Gutka Packet found in Tirumala Laddu in Khammam | ఖమ్మం: కోట్లాది హిందువులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ కల్తీపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో మరో అపచారం జరిగింది. తిరుమల లడ్డూ మరోసారి అపవిత్రమైందంటూ ఖమ్మంలో జరిగిన ఘటన హాట్ టాపిక్‌గా మారింది. తిరుమల లడ్డూలో గుట్కా ప్యాకెట్ రావడం కలకలం రేపుతోంది. ఇప్పటికే  తిరుమల లడ్డూలో పందికొవ్వు, జంతువుతల కొవ్వు కలిసిన నెయ్యి వినియోగించారని రిపోర్టులలో తేలడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. వరుస ఘటనలతో తిరుమల శ్రీవారి భక్తులు లడ్డూ పవిత్రతను ఎందుకు కాపాడలేకపోతున్నారు, టీటీడీలో ఏం జరుగుతోంది ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని వాదనలు తెరమీదకు వస్తున్నాయి.




శ్రీవారి భక్తులు ఎంతో పవిత్రంగా భావించే తిరుపతి లడ్డు మరోసారి అపవిత్రమైంది. ఖమ్మం జిల్లా గొల్లగూడెం పంచాయతీ పరిధిలోని కార్తికేయ టౌన్ షిప్ లో ఉంటున్న దొంతు పద్మావతి తన బంధువులతో కలిసి సెప్టెంబర్ 19న తిరుపతికి వెళ్లారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. మిగతా భక్తులలాగే తన బంధువులకు, సన్నిహితులకు పంచెందుకు తిరుమల లడ్డూను ప్రసాదంగా తీసుకొచ్చారు. శ్రీవారి లడ్డూని పంచేందుకు తెరిచి చూడగా..  ఆ పేపర్లో గుట్కా ప్యాకెట్, చిన్న పొగాకు ముక్కలు కనిపించడంతో ఆమెతో పాటు ఇరుగుపొరుగు వారు ఒక్కసారిగా షాకయ్యారు.


లడ్డూ ప్రసాదంపై భక్తుల ఆందోళన..


ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు ఎంతో పవిత్రంగా భావించే శ్రీవారి ప్రసాదంలో ఇలాంటివి రావడం ఏంటని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అసలే శ్రీవారి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిసిన నెయ్యి వాడినట్లు రిపోర్ట్స్ లో తేలినట్లు టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడించడం సంచలనంగా మారింది. ఈ క్రమంలో లడ్డూ ప్రసాదంలో అపవిత్రమైన పదార్థాలు రావడంతో తిరుమల శ్రీవారి పవిత్రతకు భంగం వాటిల్లిందంటున్నారు. శ్రీవారి ప్రసాదాల తయారీలో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లడ్డు ప్రసాదంలోకి పొగాకు పొట్లం ఎలా వచ్చిందని శ్రీవారి భక్తులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ప్రభుత్వం దీనిపై స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని.. శ్రీవారి ప్రసాదాలపై భక్తులకు నమ్మకం కలిగేలా చూడాలని కోరారు. 



Also Read: Tirumala Laddu News: తప్పు చేస్తే రక్తం కక్కుకుని చావాలి - తిరుమల లడ్డూ వివాదంపై భూమన సంచలన వ్యాఖ్యలు


తాము ఏ తప్పు చేయలేదని, రాజకీయ ప్రయోజనాల కోసం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వైసీపీపై, మాజీ సీఎం జగన్ పై ఆరోపణలు చేస్తున్నారని టీటీడీ మాజీ ఛైర్మన్లు భూమన కరుణాకర్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అంటున్నారు. వంద రోజుల పాలనలో సూపర్ సిక్స్ అమలు చేయడం లేదని ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుండగా, కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని మాజీ సీఎం జగన్ సైతం ఘాటుగా స్పందించారు. లడ్డూలో కల్తీపై, తిరుమలపై దుష్ప్రచారం జరుగుతోందని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీకి వైసీపీ అధినేత వైఎస్ జగన్ లేఖ రాశారు.