Tirumala News: తిరుమల శ్రీవారి దర్శనం కోసం పరితపించే భక్తులకు.. స్వామి వారి లడ్డూ ప్రసాదం కల్తీ అయ్యింది అంటేనే తట్టుకోవడం కష్టం. అలాంటిది ఏకంగా లడ్డూలు వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని చెప్పడం అంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. భక్తులకు వాటి నుంచి పరిష్కారం చూపేందుకు టీటీడీ ఆగమ సలహా మండలి నిర్ణయం ప్రకటించింది.
మూడు రోజులపాటు పవిత్రోత్సవాలు
తిరుమల శ్రీవారి ఆలయంలో ఏడాది పాటు అర్చకుల, ఉద్యోగులు, సిబ్బంది, భక్తుల వల్ల తెలిసి లేదా తెలియక జరిగే అపచారాలకు పరిష్కారం గా టీటీడీ వైఖానస ఆగమ సాంప్రదాయ పద్ధతిలో మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఆగస్టు 15 నుంచి 17 వరకు ఆలయంలో పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. తొలిరోజు పవిత్ర ప్రతిష్ట, రెండో రోజు పవిత్ర సమర్పణ, మూడో రోజు పూర్ణాహుతి, పవిత్ర వితరణ చేపట్టారు. లడ్డూ వివాదం చోటు చేసుకుందని టీటీడీ వారు చెబుతున్న ప్రకారం జులై నెలలో కాబట్టి ఆగస్టు నెల లో జరిగిన పవిత్రోత్సవాలతో ఆ దోషం పోయింటుందని ఆగమ సలహా మండలి, జీయంగార్లు, అర్చకులు టీటీడీ ఈవో శ్యామల రావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి తో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి తెలియజేశారు.
త్వరలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు
తిరుమల శ్రీవారి ఆలయంలో త్వరలో బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. అంతకుముందు వచ్చే మంగళవారం అంటే అక్టోబర్ 1వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. ఆలయం లోని ప్రతి వస్తువు, గర్భాలయం, గోడలు, పై కప్పు, ఉప ఆలయాలు ఇలా అన్నింటిని నీటితో శుభ్రం చేస్తారు. ఆ తరువాత వివిధ సుగంధ ద్రవ్యాలతో కలగలిపిన మిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణ చేస్తారు. ఇది కూడా ఆలయ శుద్ధి కిందకి వస్తుంది. అయితే లడ్డూ వివాదం శాస్త్ర బద్దంగా తొలగిపోయినా.. శ్రవణం ( వినడం) ద్వారా పాప దోషం పోవడానికి, భక్తుల్లో ధైర్యం నింపేందుకు టీటీడీ ఆగమ సలహా మండలి శాంతి హోమం నిర్వహించాలని తలపెట్టింది.
Also Read: Chandrababu On Tirumala Laddu: వెంకటేశ్వరస్వామి వాళ్ల అకౌంట్స్ సెటిల్ చేస్తాడు - లడ్డూ వివాదంపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
శాంతి హోమం నిర్వహణ
తిరుమల శ్రీవారి ఆలయంలోని బంగారు బావి సమీపంలో ఉన్న యాగశాలలో ఈ 23న సోమవారం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఈ శాంతి హోమం నిర్వహిస్తారు. ఇందులో మూడు హోమం గుండాలను ఏర్పాటు చేసి అందులో శాంతి హోమం చేపడుతారు. వాస్తు హోమం జరగనుంది. లడ్డూ తయారు చేసే పోటులోని శ్రీకృష్ణ స్వామి వారి సహా పోటును, అన్నప్రసాదాల తయారీ వద్ద పంచగవ్యాలతో ప్రోక్షణం చేయనున్నారు. ఇందుకోసం 8 మంది తిరుమల శ్రీవారి ఆలయంలోని అర్చకులు, ఆగమ సలహాదారులు హోమం నిర్వహిస్తారు. టీటీడీ అధికారులు వాటిని పర్యవేక్షిస్తారు.
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుంచి 12 వ తేదీ వరకు జరుగుతాయి. ఇందుకు సంబంధించిన ఆహ్వాన పత్రికలను వేరువేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు టీటీడీ ఈవో శ్యామల రావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి అందజేసి ఆహ్వానం పలుకారు.
Also Read: Tirupati Laddu Row: తిరుమల లడ్డూ వివాదంపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం