Pawan Kalyan Fan Dies of Electric shock | తిరుపతి: టాలీవుడ్ పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. నేడు పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు జనసేనానిని పుట్టినరోజు వేడుకలు జరుపుతున్నారు. ఈ క్రమంలో చంద్రగిరి నియోజకవర్గంలోని అనుపల్లిలో విషాదం నెలకొంది. పవన్ కళ్యాణ్ బ్యానర్ కడుతూ ఇద్దరు యువకులు విద్యుత్ షాక్ కి గురయ్యారని తెలుస్తోంది. వీరిలో గోపి అనే యువకుడు మృతిచెందారు. మధు అనే యువకుడికి తీవ్ర గాయాలు కాగా, చికిత్స నిమిత్తం తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
గతంలో పవన్ కళ్యాణ్ స్టార్ హీరోగా ఉన్నప్పుడే జనసైనికులు, ఫ్యాన్స్ ఆయన పుట్టినరోజును ఘనంగా సెలబ్రేట్ చేసేవారు. ముఖ్యంగా పవన్ సినిమా రీ రిలీజ్ కోసం ఎదురుచూసేవాళ్లు. ఈసారి పవన్ బర్త్ డే సందర్భంగా బ్లాక్ బస్టర్ మూవీ గబ్బర్ సింగ్ థియేటర్లలో రీ రిలీజ్ చేశారు. థియేటర్ల మరోసారి సందడి చేస్తున్నారు పవన్ ఫ్యాన్స్. అయితే రెండు, మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పలు ప్రాంతాల్లో పవన్ పుట్టినరోజు వేడుకలకు అభిమానులు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. కొన్నిచోట్ల పెద్ద సెంటర్లలో థియేటర్ల వద్ద పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టి సందడి చేస్తున్నారు. కానీ చిన్నచిన్న పొరపాట్ల కారణంగా అనుకోని ప్రమాదాలకు గురవుతుంటారు. బ్యానర్లు కడుతుంటే కరెంట్ తీగలు తగిలి విద్యుత్ షాక్ తో ప్రాణాలు కోల్పోతున్నారు. కొన్ని సందర్భాలలో ఫ్లెక్సీలు కడుతూ చాలా ఎత్తు నుంచి కింద పడి తీవ్రంగా గాయపడని సందర్భాలు సైతం ఉన్నాయి.
బర్త్‌డే వేడుకలకు పవన్ కళ్యాణ్ దూరం
పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం, మరొకొన్ని ఆయన వద్ద ఉన్నాయి. తాజా పుట్టినరోజు కేవలం నటుడిగా కాకుండా, రాజకీయ నేతగా ఆలోచించారు పవన్. భారీ వర్షాలతో ఏపీలో పలు జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. దాంతో ఈ ఏడాది పుట్టినరోజు వేడుకలు జరుపుకోకూడదని పవన్ కళ్యాణ్ తన నిర్ణయాన్ని ప్రకటించారు. నేడు తన పుట్టినరోజు సందర్భంగా వర్షాలు, వరద బాధితులకు సహాయం చేయాలని జనసేన నేతలు, కార్యకర్తలు, అభిమానులకు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. బాధితులకు అండగా నిలబడి, స్వచ్ఛందంగా సేవా కార్యకర్రమాల్లో పాల్గొని సామాన్యులకు సహకారం అందించాలని సూచించారు.