Tirumala Laddu Adulterated ghee | తిరుపతి: ఏపీ సీఎం చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలని కుట్ర చేస్తున్నారు, అందులో భాగంగా తిరుమల శ్రీవారిని పావుగా వాడుకునే ప్రయత్నం బలంగా చేస్తున్నారని టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ఆరోపించారు. భూమన ఆదివారం నాడు మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. విజిలెన్స్ కమిటీ ద్వారా మూడు నెలలు తర్వాత సైతం ఆశించిన ఫలితాలు రాలేదని చంద్రబాబు తిరుమల అంశంపై కుట్ర చేశారని, ఏకంగా స్వామి వారికి కలంకం అంట కడుతున్నారని మండిపడ్డారు. స్వామివారికి, భక్తులకు ఎంతో ప్రీతి పాత్రమైన లడ్డూలో నెయ్యికి బదులుగా జంతు కొవ్వు వాడుతున్నారంటూ చంద్రబాబు ప్రచారం చేయడం ఘోరమైన నేరం అన్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఈ అన్యాయాలు చూస్తూ ఊరు కోరని, తప్పు చేసిన వారు రక్తం కక్కుకుని చావాలన్నారు. తప్పు చేసిన వారికి తగిన శాస్తి జరగాలని శ్రీ వేంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తానన్నారు. 


చంద్రబాబును చూసి శకుని పారిపోయేవాడు 
‘రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉంది చంద్రబాబు హత్య రాజకీయాల కంటే ఘోరమైన ఆరోపణలు చేశాడు. భక్తులు మనోభావాలను దెబ్బతీసేందుకు చంద్రబాబు పూనుకున్నారు. తిరుమలపై చంద్రబాబు ఆరోపణలు నిరూపించడానికి సుప్రీం కోర్టు విచారణ జరపాలని కోరుతున్నాం. ప్రధాని నరేంద్ర మోదీ ఈ వివాదంపై జోక్యం చేసుకోవాలి. అప్పట్లో ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నేడు పులమాలలు వేస్తున్నాడు. ఇప్పుడు శకుని బతికి ఉంటే, చంద్రబాబును చూసి బావురుమనే వాడు, భయపడి పారిపోయేవాడు. చంద్రబాబు బెదిరించిన తరువాత టీటీడీ ఈవో శ్యామలరావు సైతం సీఎం చెప్పినట్లుగానే పంది కొవ్వు, చేప నూనె నెయ్యిలో కలిశాయని చెప్తున్నారు. తప్పు చేసిన వారు రక్తం కక్కుకుని చావాలని తిరుమల శ్రీవారిని ప్రార్థిస్తున్నాం. 


చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వాడని నెయ్యిని వాడారంటూ అబద్ధాలు చెబుతున్నారు. టీడీపీ హయాంలో 6 నెలలు నందిని డైరి వాడారనే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. అతి తక్కువ ధరకు నెయ్యి సరఫరా అప్పుడెలా జరిగింది. చంద్రబాబు హయాంలో 14 సార్లు తిరిగి పంపించింది వాస్తవం కాదా ? అప్పటి టిటిడి హెల్త్ ఆఫీసర్ శర్మిష్ఠ ఈ విషయం చెప్పలేదా. అప్పటి నెయ్యి కంపెనీలో వైసీపీ హయాంలో సరఫరా చేస్తున్నది వాస్తవం కాదా. కలుషితం అయింది చంద్రబాబు బుద్ధి, మనసు. 100 రోజులు పాలనలో ఇచ్చిన హామీలు విస్మరించారని’ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు.



మైసూరు ఎన్.ఎఫ్.టి.ఆర్.ఐ రిపోర్టును రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు బయట పెట్టలేదు. టీడీపీ ఆఫీసుకు రిపోర్ట్ ఎందుకు వెళ్లింది. నెయ్యి కొనుగోలుకు నిపుణులు కమిటీతో పాటు టీటీడీ పాలక మండలి సభ్యులు కూడా ఉంటారు. ఏపీ మంత్రిగా ఉన్న కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, వైద్య నాథన్ కృష్ణస్వామి ఉన్నారు. ఏ విచారణకు అయినా మేం సిద్ధం.  ఆరోపణలపై విచారణకు మేము సిద్ధం. చంద్రబాబు పాలనలో ఏ రోజైనా సనాతన హైందవ కార్యక్రమాలు ఎప్పుడైనా చేశారా. తప్పు చేశామని ప్రకటించి ప్రాయశ్చిత్తం చేసుకోండి.  


ఎస్వీబీసీ ఛానెల్ మేం ప్రారంభించాం. దళిత వాడలకు దళిత గోవిందం పేరుతో గొప్ప కార్యక్రమం చేశాం. వేద విశ్వ విద్యాలయం స్థాపించాం. 2 లక్షలు వేద విద్యార్థులు పేరుతో డిపాజిట్ చేశాం. గిరిజన గోవిందం, మత్స్య గోవిందం కార్యక్రమాలు చేశాం. శ్రీవారి కళ్యాణోత్సవాలు నిర్వహించాం. 36,000 పేద జంటలకు కల్యాణోత్సవం పేరుతో బంగారు తాళి బొట్లు ఇచ్చి దళిత, బలహీన వర్గాల పెళ్లిళ్లు చేశాం. అన్నమయ్య ఉత్సవాలు నిర్వహించాం. 75 మంది వేద పండితులతో విధ్వత్ సదస్సు నిర్వహించాం. చిన్న పిల్లలకు దైవ భక్తి పెంచేదుకు రామ కోటి, గోవిందా కోటి  పెట్టీ స్వామి దర్శనం పెట్టాం. కోటి భగవత్ పుస్తకాలు ఉచితంగా అందించి’ ఎన్నో కార్యక్రమాలు వైసీపీ హయాంలో చేశామన్నారు.



చంద్రబాబు పాలనలో మద్రాస్ స్టోర్ కు చెందిన ఓ గెస్ట్ హౌస్ లో వ్యభిచారం నిర్వహించారు. స్వామి వారి అన్న ప్రసాదాలు ఉచితంగా అందించే కార్యక్రమ మేము చేశాం. క్యూ లైన్ లో ఉన్న భక్తులకు అన్న ప్రసాదాలు అందించాం. అఖండ హరినామ సంకీర్తన కార్యక్రమాలు చేసింది మా పాలనలోనే...  దివ్య దర్శనం టోకెన్లు, చంటి పిల్లలకు దైవ దర్శనం మా పాలనలోనే చేశాం. తిరుమలకు వెళ్ళే భక్తుడు ప్రతి ఒక్కరూ తిరునామం తిలక ధారణ చేయాలని అమలుచేశాం. తిరుమల మాడ వీధుల్లో చెప్పులతో తిరగకూడదని పవిత్ర వీధులుగా వైసీపీ పాలనలోనే చేశాం. - టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి


జగన్ మోహన్ రెడ్డి పాలనలోనే స్వచ్ఛమైన ఆవు నెయ్యి తో నవనీత సేవ ప్రారంభించాం. భక్తి చైతన్య రథాలు చేశాం. నాటు ఆవులతో స్వచ్ఛమైన 60 కిలోల నెయ్యి, నవనీతం సేవ చేశాం. తిరుమల నెయ్యి కల్తీపై, అవకతవకలపై సీబీఐ విచారణ చేపట్టాలి. తిరుమల కొండపై ల్యాబ్  ఉంది. కానీ సరైన రిపోర్ట్ వచ్చే ల్యాబ్ లేదని ఈవో చెప్తున్నారు. చంద్రబాబుకు పాప పరిహారం తప్పదు. చేసిన తప్పుకు చంద్రబాబు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నారు. అందుకే తిరుమల ఆలయ శుద్ధి అంటున్నాడు. ఆలయ శుద్ధి గురించి ఆగమ పండితులు చెప్పాలి కానీ, సీఎం చంద్రబాబు ఎలా చెబుతారు. శ్రీ వైష్ణవులు చేతిలో లడ్డూ తయారవుతోంది. శ్యామల రావు టిటిడి ఈవోగా కాకుండా చంద్రబాబు వద్ద ఉద్యోగిగా పనిచేస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయ ప్రతిష్ట దిగదార్చేలా ఎవరు మాట్లాడినా కచ్చితంగా ఖండించాలి. ఇది ఏ పార్టీకి సంబంధించిన విషయం కాదు. - టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి