చంద్రబాబుపై ఎమ్మెల్యే రోజా విమర్శలు గుప్పించారు. చంద్రబాబు నాయుడు, లోకేశ్ మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్టుగా ఉందని ఆమె విమర్శించారు. సర్పంచ్ ఎన్నికలు పెడితే తెలుగుదేశం పార్టీని ప్రజలు తుంగలో తొక్కారని, మున్సిపల్ ఎన్నికల్లో మురికి కాలువలో ముంచెత్తారు అని విమర్శించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో తరిమి.. తరిమి కొట్టారని ఆ దెబ్బకి భయపడి ఎన్నికలకి దూరంగా ఉన్నామని ప్రకటించుకోవాల్సి వచ్చిందన్నారు. మొన్న బద్వేలు జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీకి ఏజెంట్ గా పని చేసి ఓట్లు వేయించుకోవాలన్న టీడీపీ కుతంత్రాలకి డిపాజిట్ గల్లంతు అయిందని రోజా వ్యాఖ్యానించారు. 


తిరుపతి ఎన్నికల్లో కూడా బుద్ధి చెప్పినా.. ఇంకా బుద్ధి రాని చంద్రబాబు నాయుడు,లోకేష్ దమ్ముంటే రండి అని మాట్లాడే మాటలు చూస్తుంటే నిజంగానే హాస్యాస్పదంగా ఉందన్నారు. లోకేశ్ మాట్లాడే మాటలు చూస్తుంటే తనకు నిజంగానే అనుమానంగా ఉందన్నారు. మంగళగిరిలో తనను ఓడించిన నాన్న మీద ప్రతీకారం తీర్చుకోవడం కోసం.. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఓడించి వాళ్ల నాన్న రాజకీయ భవిష్యత్తుని లోకేశ్ సమాధి చేసే ప్రయత్నం చేస్తున్నాడేమో అని అనిపిస్తుందని రోజా ఎద్దేవా చేశారు. 


కుప్పం ప్రజల సుఖ దుఃఖాల్లో పాలు పంచుకోవడానికి లోకేష్ గాని, చంద్రబాబు నాయుడు గాని అక్కడ లేరు అన్నారు. పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు నాయుడు, అతనిని ఓట్లు వేయించి గెలిపించుకున్న కుప్పం ప్రజలకు ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని ఆరోపించారు.  జగన్మోహన్ రెడ్డి మాత్రమే వారిని తమ సొంత నియోజకవర్గ ప్రజలు లాగా చొరవ తీసుకుని అభివృద్ధి చేశారన్నారు. కుప్పం ప్రజల ఓట్లు వేసినా.. వేయకపోయినా.. సంక్షేమ పథకాలను అందేటట్లు జగన్ చూస్తున్నారన్నారు.


జగన్ చేస్తున్న అభివృద్ధికి కానుకగా.. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి చంద్రబాబు, లోకేశ్  కు బుద్ధి చెప్పాలన్నారు. ఈ రాష్ట్రంలో క్యాంపు రాజకీయాలకి, డబ్బులతో ప్రలోభ పెట్టే రాజకీయాలకి, మద్యంతో ప్రలోభ పెట్టే రాజకీయాలకి తెర లేపింది చంద్రబాబు నాయుడేనని విమర్శించారు. ఆ విషయం కుప్పం ప్రజలతో సహా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసునన్నారు.


Also Read: AIded Students : బడులను కాపాడుకున్న విద్యార్థులు ... ఎయిడెడ్ ఉద్యమంలో లాఠీ దెబ్బలకూ భయపడని స్టూడెంట్స్ !


Also Read: Maoist Ravi: బాంబు ప్రమాదంలో మావోయిస్టు రవి మృతి... ఏడాదిన్నర తర్వాత ధ్రువీకరించిన మావోయిస్టు పార్టీ


Also Read: Nellore News: వానలు వెలిశాయి.. వ్యాధులు పొంచి ఉన్నాయి... జాగ్రత్తలు పాటించాలని వైద్యుల సూచన