Beheading of Goat by Balakrishna Fans | తిరుపతి: డాకు మహారాజ్ మూవీ రిలీజ్ సందర్భంగా గొర్రె పొట్టేలును బలిచ్చిన బాలకృష్ణ (Balakrishna) అభిమానులపై కేసు నమోదైంది. పెటా ఇండియా ఫిర్యాదుతో తిరుపతి పోలీసులు ఈ ఘటనలో బాలకృష్ణ ఫ్యాన్స్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సంక్రాంతి కానుకగా డాకు మహారాజ్ మూవీ (Daaku Maharaaj Movie) ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయింది. అయితే కొందరు అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ, సినిమా హిట్ కావాలని ఆకాంక్షిస్తూ గొర్రె పొట్టేలును బలివ్వడం వివాదానికి కారణమైంది.
జనవరి 12వ తేదీన తిరుపతిలోని టాటా నగర్‌లోని ప్రతాప్ థియేటర్ కాంపౌండ్ లో బాలకృష్ణ అభిమానులు ఓ గొర్రె పొట్టేలను బలిచ్చారు. చుట్టూ ఎంతో మంది జనం గుమిగూడి గట్టిగా కేకలు వేస్తూ ఓ పొట్టేలను బలిచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పొట్టేలు తల నరికి బలిచ్చిన వెంటనే రక్తం అద్దుకుని, డాకు మహారాజ్ సినిమా కటౌట్ కు రుద్దడం ఆ వీడియోలో కనిపించింది.
భారతీయ న్యాయ సంహిత, 2023లోని 3(5) 325 & 270 సెక్షన్ల కింద ఐదుగురు వ్యక్తులపై FIR నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్ జంతువులు. పక్షుల బలి (నిషేధం) చట్టం, 1950 లోని సెక్షన్లు 4 & 5, 6 & 8 సెక్షన్లు నమోదు చేశారు. వాటితో పాటు జంతువులపై క్రూరత్వం నివారణ చట్టం 1960 లోని సెక్షన్లు 3, 11(1)(a), 11(1)(l) లను ఎఫ్ఐఆర్ లో చేర్చారు పోలీసులు.
అలా చేస్తూ సూపర్ ఫ్యాన్స్ అవ్వరు..
‘ ఏదైనా జంతువును చంపి దాని రక్తాన్ని పోస్టర్‌పై పూసి హంగామా చేయడం ద్వారా మీరు సూపర్ ఫ్యాన్ అవ్వరు. వాస్తవానికి అది మిమ్మల్ని విలన్ ను చేస్తుంది. ఇబ్బందులకు గురిచేస్తుంది. అసలైన అభిమానులు తమ ఫెవరెట్ హీరో టిక్కెట్లు కొంటారు. సోషల్ మీడియాలో వారికి మద్దతుగా పోస్టులు పెడతారు. కానీ ఇలా జంతువులను చంపడం లాంటి క్రూరమైన చర్యలతో సూపర్ ఫ్యాన్ అవ్వరు’ అని ఇండియా క్రూయల్టీ రెస్పాన్స్ కోఆర్డినేటర్ సలోని సకారియా అన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి జంతువులపై క్రూరత్వాన్ని సహించబోమని సందేశం పంపినందుకు తిరుపతి ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, పోలీసులను పెటా ఇండియా అభినందించింది.
Also Read: Viral Videos: డాకు మహారాజ్ కోసం పొట్టేలు బలి, మాన్షన్ హౌస్ మందుతో బాలయ్య కటౌట్‌కు అభిషేకం
ఆంధ్రప్రదేశ్ జంతువులు, పక్షుల బలి (నిషేధం) చట్టం, 1950లోని సెక్షన్ 4 ప్రకారం ఏ వ్యక్తి అయినా జంతువును బలి ఇవ్వడం, వాటిని ప్రోత్సహించడాన్ని నిషేధిస్తుందని పెటా ఇండియా ఫిర్యాదులో పేర్కొంది. మతపరమైన ప్రార్థనా స్థలం, దాని ఆవరణలలో జంతుబలిని సెక్షన్ 5 నిషేధిస్తుంది. సెక్షన్ 6, 8 కింద సైతం కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం లైసెన్స్ పొందిన కబేళాలలో మాత్రమే జంతువదకు అనుమతి ఉంది. ఈ విషయాన్ని అధికారులు చట్టాల ద్వారా అందరికీ తెలిసేలా చేయాలని పెటా ఇండియా తిరుపతి పోలీసులను కోరింది. మత ప్రార్థనా స్థలం, దాని ఆవరణ, ఇతర బహిరంగ ప్రదేశాలలో మతపరమైన బలిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు నిషేధించాయి. గుజరాత్, కేరళ, పుదుచ్చేరి మరియు రాజస్థాన్‌లు కూడా ఇలాంటి చట్టాలను కలిగి ఉన్నాయి.
"జంతువులు ఉన్నది మనం తినడానికి లేదా ఇతర పనులకు వాటిని దుర్వినియోగం చేయడానికి కాదు" అనే నినాదంతో పెటా ఇండియా పనిచేస్తోంది. దీని గురించి పూర్తి వివరాలకు PETAIndia.comని సందర్శించాలని సూచించారు. జంతు బలులు ఇచ్చి కేసుల్లో ఇరుక్కోవద్దని సైతం ప్రజలకు పెటా సూచించింది.