి విమర్శల పాలైన ప్రియాంక జైన్ 


ఈ మధ్యకాలంలో బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ ప్రియాంక జైన్‌ తన ప్రియుడు శివకుమార్‌తో కలిసి తిరుమల కొండపై హంగామా చేశారు. మెట్ల మార్గం ద్వారా నడుచుకొని కొండకు చేరుకోవాలని అనుకున్న వీళ్లిద్దరు మార్గ మధ్యలో భక్తులను భయపెట్టారు. ప్రాంక్‌ పేరుతో భక్తులను బెదరగొట్టారు. చిరుత పులి వచ్చిందని చెప్పి పరుగులు తీయడంతో వెనుక నుంచి వస్తున్న భక్తులు అటు నుంచి వెనక్కి పరుగెత్తారు. తర్వాత కాసేపటికి నవ్వుకుంటూ మాట్లాడుకున్న వీడియోను సోషల్ మీడియా పెట్టారు. ఇందులో చిరుత చూస్తున్నట్టు కెమెరా గ్రాఫిక్స్ చేసి కళ్లను పెట్టి ఇదిలో చిరుత అంటూ భయపెట్టారు. 


ఫొటో షూట్ చేసి కేసుల్లో ఇరుక్కున్న దివ్వెల మాధురి


అప్పుడెప్పుడో ఓసారి వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ తన ప్రియురాలు దివ్వెల మాధురితో తిరుమల దర్శించుకున్నారు. అక్కడ వెంకటేశ్వర స్వామి దర్శనం తర్వాత దివ్వెల మాధురి మాడ వీధుల్లో ఫొటోషూట్ నిర్వహించారు. ఈ వీడియో అప్పట్లో తెగ వైరల్ అయింది. దీనిపై స్పందించిన టీటీడీ ఆమెపై కేసు పెట్టింది. ఆమెకు నోటీసులు కూడా ఇచ్చారు. తర్వాత ఆ కేసు ఏమైందో ఎవరికీ తెలియదు. 


Also Read: తిరుచానూరు బ్రహ్మోత్సవాలకు వెళ్లేవారు వీటిని తప్పనిసరిగా సందర్శించండి!