తిరుమల శ్రీవారి ఆలయం ఓఎస్డీ డాలర్ శేషాద్రి కన్నుమూశారు. గుండెపోటు రావడంతో సోమవారం ఉదయం డాలర్ శేషాద్రి కన్నుమూశారని సమాచారం. కార్తీక దిపోత్సవంలో పాల్గొనేందుకు ఆయన విశాఖపట్నం వెళ్లారు. అక్కడ ఒక్కసారిగా ఛాతీలో నొప్పి రావడంతో ఆయన విశాఖలోని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా మార్గంమధ్యలోనే డాలర్ శేషాద్రి తుదిశ్వాస విడిచారని అధికారులు తెలిపారు. శేషాద్రికి భార్య చంద్ర, ఇద్దరు అన్నలు, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు.
డాలర్ శేషాద్రి 1978 నుంచి శ్రీవారికి సేవలు అందిస్తున్నారు. ఈ క్రమంలో 2007లో ఆయన రిటైర్ అయ్యారు. కానీ, ఆయన సేవలు తప్పనిసరి కావడంతో ఓఎస్టీగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆయనకు బాధ్యతలు అప్పగించింది. డాలర్ శేషాద్రి ఆకస్మిక మరణం పట్ల టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన మరణం టీటీడీకి తీరని లోటు అని పేర్కొన్నారు. జీవితంలో చివరి క్షణం వరకు శ్రీవారి సేవలోనే ఉన్నారు డాల్లర్ శేషాద్రి.
Also Read: AP Governor: ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ కు మరోసారి అస్వస్థత... హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రికి తరలింపు
మూడేళ్ల కిందట తీవ్ర అస్వస్థత.. గతంలో గుండెపోటు!
తిరుమల ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి మూడేళ్ల కిందట తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ వాహన సేవ నిర్వహించిన ఆయనకు క్రతువులో అధిక సమయం గడపడంతో అస్వస్థతకు గురయ్యారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న ఆయన కొన్ని రోజులకు ఆరోగ్యంగా డిశ్ఛార్జ్ అయ్యారు. గతంలోనూ డాలర్ శేషాద్రికి గుండెపోటు వచ్చింది. దాదాపు నెల రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన తరువాత కోలుకున్నారు. తాజాగా మరోసారి గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయిన ఆయన తుదిశ్వాస విడిచారు.
Also Read: Tirumala: శ్రీవారి సర్వ దర్శనం టిక్కెట్లు విడుదల.. రోజుకు పది వేల చొప్పున కేటాయించిన టీటీడీ