తిరుపతి: చంద్రగిరిలో మంచు ఫ్యామిలీపై 2 కేసులు నమోదయ్యాయి. డెయిరీ ఫాం గేటు వద్ద జరిగిన వివాదంపై మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ వర్గాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయి. మోహన్‌బాబు పీఏ చంద్రశేఖర్ ఫిర్యాదు చేయగా, మంచు మనోజ్, మౌనికతో పాటు మరో ముగ్గురిపై కేసులు నమోదు చేశారు. అదే విధంగా తనపై, తన భార్య మౌనికపై కొందరు దాడికి ప్రయత్నించారంటూ మనోజ్ ఇచ్చిన ఫిర్యాదుతో మోహన్‌బాబు పీఏ చంద్రశేఖర్ తో పాటు ఎంబీయూకి చెందిన 8 మంది సిబ్బందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
మంచు మనోజ్ రెండు రోజుల కిందట ఎంబీ యూనివర్శిటీలోకి ప్రవేశించేందుకు చూడగా ఆయనను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. తనను అడ్డుకోవడంపై మనోజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం యూనివర్సిటీలోకి వెళ్లిన మనోజ్ తాను తన అమ్మమ్మ, తాతయ్యల సమాధుల వద్దకు వెళ్లి నివాళులు అర్పించారు. మనోజ్ యూనివర్శిటీ ప్రాంగణంలోకి రాకుండా మోహన్ బాబు కోర్టు ఉత్తర్వులు తీసుకు వచ్చారు. ఆ కాపీని పోలీసులకు ఇవ్వడంతో వారు మనోజ్‌కు నోటీసులు ఇచ్చారు. దాంతో ఎంబీ వర్సిటీలోకి వెళ్లేందుకు మొదట మనోజ్ కు అనుమతి ఇవ్వలేదు.
సమాధులున్నాయి, నివాళు అర్పిస్తానని మనోజ్ గొడవ
మొదట మంచు మనోజ్ వెళ్లినప్పుడు ఉత్తర్వుల ప్రకారం పోలీసులు ఆయనను గేటు వద్ద అడ్డుకున్నారు. అనంతరం మనోజ్ నారా వారి పల్లెకు వెళ్లారు. అక్కడ లోకేష్ తో కొద్దిసేపు సమావేశమయ్యారు. మళ్లీ మనోజ్ ఎంబీ యూనివర్శిటీ గేటు వద్దకు వచ్చిన సమయంలో పోలీసులు మరోసారి అడ్డుకున్నారు. లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదని, ఉత్తర్వులు ఉల్లంఘించి లోపలకి వెళ్లే ప్రయత్నం చేస్తే లాఠీచార్జ్ చేస్తామని సైతం పోలీసులు మనోజ్ ను హెచ్చరించారు. లోపల నానమ్మ, తాతయ్య, సమాధులన్నాయని, వారికి నివాళులు అర్పించడానికి వచ్చానని చెప్పారు. అలాగే మంచు ప్రసాద్ అనే కజిన్ సమాధి ఉందని.. నివాళులు అర్పించి వెళ్తానని పట్టుబట్టడంతో కొన్ని కండీషన్లతో లోపలికి అనుమతించారు.
మూడో గేటు నుంచి వర్సిటీ లోపలికి వెళ్లి సమాధుల వద్ద నివాళులర్పించి బయటకు వచ్చిన తరువాత మనోజ్ మీడియాతో మాట్లాడారు. నేనేమీ గొడవకు రాలేదు. నేనంటే మీకు ఎందుకంత భయం. కూర్చుని మాట్లాడుకోవడానికి భయమెందుకని మనోజ్ ప్రశ్నించారు. ఇది తన స్వగ్రామం అని, తన స్నేహితులు, బంధువులు అంతా ఇక్కడే ఉన్నారని చెప్పారు. పోలీసుల మాటకు తాను గౌరవం ఇచ్చి, వారి మాట ప్రకారం సమాధుల వద్ద నివాళి అర్పించి వెళ్లిపోతున్నానని ప్రకటించారు. ఈ విషయంలో తనను కొన్ని రోజులనుంచి ఇబ్బంది పెడుతున్నారని నలభై మంది రౌడీల్ని తెచ్చారని మనోజ్ ఆరోపించారు. వర్సిటీ గేటు నుంచి లోపలికి వెళ్లిన తరువత మనోజ్ అనుచరులకు, వర్సిటీ బౌన్సర్లకు మధ్య గొడవ జరగడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చింది. దీనిపై ఇరువర్గాలు చేసిన ఫిర్యాదు మేరకు చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Also Read: Manchu Manoj: ఎంబీయూలోకి మనోజ్ ఎంట్రీ - పోలీసుల లాఠీచార్జ్ - పరిష్కారం చూపిస్తానని వార్నింగ్ !