Kanipakam News: దేవతల్లో ప్రథమ పూజితుడు గణనాథుడు. ఊరిలోనో కాలనీలోనో వినాయక విగ్రహం ఏర్పాటు చేసి పూజలు చేసినా కాణిపాకం బ్రహ్మోత్సవాలు చాలా ప్రత్యేకం. అందుకే లక్షల మంది భక్తులు వినాయక బ్రహ్మోత్సవాలకు తరలి వస్తుంటారు. స్వయంభూగా వెలసింది చిత్తూరు జిల్లా ఐరాల మండలం కాణిపాకంలో స్వామి వారికి జరిగే వేడుక తిలకించి పరవశించిపోవాలని కోరుకుంటారు. 


కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు 21 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ ఏడాది వినాయక చవితి రోజు అంటే సెప్టెంబర్ 7న ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలు 27వ తేదీన ముగుస్తాయి. ఈసారి కూడా ప్రసిద్ధి చెందిన ఈ బ్రహ్మోత్సవాలు తిలకించేందుకు, స్వామి దర్శనం కోసం లక్షల మంది భక్తులు తరలివస్తారు. 


ఏర్పాట్ల పై జిల్లా అధికారుల సమీక్ష


ప్రతిష్టాత్మకమైన కాణిపాకం బ్రహ్మోత్సవ ఏర్పాట్లు మాత్రం చురుగ్గా సాగడం లేదన్న విమర్శ గట్టిగా వినిపిస్తోంది. 9 రోజుల్లో వేడుకలు మొదలు కానున్నా ఇంకా నత్త నడకన పనులు సాగుతున్నాయి. దీనిపై జిల్లా అధికారులు సమీక్ష చేశారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళి మోహన్, జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ప్రణాళికలు, చేయాల్సిన పనులపై చర్చించారు. 


వేడుకలు జరిగే 21 రోజుల పాటు రెవెన్యూ, పోలీసులు, ఆర్ అండ్ బి, ఆర్ డబ్యూఎస్, విద్యుత్, వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీ రాజ్, ఏపీఎస్‌ఆర్టీసీ, పారిశుద్ధ్య, అగ్నిమాపక శాఖ చేయాల్సిన పనుల గురించి సమీక్షించారు. ఐదు రోజుల్లో కీలకమైన పనులు పూర్తి కావాలని ఆదేశించారు. 



ఈవో లేకుండా బ్రహ్మోత్సవాలు సాధ్యమేనా..? 
కాణిపాకం ఆలయంలో మొన్నటి వరకు వెంకటేశు అనే ఈవో పని చేశారు. ఆయన హయాంలో ఉభయదారుల నుంచి భక్తుల వరకు ఏదో ఒక సమస్య వచ్చేది. ఈవో ఇష్టానుసారంగా వ్యవహరించారని ఫిర్యాదులు వచ్చేవి. కూటమి నాయకులను కూడా ఆయన విమర్శించారు. దీంతో కొత్త ప్రభుత్వం ఆయనను బదిలీ చేసింది. ఆయన స్థానంలో ఇన్ఛార్జి ఈవోగా వాణిని నియమించారు. పాలకమండలి నియామకం కూడా చేపట్టలేదు. ఇలాంటి పరిస్థితుల్లో బ్రహ్మోత్సవాలు ఎలా జరుగుతాయనే ప్రశ్న ఉత్పన్నముతోంది. 



21 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలంటే అషామాషీ కాదు. అర్చకులు విధులు, ఉద్యోగులు, అదనపు సిబ్బందికి పని పురమాయించడంతోపాటు నిధుల మంజూరు కూడా చేయాల్సి ఉంటుంది. ఈవో లేకపోతే ఇవి పూర్తి స్థాయిలో జరగవవి ఉభయదారులు, భక్తులు అంటున్న మాట. ఇన్ఛార్జి ఈవోకు పూర్తి స్థాయి పవర్ ఉండదని అంటున్నారు. 


బ్రహ్మోత్సవాల్లాంటి కీలకమైన వేడుకలు ఉన్న టైంలో ఈవో నియామక ప్రక్రియ పూర్తి చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. 21 రోజులపాటు జరిగే బ్రహ్మోత్సవాలకు మరో 9 రోజల గడువు ఉంది. కానీ ఇప్పటి వరకు పనులు మాత్రం వేగం పుంజుకోవడం లేదు. అవి సకాలంలో ఎంత వరకు పూర్తి అవుతాయా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 


బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు సరిగ్గా చేయకపోతే కూటమి ప్రభుత్వం పై విమర్శలు వచ్చే ప్రమాదం ఉందని ఆ పార్టీల నేతలే చెబుతున్న మాట. ఆ వినాయక స్వామి తన వేడుకలను ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగాలని భక్తులు కోరుకుంటున్నారు.


Also Read: సంతానానికి ఆయుష్షు ప్రసాదించే శ్రావణ అమావాస్య/ పోలాల అమావాస్య విశిష్టత ఇదే!


కాణిపాకం బ్రహ్మోత్సవాల వివరాలు
07.09.2024 - శనివారం - వినాయక చవితి, రాత్రి గ్రామోత్సవం
08.09.2024 - ఆదివారం - ఉదయం ధ్వజారోహణం, రాత్రి హంస వాహనం
09.09.2024- సోమవారం - ఉదయం నెమలి వాహనం, రాత్రి బంగారు నెమలి వాహనం
10.09.2024 - మంగళవారం - రాత్రి మూషిక వాహనం
11.09.2024 - బుధవారం - ఉదయం బంగారు చిన్న శేష వాహనం, రాత్రి బంగారు పెద్ద శేష వాహనం
12.09.2024 - గురువారం - ఉదయం చిలుక వాహనం, రాత్రి వృషభ వాహనం
13.09.2024 - శుక్రవారం - రాత్రి గజ వాహనం
14.09.2024 - శనివారం - ఉదయం రథోత్సవం 
15.09.2024 - ఆదివారం - ఉదయం భిక్షాండి  ఉత్సవం, సాయంత్రం తిరు కళ్యాణం, రాత్రి అశ్వ వాహనం
16.09.2024 - సోమవారం - సాయంత్రం ధ్వజవరోహణం,  వడాయత్తు ఉత్సవం, రాత్రి ఏకాంత సేవ 


ప్రత్యేక ఉత్సవాలు
17.09.2024 - మంగళవారం - రాత్రి అధికార నంది వాహనం
18.09.2024 - బుధవారం - రాత్రి రావణ బ్రహ్మ వాహనం 
19.09.2024 - గురువారం - రాత్రి యాళి వాహనం
20.09.2024 - శుక్రవారం - రాత్రి విమానోత్సవం 
21.09.2024 - శనివారం - రాత్రి పుష్ప పల్లకి సేవ
22.09.2024 - ఆదివారం - రాత్రి కామధేను వాహనం 
23.09.2024 - సోమవారం - రాత్రి సూర్య ప్రభా వాహనం 
24.09.2024 - మంగళవారం - చంద్ర ప్రభ వాహనం
25.09.2024 - బుధవారం - రాత్రి కల్పవృక్ష వాహనం
26.09.2024 - గురువారం - రాత్రి పూలంగి సేవ
27.09.2024 - శుక్రవారం - రాత్రి తెప్పోత్సవం


Also Read: పోలాల అమావాస్య ఎవరు చేయాలి.. ఎందుకు ఆచరించాలి - వ్రత విధానం , కథ ఏంటి!