YS Sharmila Singapore News | ఏపీ పీసీసీ చీఫ్ YS షర్మిల ఎక్కడ ఉన్నారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఇదో హాట్ టాపిక్ అయింది. ఆమె చేసే ట్వీట్స్ సోషల్ మీడియా పోస్టులను పక్కనబెడితే ఆమె డైరెక్ట్ గా మీడియాలో కనిపించి చాలా రోజులైంది. మొన్నామధ్య వర్షాలకు గోదావరి జిల్లాల్లో పంటపొలాలు మునిగినప్పుడు ఆమె అక్కడ పర్యటించి రైతులకు నష్ట పరిహారం ఇవ్వాల్సిందే అంటూ పట్టుబట్టారు. ఏకంగా ఆ బురద నీటిలోకి ఆమె స్వయంగా దిగి మరీ తన నిరసన తెలియజేశారు. ఆ తరువాత ప్రభుత్వం ప్రకటించిన పరిహారం క్రెడిట్ ను తమ ఖాతాలోనూ వేసుకోగలిగారు.
ప్రమాదం సమయంలో ఎక్కడా కనిపించలేదు!
అలాంటిది విశాఖ సమీపంలోని అచ్యుతా పురం సెజ్ వద్ద అంత పెద్ద ప్రమాదం జరిగి 17 మంది చనిపోయిన ఘటనలో మాత్రం షర్మిల ప్రెజెన్స్ కనిపించలేదు. బాధిత కుటుంబాలకు న్యాయం జరగాలని ఆమె ప్రకటనలు ఇచ్చారు. గానీ విశాఖ పర్యటన కు మాత్రం ఆమె వెళ్ళలేదు. దానితో షర్మిల ఎక్కడ ఉన్నారు ఎందుకు ఆమె కనిపించడం లేదు అన్న చర్చ కాంగ్రెస్ పార్టీ లో సైతం మొదలయ్యింది. దానితో అసలు షర్మిల ఇండియా లో ఉన్నారా లేక వేరే దేశం వెళ్ళారా అని ఆరాలు మొదలయ్యాయి. ఆ అరాల్లో తెలిందే షర్మిల సింగపూర్ యాత్ర.
షర్మిల సింగపూర్ లో ఏం చేస్తున్నారు?
ఏపీ కాంగ్రెస్ ఛీప్ షర్మిల సింగపూర్ లో పర్యటిస్తున్నారు అని తెలియగానే ఆమె అక్కడ ఏం చేస్తున్నారు. ఇది రాజకీయ పర్యటనా లేక వ్యక్తిగత టూరా అని కనుక్కుంటే ఇది పూర్తిగా ఆమె కుటుంబ వ్యవహారంగా తేలింది. షర్మిల, బ్రదర్ అనిల్ దంపతుల కుమార్తె అంజలి రెడ్డి కాలేజ్ అడ్మిషన్ కోసం షర్మిల కుటుంబ సమేతంగా సింగపూర్ వెళ్లినట్లు సమాచారం . అక్కడ స్టూడెంట్ తో పాటుగా తల్లిదండ్రులకూ కౌన్సెలింగ్ ఉంటుంది కాబట్టి ఆ పనిమీద నే షర్మిల సింగపూర్ లో ఉన్నారు. అలాగే కుమార్తె నివాసం కోసం అక్కడే ఒక ఇంటిని చూస్తున్నట్టు తెలుస్తోంది. ఈ పమల మీదనే షర్మిల ఆగష్టు నెల పూర్తయ్యే వరకూ సింగపూరు లోనే ఉండనున్నారని పార్టీ వర్గాల సమాచారం.
షర్మిల తిరిగొచ్చేది అప్పుడే
షర్మిల ఇండియాకు వచ్చేనెల తిరిగి రానున్నారు. సెప్టెంబర్ 2న ఆమె తండ్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి YS రాజ శేఖర్ రెడ్డి వర్థంతి కాబట్టి ఆరోజున ఆమె ఇడుపుల పాయకు వెళ్లనున్నారు. ఆ కార్యక్రమం కంటే ఒకరోజు ముందు షర్మిల ఇండియాకు రానున్నారు. అదే రోజు ఆమె సోదరుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ఇడుపులపాయ వెళ్లనున్నట్టు తెలుస్తోంది. మరి ఈసారైనా అన్నా చెల్లెళ్ళు ఒకేచోట కలుస్తారో లేదో అని రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.