Significance of Polala Amavasya 2024 : వివాహితులు... సౌభాగ్యం, సంతానం కోసం వ్రతాలు ఆచరించడం యుగయుగాలుగా వస్తోన్న ఆచారం. తెలుగు నెలలన్నీ ప్రత్యేకమే అయినా శ్రావణం, కార్తీకం నెలరోజులూ విశిష్టమైవే. వీటిలో శ్రావణమాసాన్ని శక్తిమాసం అంటారు. నెలంతా మంగళవారాలు, శుక్రవారాల్లో సౌబాగ్యంకోసం నోములు, వ్రతాలు చేస్తారు. చివరిరోజైన శ్రావణ అమావాస్య రోజు మాత్రం సంతానం కోసం పోలాల అమావాస్య వ్రతం చేస్తారు. పెళ్లై సంతానం లేనివారికి పిల్లలు ఎంత ముఖ్యమో.. పిల్లలు ఉన్నవారికి వారి ఆయురారోగ్యాలు అంతే ముఖ్యం. వారి క్షేమం కోసమే పోలమ్మను పూజిస్తారు. 


Also Read: సంతానానికి ఆయుష్షు ప్రసాదించే శ్రావణ అమావాస్య/ పోలాల అమావాస్య విశిష్టత ఇదే!
 
పోలాల అమావాస్య  పూజ ఎలా?
 
ఏ పండుగ రోజు అయినా విధిగా ఆచరించాల్సినవి సూర్యోదయానికి ముందే నిద్రలేవడం, ఇంటిని శుభ్రం చేసుకోవడం, తలకు స్నానం ఆచరించి దేవుడి మందిరం శుభ్రంచేసి..ఆ తర్వాత సంబంధిత పూజకు అవసరమైన వస్తువులు సిద్ధం చేసుకోవడం. అయితే పోలమ్మ పూజకు ముఖ్యంగా కావాల్సింది కందమొక్క. దేవుడి మందిరంలో కందమొక్కను ఉంచి..ఇంట్లో వివాహితులు, పిల్లలు ఎంతమంది ఉంటే అన్ని పసుపుకొమ్ములు తోరాలుగా ఆ మొక్కకు కడతారు. ఏ పూజ ప్రారంభించినా ముందుగా వినాయకుడిని పూజించాలి. ఆ తర్వాత కందమొక్కలోని మంగళగౌరీ దేవిని, సంతానలక్ష్మిని ఆవాహనం చేసి.. షోడశోపచార పూజ పూర్తిచేయాలి.


నైవేద్యంగా బూరెలు, గారెలతో సహా మీకు నివేదించగలిగినన్ని పిండివంటలు చేయొచ్చు. ముఖ్యంగా ఈ రోజు కలగాయ కూర, కలగాయ పులుసు చేస్తారు. అంటే..ఇంట్లో ఉండే కూరగాయలు, ఆకుకూరలతో పాటూ..మూడు లేదా ఐదు, ఏడు, తొమ్మిది లేదా పదకొండు ఇళ్లకు వెళ్లి జోలెపట్టి జోగు అడిగి తీసుకొచ్చి వాళ్లిచ్చిన కూరగాయలను కూడా వంటల్లో కలిపి వండి పోలమ్మకి నివేదించాలి. ఏ వ్రతం , నోము చేసినా పూజ అనంతరం ముత్తైదువులకు వాయనం ఇచ్చి..అమ్మవారి స్థానంలో ఉన్న ముత్తైదువ ఆశీర్వచనం తీసుకోవడం మంచిది. ఉదయం పూజ పూర్తైన కానీ అదే రోజు సాయంత్రం కూడా అమ్మవారి దగ్గర దీపం వెలిగించి..నైవేద్యం సమర్పించాలి. ఆ తర్వాత కందమొక్కకు కట్టిన పసుపుకొమ్ములు తీసి..ముత్తైదువులు మెడలో, పిల్లలకు మొలకు కడతారు. 


Also Read: 2024 లో 'అజ ఏకాదశి'ఎప్పుడొచ్చింది.. పూజా విధానం , ప్రాముఖ్యత గురించి తెలుసుకోండి!


పోలాల అమావాస్య వ్రతం పూర్తయ్యాక చదువుకోవాల్సిన కథ ఇదే


పూర్వం పిల్లలమఱ్ఱి అనే ఊరిలో సంతానరామావధానులు అనే పండితుడు ఉండేవాడు. ఆయనకు ఏడుగురు మగపిల్లలు..అందరకీ పెళ్లిళ్లు జరిగి కోడళ్ల రాకతో ఇల్లు కళకళలాడేది. అయితే అందులో మొదటి ఆరుగురు కోడళ్లకు పిల్లలు కలిగారు కానీ...ఆఖరి కోడలికి సంతాన భాగ్యం లేదు. అలాగని పిల్లలే పుట్టడం లేదా అంటే..పుడుతున్నారు కానీ వెంటనే చనిపోతున్నారు. పైగా ఏటా  గర్భం దాల్చడంతో ఆమె ఒక్క ఏడాది కూడా పోలాల అమావాస్య పూజ చేసుకోలేకపోయింది. అప్పటికే అత్తవారింట్లో, తోడికోడళ్లతో సూటిపోటి మాటలు పడుతోంది సుగుణ. ఇక ఏడో ఏడాది ఎలాగైనా అమ్మవారి పూజ చేయాలి అనుకుంది. అప్పటికే తాను ప్రసవం అయింది..పుట్టిన బిడ్డ చనిపోయింది కూడా..అయినప్పటికీ ఆ విషయం బయటకు చెప్పకుండా అమ్మవారి పూజ పూర్తిచేసేసింది సుగుణ. ఆ తర్వాత చనిపోయిన బిడ్డను తీసుకుని శ్మశానికి వెళ్లి కన్నీళ్లు పెట్టుకుంది. ఎప్పటిలా చీకటి పడేసమయానికి గ్రామ సంచారానికి బయలుదేరిన అమ్మవారు..శ్మశానంలో ఏడుస్తున్న సుగుణను చూసి ఏం జరిగిందని అడిగింది. ఆమె చెప్పిందంతా విన్న అమ్మవారు..ఏడవవద్దని చెప్పి.. పోలమ్మను ధ్యానించి నీ పిల్లలకు ఏ పేర్లు పెట్టాలి అనుకున్నావో ఆ పేర్లతో పిలువు అని చెప్పి మాయమైంది. ఆమె చెప్పినట్టే అనుసరించన సుగుణ..ఆ సమాధుల దగ్గరకెళ్లి పిల్లల్ని పిలిచింది. పిల్లలంతా సజీవంగా అమ్మ ఒడికి చేరుకున్నారు. అప్పటి నుంచీ ఏటా పోలాల అమావాస్య పూజను తప్పనిసరిగా ఆచరించింది సుగుణ.  


Also Read: తిరుమల హుండీలో సొమ్ము 3 భాగాలు - మీరు ఏ భాగంలో వేస్తున్నారు , ఎలాంటి ముడుపులు చెల్లిస్తున్నారు?


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం పండితులు చెప్పిన వివరాలు, కొన్ని పుస్తకాల నుంచి సేకరించింది మాత్రమే. దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.