AP Deputy CM Pawan Kalyan | తన పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీలు కడుతూ ఓ జన సైనికుడు చనిపోవడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. చంద్రగిరి నియోజకవర్గంలోని రామచంద్రపురం మండలం అనుపల్లెలో ఫ్లెక్సీ కడుతుండగా బి.గోపి, మధులకు కరెంట్ షాక్ కొట్టింది. విద్యుదాఘాతంతో గోపి అనే జన సైనికుడు మృతి చెందడంపై పవన్ కళ్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మధు అనే మరో జన సైనికుడు గాయపడ్డారు. ఇలాంటి దుర్ఘటన జరగటం దురదృష్టకరం అని, గోపి ఆత్మకు శాంతి కలగాలని, అతని కుటుంబ సభ్యులకు పవన్ కళ్యాన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
కాయకష్టం చేసుకొనే గోపి చనిపోవడంతో అతడి కుటుంబం ఎంత తల్లడిల్లిపోతుందో అర్ధం చేసుకోగలను అన్నారు. ఫ్లెక్సీ కడుతూ చనిపోయిన గోపి కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. అతడి కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందన్నారు. శ్రీమధుకి హాస్పిటల్ ఖర్చుల కోసం రూ.50 వేలు ఆర్థిక సాయాన్ని అందజేస్తామన్నారు. జనసైనికులకు ఇలా జరిగిందన్న దుర్ఘటన గురించి తెలిసిన వెంటనే స్థానిక జనసేన నాయకులు అక్కడికి వెళ్లారు. బాధిత కుటుంబాలకు పవన్ కళ్యాణ్, పార్టీ అండగా ఉంటాయని ఓదార్చారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో జనసేన శ్రేణులు పాల్గొనాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. జనసేనాని ఆదేశాల మేరకు భారీ వర్షాలు, వరద ప్రభావం లేని చోట్ల క్లీన్ ఆంధ్ర – గ్రీన్ ఆంధ్ర కార్యక్రమాలలో పాల్గొన్నారు. విస్తృతంగా మొక్కలు నాటి, సేవా కార్యక్రమాల్లో జనసేన నేతలు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.
ఏపీలో భారీ వర్షాలు, వరద నీటితో పరిస్థితి అదుపుతప్పింది. కొన్నిచోట్ల ప్రాణనష్టం సైతం సంభవించింది. ఈ పరిస్థితుల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు తన పుట్టినరోజు జరుపుకోకూడదని నిర్ణయం తీసుకున్నారు. జనసైనికులు విరివిగా సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని, వరద బాధితులకు సహాయం చేయాలని సూచించారు. కొన్నిచోట్ల కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ పుట్టినరోజును జనసైనికులు, అభిమానులు ఘనంగా నిర్వహించారు.