SIT to investigate on Tirumala ghee adulteration | అమరావతి: దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన తిరుమలలో ప్రసాదాల కల్తీ అంశంపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తిరమలలో కల్తీ నెయ్యితో ప్రసాదాల తయారీతో స్వామివారి పవిత్రతను దెబ్బతీయడాన్ని సీఎం చంద్రబాబు సీరియస్ గా తీసుకున్నారు. తిరుమల వివాదంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టేందుకు సిట్ ఏర్పాటు చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు (AP CM Chandrababu) ప్రకటించారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో తిరుమలలో ఇంకా ఏం తప్పిదాలు జరిగాయో ఐజీ స్థాయి అధికారితో దర్యాప్తు చేపిస్తామని చెప్పారు. సిట్ నివేదిక ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వెంకటేశ్వరస్వామి పవిత్ర క్షేత్రం తిరుమలకు పూర్వవైభవం తీసుకొస్తామన్నారు.
ఆలయాలపై, అధికార దుర్వినియోగంపై సిట్ దర్యాప్తు
ఐజీ లేక అంతకంటే ఉన్నతస్థాయి అధికారితో ఏర్పాటు చేయనున్న ఈ సిట్ తిరుమల లడ్డూల్లో జంతువుల కొవ్వు, అధికార దుర్వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. భవిష్యత్తులో ఆలయాలపై, ప్రసాదాలపై ఇలాంటి తప్పిదాలు, అపచారం జరగకుండా.. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి ఆలయానికి ఓ నియమం, కొన్ని నిబంధనలు ఉంటాయి. కనుక వాటిని గౌరవిస్తూనే, అంతా సక్రమంగా ఉండేలా నిబంధనలు తీసుకొస్తాం. ఏ మతానికి సంబంధించిన ప్రార్థనాలయాలు, ఆలయాలలో ఆ మతానికి సంబంధించిన వారినే నియమించాలి. ఆ మతంపై నమ్మకం ఉన్నవారే, మతానికి చెందిన వారిని మేనేజ్ మెంట్ బోర్డులో ఉండేలా చూస్తాం. నేరస్తులు, సంఘ విద్రోహక శక్తులకు ఇలాంటి పవిత్రమైన ప్రార్థనాలయాలు ఆలయాలు, మసీదులు, చర్చిలలో చోటు లేకుండా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు తెలిపారు. మతసామరస్యాన్ని కాపాడుకుంటూనే ఇతర మతాల వారిని ఇబ్బంది పెట్టకుండా అవసరమైతే ఓ ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తామని పేర్కొన్నారు.
పాపపరిహారం కోసం నిర్ణయంపై సీఎం ప్రకటన
స్వామివారే తన పూర్వవైభవం కాపాడుకుంటారు. మనం ఇందుకోసం చేయాల్సిందేమీ లేదు. టీటీడీ ఇప్పటికే రెండు పార్టులు. ఆగస్టు 15న బ్రహ్మోత్సవాలకు మునుపే ఓ పవిత్రమైన యాగం చేస్తారు. తెలిసో తెలియకో చేసిన తప్పిదాలను మన్నించాలని స్వామివారిని ప్రార్థిస్తూ మూడు రోజులపాటు యాగం చేస్తారు. అప్పటికే ఏఆర్ కంపెనీ నుంచి వచ్చిన నెయ్యిని వాడారు. ఆ నెయ్యి శాంపిల్స్ పంపిస్తే పరీక్షించిన అనంతరం తప్పిదం జరిగిందని తేలింది. దాంతో ఆగమసలహా మండలి సమావేశమై ఆలయప్రోక్షణపై ఏం చేస్తే బాగుంటుందని సుదీర్ఘంగా చర్చించారు. శాంతిహోమం చేయాలని ఓ నిర్ణయానికి వచ్చారు. సోమవారం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు, పంచగవ్య ప్రోక్షణ నిర్వహించనున్నారు. గోవు నెయ్యి, పాలతో ప్రోక్షణ చేయాలని నిర్ణయించినట్లు చంద్రబాబు తెలిపారు. అన్ని ఆలయాలలో తనిఖీలు చేసి, ఎక్కడైనా తప్పిదం జరిగితే పరిహారం చేయాలని సూచించారు. గతంలో యాగాలు, ప్రత్యేక పూజలు చేయకపోతే ఇప్పుడు చెక్ చేసుకుని చర్యలు తీసుకోవాలని మంత్రికి సూచించినట్లు చెప్పారు.