శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆదివారం ఉదయం స్వామి వారి సేవలో పాల్గొన్నారు. అనంతరం ఆలయం బయటకు వచ్చిన వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తుల సంఖ్యను క్రమేపి పెంచుతున్నట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా రాత్రి సమయాల్లో తిరుమలకు రాకపోకలు నిలుపుదల చేశామన్నారు. త్వరలో నడకదారిలో తిరుమలకు వచ్చే భక్తులకు దర్శనాలు కల్పించేందుకు కార్యాచరణ రూపొందిస్తామన్నారు. అధికారులతో మాట్లాడి రెండు, మూడు రోజుల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మరి కొన్ని సేవలు ప్రారంభించాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.


Also Read: గిరిజన తేనెతో శ్రీవారికి అభిషేకం... జీసీసీ ప్రతిపాదనకు టీటీడీ ఓకే


సర్వదర్శనం టికెట్లపై త్వరలో నిర్ణయం


భారీ వర్షాల కారణంగా నడకదారిలో వచ్చే భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. అందుకే రాత్రి సమయాల్లో రాకపోకలు నిలిపివేశామన్నారు. క్రమంగా కరోనా తగ్గుముఖం పడుతున్న కారణంగా అధికారులతో చర్చించి భక్తుల సంఖ్య పెంపుపై ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు. సర్వదర్శనం టోకెన్లు ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌ లైన్ అందుబాటులో ఉంచాలనేది త్వరలో నిర్ణయం తీసుకుంటామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. 


Also Read: టీటీడీలో కార్పొరేషన్ కలకలం... ఉద్యోగులకు పవన్ కల్యాణ్ బాసట... సుప్రీంతీర్పు ఉల్లంఘనంటూ విమర్శలు


టికెట్ల కోసం భారీ డిమాండ్


ప్రస్తుతం టీటీడీ దర్శనం టోకెన్లను ఆన్‌లైన్‌లో మాత్రమే విడుదల చేస్తుంది. శ్రీవారి దర్శనానికి సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, టైంస్లాట్‌ సర్వదర్శన టోకెన్లను గోవింద యాప్‌లో కాకుండా టీటీడీ వెబ్‌సైట్‌లోనే బుక్‌ చేసుకోవాలని అధికారులు తెలిపారు. శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం నవంబర్, డిసెంబర్‌ నెలల టికెట్లను టీటీడీ ఆన్‌లైన్‌లో ఉంచింది. కొన్ని గంటల వ్యవధిలోనే భక్తులు టికెట్లను కొనుగోలు చేసేశారు. అక్టోబర్ 22వ తేదీ ఉదయం 9 గంటలకు టికెట్లు విడుదల అవ్వగా మధ్యాహం 1.30 వరకు టికెట్లు అన్నీ ఖాళీ అయ్యాయి. రెండు నెలలకు రోజుకు 12 వేల చొప్పున రెండు నెలలకు 7 లక్షల 8 వేల టికెట్లను టీటీడీ విడుదల చేసింది. టికెట్ల కోసం భక్తుల నుంచి భారీ డిమాండ్ ఉంది. టికెట్ల విక్రయం ద్వారా టీటీడీకి దాదాపు రూ.21 కోట్ల ఆదాయం వచ్చింది. సర్వదర్శనం టికెట్లను కూడా టీటీడీ ఆన్‌లైన్‌లో మాత్రమే ఉంచుతుంది. అయితే పరిమిత సంఖ్యలోనే టికెట్లు జారీ చేస్తుండడంతో చాలా మంది భక్తులకు టికెట్లు దొరకడంలేదు. అయితే శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసుల సర్టిఫికెట్‌ లేదా కోవిడ్‌ నెగిటివ్‌ రిపోర్టుతో రావాల్సి ఉంటుంది. 


Also Read: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సీఎం జగన్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి