Aja Ekadashi 2024 Date Time Puja Muhurat: ఏటా శ్రావణమాసం అమావాస్య ముందు వచ్చే ఏకాదశిని అజయ ఏకాదశి జరుపుకుంటారు. హిందూ మతంలో అజ ఏకాదశి వ్రతానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు ఉపవాస నియమాలు పాటిస్తూ శ్రీ మహావిష్ణువుతో పాటూ మహాలక్ష్మిని కూడా పూజిస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారని విశ్వాసం. ఈ రోజు చేసే ఉపవాసం, పూజ, దాన ధర్మాలు మోక్షమార్గం వైపు నడిపిస్తాయని భక్తుల విశ్వాసం. 2024లో అజ ఏకాదశి ఆగష్టు 29 గురువారం అజ ఏకాదశి వచ్చింది. దీనినే స్మార్త ఏకాదశి, గురు ఏకాదశి అనికూడా అంటారు.
Also Read: తిరుమల భోజనశాలలో ఉన్న ఈ పెయింటింగ్ ఏంటో తెలుసా!
ఏకాదశి ఉపవాసం చేయాలి అనుకున్నవారు దశమి రోజు రాత్రి నుంచే..సాత్విక ఆహారం తీసుకోవడం, బ్రహ్మచర్యం పాటించడం లాంటి నియమాలు పాటించాలి. హిందూ పంచాంగం ప్రకారం అజ ఏకాదసి ఆగష్టు 29 తెల్లవారుజామున ప్రారంభమై ఆగష్టు 30 శుక్రవారం తెల్లవారుజామున ముగుస్తుంది. అందుకే ఏకాదశి వ్రతం చేసేవారు ఆగష్టు 29నే పరిగణలోకి తీసుకోవాలి. ప్రతి ఏకాదశికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉన్నట్టే..అజ ఏకాదశి వ్రతం ఆచరించిన వారు అశ్వమేథయాగం చేసినంత పుణ్యం పొందుతారని పండితులు చెబుతారు. ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల కోల్పోయిన సంపద తిరిగి వస్తుందని...దీర్ఘకాల అనారోగ్యంతో ఉండేవారికి ఉపశమనం లభిస్తుందని భక్తుల విశ్వాసం.
Also Read: తిరుమల హుండీలో సొమ్ము 3 భాగాలు - మీరు ఏ భాగంలో వేస్తున్నారు , ఎలాంటి ముడుపులు చెల్లిస్తున్నారు?
ఉపవాసం మీ కోసం..
ఏకాదశి ఉపవాసం భగవంతుడికి చేరువయ్యేందుకు పాటించండి అని పండితులు చెబితే...ఆరోగ్యం కోసం ప్రతి 15 రోజులకు ఓసారి ఉపవాసం చేయమని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే... దేహమే దేవాలయం అంటోంది శాస్త్రం... ఏకాదశీవ్రతాన్ని నియమంగా ఆచరించడమంటే ఉపవాసం ద్వారా 11 ఇంద్రియాలను శుద్ధి చేసుకోవడమే. 11 ఇంద్రియాలను నిగ్రహించి... పూజ-జపం-ధ్యానం చేయడం వల్ల అజ్ఞానం తొలగి జ్ఞానం వైపు ప్రయాణం ప్రారంభమవుతుంది. ఇదే వేదభాషలో మోక్షం వైపు ప్రయాణం చేయడం అన్నమాట. సాధారణంగా ఏకాదశి అంటే ప్రతి 15 రోజులకు ఓసారి వస్తుంది. ప్రతి తెలుగు నెలలో శుక్ల పక్షంలో పదకొండో రోజు...బహుళ పక్షంలో పదకొండో రోజు వస్తుంది. ప్రతి ఏకాదశికి ఓ ప్రత్యేకతను సూచిస్తూ..ఉపవాసం చేయమని చెప్పడం వెనుకున్న ఆంతర్యం ఇదే. ఇలా రెండు వారాలకు ఓసారి ఉపవాసం చేయడం వల్ల కుండలి శక్తి జాగృతం అయి మూలాధార చక్రం నుంచి మొదలై... స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ చక్రాలను దాటుకుని సహస్రార చక్రంలో సహస్రకమలంలో ఉన్న పరమాత్ముడిని దర్శించుకుని బ్రహ్మరంధ్రం ద్వారా జీవాత్మను పరమాత్ముడిలో ఐక్యం చేయడమే..
అజ ఏకాదశి కథ
పురాణాల ప్రకారం శ్రావణ మాసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశికి అజ ఏకాదశి అనే పేరు నిర్ణయించాడు శ్రీ కృష్ణుడు. ఈ వ్రతాన్ని హరిశ్చంద్ర మహారాజు తన భార్య సత్యవతితో కలసి ఆచరించాడు. హరిశ్చంద్రుడు కష్టకాలంలో ఉన్నప్పుడు..గౌతమ మహర్షి సూచించిన వ్రతమే అజ ఏకాదశి వ్రతం. ఈ రోజు ఉపవాసం ఉండి మహా విష్ణువును పూజించడం ద్వారా కష్టాలన్నీ తొలగిపోతాయని సూచించారు. అలా గౌతమ మహర్షి సూచనల మేరకు అజ ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు హరిశ్చంద్రమహారాజు.
Also Read: లక్ష్మీదేవి అనుగ్రహం తొందరగా దక్కాలంటే..తిరుమల శ్రీవారి సన్నిధిలో ఇలా చేయండి!
ఏ ఏకాదశి రోజైనా 'ఓ నమో నారాయణాయ' అనే అష్టాక్షరి మంత్రం, 'విష్ణు సహస్రనామం' పఠించినా విన్నా అన్నీ శుభాలే జరుగుతాయి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి . బ్రేకింగ్ న్యూస్ , అప్ డేట్ వార్తల కోసం ఇది ఫాలో అవండి..