డాలర్ శేషాద్రి మృతికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం వ్యక్తం చేశారు. డాలర్ శేషాద్రి సేవలను గుర్తుచేసుకుంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. తిరుమల శ్రీవారి సేవలో పాల శేషాద్రి జీవితాన్ని తరింపజేసుకున్నారని ఉపరాష్ట్రపతి వెంకయ్య అన్నారు. డాలర్ శేషాద్రి మరణ వార్త విని ఎంతో విచారించానన్నారు. శేషాద్రి చివరి రోజు కూడా శ్రీవారి సేవలో గడిపి ధన్య జీవి అయ్యారన్నారు. చాలా తక్కువ మందికి దక్కే అదృష్టం ఇది అన్న వెంకయ్య... చాలా మంది ఆయనన్ను అర్చకులు అనుకుంటారన్నారు. చిన్న ఉద్యోగంతో మొదలు పెట్టి శ్రీవారి సేవలో‌ కీలక వ్యక్తిగా మారడం వరకూ ఎంతో అంకిత భావంతో పని చేశారని ఉపరాష్ట్రపతి గుర్తుచేశారు. 






Also Read: తిరుమల శ్రీవారి ఆలయం ఓఎస్డీ డాలర్‌ శేషాద్రి కన్నుమూత


ఓ ఆణిముత్యాన్ని కోల్పోయాం


'పదవులతో నిమిత్తం లేకుండా ఎంతో ఉత్సాహంగా స్వామివారి సేవలో పాల్గొనేవారు. 1978లో తిరుమల శ్రీవారి సేవకుడిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి, శ్రీవారి సేవల్లోనూ, కైంకర్యాల్లోనూ, సేవలందించే శేషాద్రి తెలియని వారు లేరు. శ్రీనివాసుడికి నిత్యం కైంకర్యాలు, ఆలయ సంప్రదాయాలు ఉత్సవాలు, సేవలు ఆలయ చరిత్ర విషయంలో ఆయనకు మంచి పట్టు ఉంది. నేను ఎప్పుడూ తిరుమలకు వెళ్లినా అధికారులందరూ మారే వారు కానీ శేషాద్రి మాత్రం అక్కడే కనిపించే వారు. ‌ఎంతో ఆప్యాయంగా పలకరించి స్వామి వారి దర్శనం సమయంలో ప్రక్కనే ఉండే వారు. ఎంతో ఓపికతో ఆలయ చరిత్రను వివరించేవారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమయంలో ఎన్నో విషయాలు ఓపికగా వివరించారు. పాల శేషాద్రి మరణ వార్తను వినగానే ఓ ఆణిముత్యాన్ని కోల్పోయామని అనిపించింది. జీవితం చివరి రోజుల్లో కూడా శ్రీనివాసుడి సేవల్లో‌ ఉంటూ పరమపదాన్ని పొందారు. శేషాద్రి ఆత్మశాంతి కలుగజేయాలని ప్రార్థిస్తూ వారి కుటుంబం సభ్యులకు సంతాపం తెలియజేస్తున్నాను.' అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. 


Also Read: పాల శేషాద్రి.. డాలర్ శేషాద్రిగా ఎలా మారారు.. సామాన్యుల నుంచి వీవీఐపీల వరకు సుపరిచితులు!


శేషాద్రి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం : వైవీ సుబ్బారెడ్డి


డాలర్ శేషాద్రి పార్థీవదేహానికి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి నివాళులు అర్పించారు. శేషాద్రి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. డాలర్ శేషాద్రి మరణం తీరనిలోటు అని, ఆయన జీవితాన్ని స్వామి, భక్తుల సేవకే అంకితం చేశారన్నారు. ఆయనకు ఆరోగ్యం సహకరించకపోయినా స్వామిసేవను వీడలేదని, సంవత్సరం ముందు కరోనా బారిన పడినా కూడా మెరుగైన వైద్యమందించి ఆయన్ను కాపాడుకున్నామని ఛైర్మన్ తెలియజేశారు. ఆయన ఆరోగ్యం బాగోని కారణంగా విశాఖలో కార్తీక దీపోత్సవానికి వెళ్లొద్దని కోరామని, దేవునిసేవ కంటే తన ఆరోగ్యం ఎక్కువకాదని శేషాద్రి చెప్పేవారని, అలాగే భగవంతుని సేవలోనే తుదిశ్వాస విడిచారని బాధను వ్యక్తం చేశారు. డాలర్ శేషాద్రి కుటుంబ సభ్యులను టీటీడీ అన్ని విధాలా ఆదుకుంటుందని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. డాలర్ శేషాద్రి స్వామి అంతిమయాత్రలో ఎమ్మెల్యే  కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి, తెలంగాణ ఆర్ అండ్ బి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు పాల్గొన్నారు. 


Also Read: ఆప్తుడి చెంతకు శేషాద్రి డాలర్.. భావోద్వేగంతో మెడలో వేసుకున్న టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి