TTD Maha Shanti Yagam: తిరుమల శ్రీవారి ఆలయంలో రేపు మహా శాంతి యాగాన్ని నిర్వహించేందుకు టీటీడీ శరవేగంగా ఏర్పాట్లు చేస్తుంది. ఆలయంలోని యాగ శాలలో అర్చకులు ఈ హోమం నిర్వహించనున్నారు. రేపటి రోజున రోహిణి నక్షత్రం శ్రీవారికి ముహూర్త బలం కావడంతో.. రేపు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మహా శాంతి హోమాన్ని అర్చకులు నిర్వహించనున్నారు. ముందుగా మహశాంతి యాగం, వాస్తు హోమం నిర్వహిస్తారు. చివరిగా పంచగవ్యాలతో సంప్రోక్షణను అర్చకులు నిర్వహించనున్నారు. శ్రీవారికీ నిర్వహించే ఆర్జిత సేవలకు ఆటంకం కలగకుండా ఒక్క రోజు మాత్రమే యాగం నిర్వహించేలా ఆగమ పండితులు నిర్ణయించారు.


తిరుమల బ్రహ్మోత్సవాలకి చంద్రబాబుకు ఆహ్వానం
పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో అక్టోబర్ 4వ తేదీ నుంచి జరిగే బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను టీటీడీ ఆహ్వానించింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చిన దేవస్థానం ఈవో  జె.శ్యామలరావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి ముఖ్యమంత్రికి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక అందించి...బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా అర్చకులు, వేదపండితులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆశీర్వచనం ఇచ్చి, తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయ అధికారులకు, పండితులకు ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు.


సెప్టెంబ‌రు 28 - 30 వ‌రకు కీలపట్ల శ్రీకోనేటిరాయస్వామివారి పవిత్రోత్సవాలు


కీలపట్ల శ్రీ కోనేటిరాయస్వామివారి ఆలయంలో సెప్టెంబ‌రు 28 నుంచి 30వ తేదీ వ‌రకు పవిత్రోత్సవాలు నిర్వహించ‌నున్నారు. సెప్టెంబ‌రు 27న సాయంత్రం పుణ్యాహవచనం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణంతో పవిత్రోత్సవాలు ప్రారంభం అవుతాయి. సెప్టెంబ‌రు 28వ తేదీ రక్షబంధనం, పవిత్రప్రతిష్ఠ, శేయాధివాసం, సెప్టెంబ‌రు 29న ఉదయం స్నపన తిరుమంజనం, పవిత్ర సమర్పణ, సాయంత్రం పవిత్ర హోమం, తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు. సెప్టెంబ‌రు 30న ఉద‌యం హోమాలు, సాయంత్రం మహాపూర్ణాహుతితో ప‌విత్రోత్సవాలు ముగుస్తాయి. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భక్తి సంగీతం, హరికథ, దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.