శ్రీపాల శేషాద్రి (డాలర్ శేషాద్రి) స్వామి మరణం టీటీడీకి తీరని లోటు అని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. నేటి ఉదయం గుండెపోటు రావడంతో డాలర్ శేషాద్రి కన్నుమూశారు. ఆయన హఠాన్మరణంపై టీటీడీ చైర్మన్ స్పందించారు. ‘తిరుమల శ్రీవారి సేవలో 1978 నుంచి తరిస్తున్న వ్యక్తి డాలర్ శేషాద్రి. వైజాగ్‌లో ఈ రోజు టీటీడీ నిర్వహించనున్న కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనడానికి శేషాద్రి స్వామి వెళ్లారు. శ్రీవారి సేవే ఊపిరిగా జీవితంలో చివరి క్షణం వరకు ఆయన సేవలు అందించారు.
డాలర్ శేషాద్రి జీవితమంతా స్వామివారి సేవలో తరించి ధన్య జీవి అయ్యారు. అందరితో ప్రేమగా, ఆలయ కార్యక్రమాల్లో అధికారులు, అర్చకులకు పెద్ద దిక్కుగా పని చేశారు. ఆయన మరణ వార్త తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని శ్రీవారిని ప్రార్థిస్తున్నానంటూ వైవీ సుబ్బారెడ్డి సంతాపం తెలిపారు. తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి మరణంపై ప్రముఖులు స్పందిస్తున్నారు. డాలర్ శేషాద్రి సతీమణి చంద్రను తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పరామర్శించారు. శేషాద్రి స్వామి మరణంపై పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.
Also Read: తిరుమల శ్రీవారి ఆలయం ఓఎస్డీ డాలర్ శేషాద్రి కన్నుమూత
కార్తీక దిపోత్సవంలో పాల్గొనేందుకు ఆయన విశాఖపట్నం వెళ్లారు. అక్కడ ఒక్కసారిగా ఛాతీలో నొప్పి రావడంతో డాలర్ శేషాద్రిని విశాఖలోని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా మార్గంమధ్యలోనే తుదిశ్వాస విడిచారని అధికారులు తెలిపారు. డాలర్ శేషాద్రి 1978లో తిరుమల శ్రీవారికి సేవలు చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో 2006లో ఆయన రిటైర్ అయ్యారు. ఆయన సేవలు తప్పనిసరి అని ఓఎస్టీగా టీటీడీ ఆయనకు బాధ్యతలు అప్పగించింది. చివరి క్షణం వరకు శ్రీవారిలో సేవలో ఉంటూ తరించారని టీటీడీ పేర్కొంది.
Also Read: AP Governor: ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ కు మరోసారి అస్వస్థత... హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రికి తరలింపు