తిరుమల ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి అసలు పేరు పాల శేషాద్రి. విశాఖలో జరుగుతున్న దిపోత్సవంలో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన గుండెపోటు రావడంతో కన్నుమూశారు. దీంతో టీటీడీలో విషాదం నెలకొంది. సీజేఐ ఎన్వీ రమణతో పాటు పలువురు ప్రముఖులు డాలర్ శేషాద్రి మరణంపై సంతాపం ప్రకటించారు. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి, తదితరులు ఆయన కుటుంబాన్ని పరామర్శించారు.
దాదాపు 4 దశాబ్దాలకు పైగా తిరుమలలో శ్రీవారికి సేవలు అందిస్తున్న డాలర్ శేషాద్రి మరణం తరువాత మరోసారి చర్చకు వచ్చిన అంశం ఏంటంటే ఆయన మెడలో వేసుకునే చైన్, డాలర్ ఎవరికి ఇస్తారని. ఆయన అసలు పేరు పాల శేషాద్రి అయినప్పటికీ మెడలో డాలర్ ధరించడంతో డాలర్ శేషాద్రిగా ఫేమస్ అయ్యారు. ఆయన డాలర్ ఎవరికి వెళుతుంది, ఎవరు తీసుకుంటారా అని భావించేవారు. ఎందుకంటే ఆయనకు వారసులు లేరు. కానీ చివరికి ఆయన కోరిక మేరకు సన్నిహితుడు, టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి చెంతకు ఆ చైన్, డాలర్ చేరాయి.
కొంతకాలం కిందట తనకు అత్యంత ఆప్తుడైన ధర్మారెడ్డికి తన చైన్, డాలర్‌ను శేషాద్రి ఇచ్చారు. అయితే అందుకు ఆయన నిరాకరించారు. శేషాద్రి వద్దనే డాలర్‌ను ఉంచమని చెప్పారు. నేడు తన ఆప్తుడు శేషాద్రి కన్నుమూయడంతో ఆరు నెలల కిందట జరిగిన ఘటనను గుర్తుచేసుకున్నారు. శేషాద్రి ఇంటికి వెళ్లిన ధర్మారెడ్డి చైన్‌తో పాటు డాలర్‌ను తీసుకుని మెడలో ధరించారు. శేషాద్రికి గుర్తుగా చైన్, డాలర్‌ను ధరించి వీరి మధ్య బంధాన్ని గుర్తు చేసుకొని కన్నీటి పర్యవంతమాయ్యారు. శేషాద్రితో ధర్మారెడ్డికి ఉన్న అనుబంధానికి ఇది నిదర్శనమని టీటీడీ ఉద్యోగులు చెబుతున్నారు.
Also Read: Dollar Seshadri: పాల శేషాద్రి.. డాలర్ శేషాద్రిగా ఎలా మారారు.. సామాన్యుల నుంచి వీవీఐపీల వరకు సుపరిచితులు!
రేపు తిరుపతిలో అంతిమ సంస్కారాలు..
గుండెపోటుతో కన్నుమూసిన శేషాద్రి భౌతికకాయాన్ని ఆంధ్ర మెడికల్ కాలేజీకి తరలించారు. సోమవారం మధ్యాహ్నం రోడ్డు మార్గాన వైజాగ్ నుంచి తిరుపతికి భౌతికకాయం తరలిస్తున్నారు. అర్దరాత్రికి తిరుపతికి చేరుకుంటుంది. ప్రజల సందర్శనార్థం రేపు ఉదయం తిరుపతిలో సిరిగిరి అపార్ట్మెంట్‌లో శేషాద్రి పార్థీవదేహాన్ని ఉంచేలా ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం పూజలు నిర్వహించిన అనంతరం తిరుపతి గోవిందదామంలో శేషాద్రి అంతిమ సంస్కారాలు జరిపిస్తారు.
Also Read: తిరుమల శ్రీవారి ఆలయం ఓఎస్డీ డాలర్ శేషాద్రి కన్నుమూత
Also Read: YV Subba Reddy: డాలర్ శేషాద్రి మరణం తీరని లోటు: టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సంతాపం