దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ సమావేశంలో భాగంగా కేంద్ర హోమంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్ కు వచ్చారు. తిరుపతికి చేరుకున్న అమిత్ షాకు సీఎం జగన్ స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం తాజ్ హోటల్‌లో బస చేసి ఆదివారం మధ్యాహ్నం దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో అమిత్ షా పాల్గొననున్నారు.
అంతకుముందు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న అమిత్ షాకు ఏపీ సీఎం జగన్ శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. ఆదివారం ఉదయం భారత వైమానిక దళ హెలికాప్టర్ లో బయల్దేరి నెల్లూరు జిల్లా వెంకటాచలానికి చేరుకుంటారు అమిత్ షా. అక్షర విద్యాలయ, స్వర్ణ భారతి ట్రస్టు, ముప్పవరపు ఫౌండేషన్‌లకు సంబంధించిన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. సోమ నైపుణ్యాభివృద్ధి కేంద్రం, గ్రామీణ స్వయం సాధికార శిక్షణ సంస్థను సందర్శిస్తారు. మధ్యాహ్నం స్వర్ణ భారతి ట్రస్టు 20వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొంటారు.
తిరిగి మధ్యాహ్నం 2.40 గంటలకు తిరుపతిలోని తాజ్ హోటల్‌కు చేరుకుంటారు. అదే హోటల్‌లో మధ్యాహ్నం 3 గంటల నుంచి జరిగే సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొంటారు. ఆ భేటీ ముగిశాక ఆదివారం రాత్రి తాజ్ హోటల్‌లోనే బస చేస్తారు. సోమవారం ఉదయం వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని మధ్యాహ్నం 3 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుంచి బయల్దేరి సాయంత్రం 5.40కు దిల్లీ వెళ్తారు.
సీఎం జగన్ తాడేపల్లికి చేరుకుని.. మళ్లీ ఆదివారం మధ్యాహ్నం తిరుపతి బయల్దేరి వెళ్తారు. ఆదివారం జరిగే సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొంటారు.
సదరన్ జోనల్ సమావేశంలో రాష్ట్రాల మధ్య సహకారం, వివాదాలు, సరిహద్దు సమస్యలు, అంతర్గత భద్రత, మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు, పర్యాటక అభివృద్ధి, పెండింగ్ అంశాలు, ఆర్థికాభివృద్ధి, ఎగుమతులు, కేంద్ర రాష్ట్రాల మధ్య సహకారం వంటి అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో పాల్గొనే రాష్టాలకు సంబంధించిన 48 అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. దేశాభివృద్ధిలో రాష్ట్రాల భాగస్వామ్యం మరింత పెరిగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర హోంమంత్రి సూచనలు చేయనున్నారు.
Also Read: AP Financial Status : 662 శాతం లోటు ! పతనం అంచున ఏపీ ఆర్థిక వ్యవస్థ ?
Also Read: MLA Roja: చంద్రబాబు మీద లోకేశ్ ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్నట్టు అనిపిస్తుంది