ఎయిడెడ్ విద్యా సంస్థల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఇప్పటికి ప్రభుత్వానికి స్వాధీనం చేస్తూ నిర్ణయం తీసుకున్న విద్యా సంస్థలు కూడా మళ్లీ తమ విద్యాసంస్థల్ని నడుపుకునేందుకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొద్ది రోజులుగా ఎయిడెడ్ విద్యా సంస్థల విద్యార్థులు రోడ్డెక్కి చేస్తున్న ఆందోళనలకు ఫలితం లభించినట్లయింది. విద్యార్థులు పిడికిలి బిగిస్తే ప్రభుత్వాలు కూడా వెనక్కి తగ్గక తప్పదని నిరూపితమయింది.


Also Read : 662 శాతం లోటు ! పతనం అంచున ఏపీ ఆర్థిక వ్యవస్థ ?


ఎయిడెడ్ జీవోపై కదిలిన లక్షల మంది విద్యార్థులు !


ఏపిలో ఎయిడెడ్ స్కూల్స్ 1988, ఎయిడెడ్ జూనియర్ కాలేజిలు 122 , ఎయిడెడ్ డిగ్రీ కాలేజిలు 137 ఉన్నాయి. లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రభుత్వం గతంలో ఇచ్చిన జీవోల ప్రకారం ఆస్తులతో సహా ఏపి ప్రభుత్వానికి స్వాధీనం చేయాలి. అలా చేయకుంటే వారి ముందున్న మరో ఆప్షన్  సొంత నిధులతోనే విద్యాంస్దలను నడుపుకోవడం. అంటే ఇన్నాళ్లు ఆయా విద్యాసంస్దల్లో ప్రభుత్వ జీతాలు తీసుకుంటున్న ఉపాధ్యాయులంతా ప్రభుత్వ అధీనంలోకి వెళ్లిపోతారు. ఎయిడ్ విద్యాసంస్దల యాజమాన్యాలే తిరిగి ఉపాద్యాయులను సొంత నిధులతో నియమించుకుని .. జీతాలు చెల్లించడం చేయాలి. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రభుత్వానికి స్వాధీనం చేయని ఎయిడెడ్ విద్యాసంస్దలలకు ప్రభుత్వం ఎయిడ్ ఆపేస్తుంది. అంటే అది ప్రైవేటు విద్యా సంస్థ అయిపోతుందన్నమాట. ఈ కారణంగా చాలా విద్యా సంస్థలు ఫీజులు పెంచడం లేదా స్కూళ్లను మూసివేయడం చేస్తున్నాయి.


Also Read : ఎయిడెడ్ విద్యాసంస్థల విలీనంపై ఒత్తిడి లేదు... గత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవచ్చు... ఏపీ విద్యాశాఖ ఉత్తర్వులు


లాఠీ దెబ్బలకు వెరవకుండా రోడ్డెక్కి పోరాటం !


ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రభుత్వ స్కూళ్లలో అందరికీ అడ్మిషన్స్ కల్పించే ఏర్పాటు చేస్తే ఏ వివాదమూ ఉండేది కాదు. కానీ ప్రభుత్వం అలాంటిదేమీ చేయకపోవడం వల్ల విద్యార్థులు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. చాలా విద్యా సంస్థలు ఫీజుల భారాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. మరికొన్ని విద్యా సంస్థలు మొత్తానికే మూసివేత నిర్ణయం తీసుకున్నాయి. అయితే ప్రభుత్వానికి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్న విద్యా సంస్థలతో పెద్దగా సమస్య రాలేదు. కానీ ఎక్కువ ఎయిడెడ్ విద్యా సంస్థలు బలవంతం మీద ప్రభుత్వానికి అప్పగించాయన్న విమర్శలు వచ్చాయి.కారణాలు ఏమైతేనేం తమకు అన్యాయం జరుగుతోందన్న ఉద్దేశంతో విద్యార్థులు రోడ్లపైకి వచ్చారు. ధర్నాలతో హోరెత్తించారు. లాఠీ దెబ్బలకు వెనుకాడలేదు. పోలీసుల బెదిరింపులకూ తగ్గలేదు. కడ వరకూ పోరాడారు.


Also Read: రూ. 25వేల కోట్ల బకాయిలు డిస్కంలకు చెల్లించండి.. ప్రభుత్వానికి ఏపీఈఆర్సీ లేఖ !


తమ పోరాటంతో స్కూళ్లను కాపాడుకున్న విద్యార్థులు !


మొదట విశాఖలో ఎయిడెడ్ స్కూళ్ల విద్యార్థులు పోరాటం ప్రారంభించారు. అది రాష్ట్రం మొత్తం వ్యాపించింది. చివరికి అనంతపురంలో విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం ఉద్యమం మరింత పెరగడానికి కారణం అయింది. అన్ని జిల్లాల్లోనూ ఎయిడెడ్ విద్యాసంస్థల్లో ఇలాంటి వాతావరణమే ఉంది. ప్రభుత్వం తమను చదువుకు దూరం చేస్తోందన్న అభిప్రాయంతో  ఎక్కువ మంది ఉన్నారు. వారంతా రోడ్డుపైకి ఎక్కడంతో చివరికి ప్రభుత్వం దిగి రాక తప్పలేదు. అయితే సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదు. జీవోను రద్దు చేయలేదు. మరో రెండు ఆప్షన్లు మాత్రమే ఇచ్చింది. అందుకే విద్యార్థుల ఉద్యమం నివురు గప్పిన నిప్పులా ఉందని భావిస్తున్నారు. 


Also Read : వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు.. సగం బలహీనవర్గాల నేతలకే..!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి