Tiruchanur Sri Padmavati Ammavari Brahmotsavalu 2024: తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారికి ఏటా కార్తీకంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. శ్రీ పద్మావతీ అమ్మవారు కార్తీక మాసం శుక్లపక్షం పంచమి తిథి ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించింది. అందుకే ఆమె జన్మ నక్షత్రం సందర్భంగా ఏడా కార్తీకమాసంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈమేరకు నవంబరు 28 ఉదయం శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించారు. ఈ రోజు రాత్రి 7 నుంచి 9 వరకు శ్రీ పద్మావతి అమ్మవారు చిన్న శేష వాహనంపై మాడ వీధుల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
వ్యాస మహర్షి రచించిన స్కాంద పురాణం వేంకటాచల మహత్యంలో వివరించిన ప్రకారం... వైకుంఠానికి వెళ్లిన భృగుమహర్షి ..తనని లక్ష్మీనారాయణులు పట్టించుకోలేదనే ఆపోహతో ఆగ్రహం చెంది శ్రీ మహాలక్ష్మి దేవి స్థానమైన మహావిష్ణువు వక్షస్థలంపై కాలితో తంతాడు. ఆ సమయంలో కూడా అగ్రహం చెందని స్వామివారు..అయ్యో మీ పాదం కందిపోయిందే అంటూ అరిపాదంలో ఉన్న అహంకారానికి నిదర్శనం అయిన కన్నును చిదిమేస్తారు. అయితే లక్ష్మీదేవి మాత్రం భృగుమహర్షి తీరుకి ఆగ్రహం చెంది అక్కడి నుంచి భూలోకానికి వచ్చేసింది. లక్ష్మీ వియోగంతో నారాయణుడు భూలోకంలో తపస్సు చేశాడు. అప్పుడు ప్రశన్నురాలైన లక్ష్మీదేవి స్వర్ణముఖి నది తీరాన తిరుచానూరు పద్మసరోవరంలో కార్తీకమాసంలో బంగారుపూవులో ప్రత్యక్షమైంది. పద్మంలో ప్రత్యక్షమైందని పద్మావతి అని.. తమిళంలో అలర్ అంటే పూలు, మేల్ అంటే పైన..అని అర్థం..అందుకే అలమేలుమంగ అయిందని చెబుతారు పండితులు.
పురాణాల్లో ఉన్న మరో కథనం ప్రకారం త్రేతాయుగంలో సీత అనుకుని రావణుడు చెరబట్టిన వేదవతే పద్మావతిగా జన్మించిందని చెబుతారు. ఆ జనమలో తనని వివాహం చేసుకోమన్న వేదవతికి రాముడు మరు జన్మలో ఆ కోరిక తీరుతుందని మాటిచ్చాడు. అందుకు బదులుగా పద్మావతిగా జన్మించిన వేదవతిని వివాహం చేసుకున్నాడని అంటారు. శ్రీనివాసుడు శిలగా మారినప్పుడు శ్రీ మహాలక్ష్మి కొల్హాపూర్‌లో వెలసింది. పద్మావతి అలమేలుగా తిరుచానూరులో వెలసిందని వేంకటాచల మహత్యంలో ఉంది. ఏంతో విశిష్టత ఉన్న అమ్మవారి బ్రహ్మోత్సవాలు వీక్షిస్తే జన్మ ధన్యమైనట్టే అని భావిస్తారు భక్తులు.
బ్రహ్మోత్సవాలు ప్రారంభంలో భాగంగా నవంబరు 28న వేకువజామునే అమ్మవారికి సుప్రభాత సేవ, సహస్ర నామార్చన, నిత్య అర్చన నిర్వహించారు. అనంతరం 6.30 గంటలకు మాడ వీధుల్లో తిరుచ్చి ఉత్సవం జరిపి..ధ్వజస్థంభ తిరుమంజనం నిర్వహించారు. 9 గంటలకు బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ గజపటాన్ని ఆరోహణం చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో శ్రీ జె. శ్యామల రావు దంపతులు, అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవో శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ శ్రీధర్, డిప్యూటీ ఈవో శ్రీ గోవింద రాజన్, పాంచరాత్ర ఆగమ సలహాదారు శ్రీ మణికంఠ స్వామి, కంకణ భట్టార్ శ్రీ శ్రీనివాసాచార్యులు, అర్చకులు శ్రీ బాబు స్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు. అనంతరం ఈవో శ్రీ జె.శ్యామలరావు శుక్రవారపు తోటలో ఉద్యాన విభాగం ఏర్పాటు చేసిన పుష్పప్రదర్శన, శిల్ప కళాశాల ఏర్పాటు చేసిన శిల్పకళా ప్రదర్శన, ఆయుర్వేద ప్రదర్శనను ప్రారంభించారు. మాడవీధుల్లో ఉండే ప్రతి భక్తుడికి వాహనసేవ దర్శనం కల్పిస్తామన్నారు ఈవో శ్రీ జె. శ్యామల రావు. అమ్మవారి దర్శనకోసం వచ్చే భక్తులందరికీ మూలమూర్తి దర్శనభాగ్యం దక్కేలా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన గజవాహన సేవ, పంచమీ తీర్థం సేవకు భక్తులు భారీగా తరలి వస్తారని..ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. శుక్రవారపు తోటలో ఏర్పాటు చేసిన పుష్ప ప్రదర్శనను భక్తులు సందర్శించాలని పిలుపునిచ్చారు.
Also Read: గీతాజయంతి, ధనుస్సంక్రాంతి సహా 2024 డిసెంబర్ లో పండుగల జాబితా ఇదే!