10 unknown facts about Tirumala Tirupati Temple తిరుమ‌ల‌లో ఏడుకొండ‌ల‌పై కొలువుదీరి ఉన్న క‌లియుగ దైవం శ్రీవేంక‌టేశ్వ‌ర స్వామి అత్యంత శ‌క్తివంత‌మైన దేవుడిగా ప్ర‌జ‌ల నుంచి పూజ‌లందుకుంటున్నారు. ప్ర‌పంచంలోనే అత్యంత శ‌క్తివంత‌మైన దేవునిగా వేంక‌టేశ్వ‌ర‌స్వామిని ఆరాధించి మొక్క‌లు చెల్లిస్తుంటారు. అయితే ఆ తిరుమ‌ల తిరుప‌తి ఆల‌యం చుట‌టూ ఎన్నో ర‌హ‌స్యాలు దాగి ఉన్నాయి. వాటిలో ఆశ్చ‌ర్య‌ప‌రిచే 10 నిజాలు మీకోసం... 


1. ఆరాధన‌ల కోసం ఎవ‌రికీ తెలియ‌ని గ్రామం
శ్రీవారి పూజ‌కు ఉప‌యోగించే పూలు, పాలు,వెన్న, ప‌విత్ర‌మైన మూలిక‌ల ఆకులు.. ఇలా ప్ర‌త్యేకమైన ఎన్నో వ‌స్తువులు తిరుమ‌ల‌కు దాదాపు 22 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న ఒక ర‌హ‌స్య గ్రామం నుంచి మాత్ర‌మే సేక‌రిస్తారు. ఈ గ్రామం ఎక్క‌డుంది, గ్రామం పేరు ఏమిట‌న్న‌ది ర‌హ‌స్యంగా ఉంచుతున్నారు. మరో ముఖ్య విష‌యం ఏంటంటే ఆ గ్రామంలోకి ఆ ఊరి వారు త‌ప్ప కొత్త‌వారికి ప్ర‌వేశం కూడా ఉండ‌దంటే ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు. స్వామి వారి గ‌ర్భ‌గుడిలో పూజ‌ల‌కు అవ‌స‌ర‌మయ్యే వ‌స్తువుల‌న్నీ అక్క‌డి నుంచే సేక‌రిస్తారు. అందుకే ఆ ఊరి పేరును ర‌హ‌స్యంగా ఉంచుతున్నారు, ఆ ఊరి ప్ర‌జ‌లు కూడా అంతే భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో న‌డుచుకుంటున్నారు. 


2. శ్రీవారి విగ్ర‌హం ఒక మూల‌న ఉంటుంది


 శ్రీవారి విగ్ర‌హం ఆల‌యంలోని గ‌ర్భ‌గుడిలో మ‌ధ్య‌లో ఉన్న‌ట్టు క‌నిపిస్తుంది. కానీ నిజానికి శ్రీవారి మూర్తి గర్భగుడిలో కుడివైపున ఒక మూల‌న ఉంటుంది.  స్ప‌ష్టంగా గ‌మనిస్తే తప్ప ఈ విష‌యం ఎవ‌రికీ అంత ఈజీగా అర్థం కాదు.
 
3. శ్రీవారికి నిజమైన జుట్టు:
తిరుమ‌ల వేంక‌టేశ్వ‌రుడికి త‌ల‌పై నిజ‌మైన మృదువైన జుట్టు ఉందంటే న‌మ్ముతారా..?  ఈ జుట్టు వెనుక ఒక క‌థ కూడా ప్రాచుర్యంలో ఉంది. 
తిరుమ‌ల శ్రీవారు భూమిపై తిరుగాడే స‌మ‌యంలో ఊహించ‌ని ప్ర‌మాదంలో త‌న జుట్టులోని కొంత భాగాన్ని కోల్పోతారు. ఇది గ‌మ‌నించిన నీలాదేవి అనే గంధ‌ర్వ యువ‌రాణి త‌న జుట్టులో కొంత భాగం క‌త్తిరించి శ్రీవారికి భ‌క్తితో స‌మ‌ర్పిస్తుంది. ఆమె భ‌క్తికి మెచ్చిన వేంక‌టేశ్వ‌రుడు ఎవ‌రైతే త‌న‌ను ద‌ర్శించి త‌ల‌నీలాలు స‌మ‌ర్పిస్తారో వారికి స‌దా త‌న అనుగ్ర‌హం ఉంటుంద‌ని హామీ ఇచ్చార‌ని ప్ర‌తీతి. అప్ప‌ట్నుంచి భ‌క్తులు శ్రీవారిని ద‌ర్శించుకుని త‌ల‌నీలాలు స‌మ‌ర్పించుకోవ‌డం చేస్తుంటారు. 



4. శ్రీవారి విగ్రహం వెనుక సముద్ర ఘోష:
శ్రీవారి విగ్రహం వెనుక వైపు నుంచి ఎప్పుడూ సముద్రపు ఘోష వినిపిస్తుంటుంది. స్వామి వారి విగ్రహం వెనుక చెవి పెట్టి వింటే ఇది స్పష్టంగా తెలుస్తుంద‌ని చెబుతుంటారు. శ్రీవారికి సేవ చేసే అర్చకులకు తప్ప సాధారణ భక్తులకు ఆ శ‌బ్దం వినే యోగం లేదు. 



5. కొండెక్కని దీపాలు:


ఆలయ గ‌ర్భ‌గుడిలో శ్రీవారి ముందు వెలిగించే దీపాలు కొన్ని వేల సంవ‌త్స‌రాలుగా కొండెక్క‌కుండానే వెలుగుతున్నాయి. ఎవ‌రు వెలిగించార‌నే దానిపై స్ప‌ష్ట‌త లేక‌పోయినా అప్ప‌ట్నుంచి శ్రీవారి ముందున్న దీపాలు దేదీప్య‌మానంగా వెలుగుతూనే ఉండ‌టం విశేషం. స్వామి వారి ద‌ర్శ‌నానికి వ‌చ్చే భ‌క్తుల నిర్మ‌ల‌మైన హృద‌యాల‌కు ప్ర‌తీక‌లుగా ఇవి నిలుస్తుంటాయి. 


6. స్వామివారి నిజ‌రూప ద‌ర్శ‌నం 


19వ శ‌తాబ్దంలో దారుణ‌మైన నేరాల‌కు పాల్ప‌డిన 12 మంది నేర‌స్తుల‌కు ఆ ప్రాంతానికి చెందిన రాజు మ‌ర‌ణ‌శిక్ష విధిస్తాడు. శిక్ష‌లో భాగంగానే వారికి ఉరిశిక్షను విధిస్తారు. ఉరిశిక్ష అనంత‌రం వారి మృతేదేహాల‌ను ఆల‌య గోడ‌ల‌కు వేలాద‌దీశార‌ని ప్ర‌చారంలో ఉంది. అప్పుడే గ‌ర్భ గుడిలో ఉన్న స్వామివారు నిజ‌రూపంలో అక్క‌డున్న‌వారికి క‌నిపించార‌ని ప్ర‌తీతి.


7. నిత్యం తేమ‌తో శ్రీవారి ప్ర‌తిమ:


శ్రీవారి విగ్ర‌హం వెనుక ఓ అంతుబ‌ట్ట‌ని ర‌హ‌స్యం దాగి ఉంది. శ్రీవారి విగ్రహం నిత్యం తేమతో త‌డిచి ఉంటుంది. పూజారులు  విగ్ర‌హాన్ని ఎన్నిసార్లు తుడిచినా పొడిగా మార‌డం లేదు. దానివెనుక కార‌ణం ఇప్ప‌టికీ మిస్ట‌రీగానే ఉండిపోయింది. 


8. గర్భగుడిలో పూలు వెర్పేడులో ప్రత్యక్షం:


నిత్యం తిరుమల వేంకటేశ్వరున్ని అనేక పూలతో ఆరాధ‌న చేస్తుంటారు. పూజా కార్య‌క్ర‌మాల అనంత‌రం పూజారులు ఆ పూల‌ను గర్భగుడిలో స్వామి వారి విగ్రహం వెనుక ఉన్న జలపాతంలోకి వెనక్కి చూడకుండా వేస్తారు. కానీ ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యం ఏంటంటే జ‌ల‌పాతంలో ప‌డేసిన ఆ పూలు తిరుపతికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేర్పేడు (శ్రీ కాళహస్తికి వెళ్లే దారి) లో కనిపిస్తాయి.


9. రసాయనాలకు చెక్కు చెదరని విగ్రహం:


తిరుమ‌లేశుని విగ్ర‌హం వేల సంవ‌త్స‌రాలుగా ర‌సాయ‌నాల‌కు కూడా చెక్కుచెద‌ర‌కుండా కాంతివంతంగా మెరిసిపోతుంటుంది. సాధార‌ణంగా
ముడి కర్పూరం లేదా పచ్చ కర్పూరంను రాతికి పూస్తే అతి కొద్ది కాలంలోనే ఆ రాయి పగుళ్లుబారుతుంది. ఇలా జ‌రుగుతుంద‌న‌డానికి  శాస్త్రీయంగా నిరూపితమైంది కూడా. కానీ నిత్యం పచ్చ కర్పూరం రాస్తూ శ్రీవారి విగ్రహానికి పూజ‌లు చేస్తున్నా ఏమాత్రం చెక్కుచెదరక పోవడం ఆశ్చర్యం క‌లిగిస్తోంది. ఈ విగ్ర‌హాన్ని మ‌లిచిన రాయి యొక్క విశిష్ట‌త ఎవ‌రికీ అంతుబ‌ట్ట‌డం లేదు. 


10. శ్రీవారికి చెమటలు:
శ్రీవారి విగ్ర‌హం రాతితో మ‌ల‌చ‌బ‌డిన‌దే అయినా శ్రీవారి రూపం చాలా ర‌మ‌ణీయంగా, కాంతివంతంగా ఉంటూ భ‌క్తుల‌ను త‌న్మ‌య‌త్మానికి గురిచేస్తుంది. తిరుమ‌ల శ్రీవారి ఆల‌యం స‌ముద్ర మ‌ట్టానికి 3 వేల అడుగుల ఎత్తులో ఉండ‌టం వ‌ల‌న ఆల‌య ప‌రిస‌రాలు నిత్యం చ‌ల్ల‌గా ఉంటాయి. కానీ దానికి భిన్నంగా శ్రీవారి విగ్ర‌హం మాత్రం 110 డిగ్రీల ఫారిన్ హీట్‌తో వేడిగా ఉంటుంది. ఈ ఉష్టం కార‌ణంగా శ్రీవారి విగ్ర‌హం ఎప్పుడూ చెమట‌ల‌తో త‌డిచిపోతుంటుంది. పూజారులు ప‌ట్టువ‌స్త్రాల‌తో నిత్యం తుడుస్తూనే ఉంటారు. పవిత్ర స్నానం సంద‌ర్భంగా ఆభ‌ర‌ణాలు తీసిన సంద‌ర్భంలో పూజారులు ఆ వేడిని అనుభూతి చెందుతారు.