Breaking News: దసరా తర్వాతే హుజురాబాద్, బద్వేల్ ఉపఎన్నికలు... ఈసీ స్పష్టం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 4న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. బ్రేకింగ్ న్యూస్ కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

ABP Desam Last Updated: 04 Sep 2021 01:52 PM
అది ఆత్మీయ సమ్మేళనం కాదు.. రాజకీయ సమ్మేళనం..

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి విజయమ్మ నిర్వహించింది ఆత్మీయ సమ్మేళనం కాదని.. రాజకీయ సమ్మేళనం అని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ ఆరోపించారు. వైఎస్ సేవలు గుర్తించింది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని అన్నారు. ఏపీ సీఎం జగన్, షర్మిల ఎదిగిన కాంగ్రెస్ కొమ్మని నరకాలని చూస్తున్నారని విమర్శించారు. తండ్రి ఆత్మీయ సమ్మేళనానికి రాని కొడుకు ఉంటాడా? అని ప్రశ్నించారు. వైఎస్ఆర్ బతికి ఉంటే విజయమ్మ తెలంగాణకు వచ్చేవారు కాదని అన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి దీనిని సమర్థిస్తారా అని నిలదీశారు. కాంగ్రెస్ నుండి బయటకు వెళ్లాలని అనుకుంటే వెళ్లండి కానీ వెన్నుపోటు పొడవద్దని హితవు పలికారు. 

ఊడిన రన్నింగ్‌ బస్సు వెనుక చక్రాలు.. తప్పిన ముప్పు

తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలో శనివారం పెను ప్రమాదం తప్పింది. రన్నింగ్ బస్సు వెనుక చక్రాలు ఊడిపోయాయి. డ్రైవర్ చాకచక్యంగా బస్సును ఆపేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.  గోకవరం నుంచి పాతకోట వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులు సుమారు 30 మంది ప్రయాణీకులున్నారు. 

వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకంపై మంత్రి వర్గ ఉపసంఘం భేటీ

అమరావతి సచివాలయం మూడో బ్లాకులో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి రెవెన్యూ ధర్మాన కృష్ణదాస్ ఆధ్వర్యంలో వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకంపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. ఈసమావేశంలో పథకం అమలుకు సంబంధించిన వివిధ అంశాలు సమీక్షించారు. ఈ భేటీలో సిసిఎల్ఏ నీరబ్ కుమార్ ప్రసాద్, ముఖ్య కార్యదర్శులు గోపాల కృష్ణ ద్వివేది, వి.ఉషారాణి, సిద్దార్థ జైన్ కూడా పాల్గొన్నారు.

గవర్నర్‌తో భేటీ అయిన ఇండోనేషియా కాన్సుల్ జనరల్

ఇండోనేషియా రిపబ్లిక్ కాన్సుల్ జనరల్ అగస్ పి. సప్టోనో శనివారం రాజ్ భవన్‌లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మానానీయ బిశ్వ భూషణ్ హరిచందన్‌ను కలిశారు. మర్యాద పూర్వకంగా జరిగిన ఈ సమావేశంలో వీరిరువురు సమకాలీన అంశాలపై చర్చించారు. తొలుత రాజ్‌ భవన్‌కు విచ్చేసిన ఇండోనేషియా కాన్సుల్ జనరల్ (ముంబై) అగస్ పి. సప్టోనోకు గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌పి సిసోడియా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గవర్నర్ శ్రీ హరిచందన్ మాట్లాడుతూ దేశంలోనే రెండో పొడవైన తీరప్రాంతం, సమృద్ధిగా సహజ వనరులతో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని ఆంధ్రప్రదేశ్ కలిగి ఉందని ఇండోనేషియా రిపబ్లిక్ కాన్సుల్ జనరల్‌కు వివరించారు. ఇక్కడి పెట్టుబడి అవకాశాలను అన్వేషించడానికి ఇండోనేషియా నుంచి  పెట్టుబడిదారులు రావచ్చని, రాష్ట్ర ప్రభుత్వం పలు రాయితీలను అందిస్తుందని గవర్నర్ పేర్కొన్నారు. గవర్నర్ హరి చందన్ ఇండోనేషియా కాన్సుల్ జనరల్ అగస్ పి. సప్టోనోను జ్ఞాపికతో సత్కరించారు. 

బంజారాహిల్స్‌లో మాదక ద్రవ్యాల పట్టివేత..ముగ్గురు అరెస్టు

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో పెద్ద మొత్తంలో డ్రగ్స్‌ను ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 30 గ్రాముల ఎండీఎంఏ, 10 కిలోల గంజాయి, 50 గ్రాముల ఛారాస్‌, నాలుగు బోల్ట్స్‌ ఎల్‌ఎస్‌డీ డ్రగ్‌ స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన వారిలో హైదరాబాద్‌కు చెందిన మద్ది శివశంకర్ రెడ్డి, గంధం మణికాంత్, డార్జిలింగ్‌కు చెందిన శిల్పా రాయ్‌ ఉన్నారు.

అమిత్ షా ఇంటికి కేసీఆర్

ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం మధ్యాహ్నం అమిత్ షాను కలిసేందుకు వెళ్లారు. ఢిల్లీలో తెలంగాణ భవన్ కోసం స్థలం కేటాయించాలని కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాక, రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కూడా చర్చించనున్నారు. అనంతరం మరో మంత్రి గజేంద్రసింగ్ శెకావత్‌ను కూడా కలవనున్నారు.

సీఎం జగన్ పాలన అధోగతిలో అగ్రస్థానం..ప్రగతిలో చిట్టచివరి స్థానం : లోకేశ్

ఎవరెలా పోతే నాకేంటి అనే రీతిలో వైసీపీ పాలన ఉందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ విమర్శించారు. థర్డ్ వేవ్ హెచ్చరికలతో అన్ని రాష్ట్రాలు అప్రమత్తమై, వ్యాక్సినేషన్ వేగవంతం చేశాయన్నారు. ఏపీలో వైకాపా ప్రభుత్వం 18 ఏళ్లు పైబడిన వారికి ఒక్క డోసు 40 శాతం, రెండు డోసులను 16 శాతం మందికి అందించి దేశంలోనే అట్టడుగుస్థానంలో ఉందని ఆరోపించారు. వ్యాక్సిన్లు వృథా కాకుండా వేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. థర్డ్ వేవ్ పిల్లలపై తీవ్ర ప్రభావం చూపనుందనే హెచ్చరికలపై ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టాలని కోరారు. 

ఫ్రిడ్జ్ షార్ట్ సర్యూట్ తో లక్ష్మీదేవి అనే మహిళ మృతి

అనంతపురం నగరంలోని నాయక్ నగర్ లో విషాద సంఘటన చోటుచేసుకుంది. ఫ్రిడ్జ్ షార్ట్ సర్యూట్ తో లక్ష్మీదేవి అనే మహిళ మృతి చెందింది. శనివారం తెల్లవారుజామున ఫ్రిడ్జి నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.  ఆ సమయంలో పక్కనే పడుకున్న లక్ష్మీదేవి అనే మహిళకు మంటలు వ్యాప్తించి అక్కడికక్కడే మృతి చెందారు. ఇంట్లో దట్టమైన పొగలతో వ్యాపించడంతో మరో నలుగురికి తీవ్ర అస్వస్థత గురయ్యారు. 

టీవీ మీద పడి 11 నెలల చిన్నారి మృతి

కృష్ణా జిల్లాలో టీవీ మీద పసిబడ్డి మృతి చెందింది. నందిగామ మండలం కంచల గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కీర్తిలక్ష్మి ప్రియ 11 నెలల చిన్నారిపై  టీవీ మీద పడటంతో మృతి చెందింది. దీంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.  

ఉప ఎన్నికలు ఆలస్యం

తెలంగాణ, ఏపీలో ఉప ఎన్నికలు ఆలస్యం కానున్నాయి. ఉప ఎన్నికల నిర్వహణపై ఎన్నికల సంఘం వివిధ రాష్ట్రాల అభిప్రాయం కోరగా.. ఏపీ, తెలంగాణ సహా మొత్తం 11 రాష్ట్రాలు వాయిదా వేయాలని కోరాయి. వరుసగా పండుగలు ఉన్నందున ఈ సీజన్ అయిపోయాక ఉప ఎన్నికలు నిర్వహించాలని సూచించాయి. దీంతో ఎన్నికల సంఘం 11 రాష్ట్రాలు మినహా బెంగాల్, ఒడిశాలో ఉప ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. బెంగాల్‌లో 3, ఒడిశాలో ఒక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. 

ఏపీలో ఐఏఎస్ అధికారులు బదిలీ

ఏపీలో పలువురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఏఎంఆర్‌డీఏ కమిషనర్‌గా కె.విజయ, సీసీఎల్ఏ అప్పీల్స్ కమిషనర్‌గా డా. పి.లక్ష్మీనరసింహం, ఏఎంఆర్‌డీఏ అదనపు కమిషనర్‌గా పి.ప్రశాంతిలను నియమిస్తూ ఆదేశాలు జారీచేసింది. గుంటూరు జిల్లా గ్రామ, వార్డు సచివాలయాల అభివృద్ధి జేసీగా జి. రాజకుమారి, కడప ఆర్డీవోగా పి. ధర్మచంద్రారెడ్డి, ఎనర్జీ డిపార్ట్​మెంట్‌ డిప్యూటీ సెక్రెటరీగా పృథ్వీ తేజ్, ఏపీ పవర్ కార్పొరేషన్ ఎండీగా పృథ్వీతేజ్‌కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. 

ఏపీలో నామినేటెడ్ పదవులకు డైరెక్టర్ల ప్రకటన

ఏపీలో నామినేటెడ్ పదవులకు ప్రభుత్వం డైరెక్టర్లను ప్రకటించింది. 47 కార్పొరేషన్లకు డైరెక్టర్లను ప్రకటించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణరెడ్డి, మంత్రి వేణుగోపాల కృష్ణ డైరెక్టర్ల పేర్లు ప్రకటించారు.  

హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత

బంజారాహిల్స్‌లో భారీగా డ్రగ్స్‌ను అధికారులు పట్టుకున్నారు. 30 గ్రాముల ఎండీఎంఏ, ఎల్ఎస్‌డీ 4 బోల్ట్స్, 50 గ్రాముల చరాస్, 10 కిలోల గంజాయిని తెలంగాణ ఎక్సైజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సీజ్ చేశారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. శివశంకర్, మణికాంత్, శిల్పా రాయ్ అనే వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. వారి నుంచి 2 బైక్స్, నాలుగు సెల్ ఫోన్‌లను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

కేసీఆర్‌పై షర్మిల విమర్శలు

ఏడెళ్ళలో అంబేడ్కర్ విగ్రహానికి కేసీఆర్ ఎప్పుడు దండ కూడా వేయలేదని షర్మిల విమర్శించారు. దొర ఇప్పుడు ఎందుకో పొర్లు దండాలు పెడుతున్నారని అన్నారు. సీఎంవోలో ఇప్పుడు దళిత ఆఫీసర్స్‌ను నెత్తిన పెట్టుకుంటున్నారని విమర్శించారు. 









దేవీపట్నంలో వాగు దాటుతూ ముగ్గురు గల్లంతు

దేవీపట్నం మండలం కొండమొదలులో విషాదకర ఘటన చోటుచేసుకుంది. బడిగుంట-ఆకూరి మధ్య వాగు దాటుతుండగా ముగ్గురు గల్లంతయ్యారు. వాగు ఉద్ధృతిలో మహిళతో పాటు ఇద్దరు పిల్లలు కొట్టకుపోయారు. ఒకరి మృతదేహం లభ్యం కాగా, మరో ఇద్దరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

నేడు తిరుమలలో డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం

నేడు తిరుమలలో డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఉచిత దర్శనాల ప్రారంభంపై తిరుమల తిరుపతి దేవస్థానం ఇవాళ స్పష్టత ఇవ్వనుంది. టీటీడీ నుంచి దేవాదాయ శాఖకు ఏటా రూ.50 కోట్లు ఇవ్వాలని ఆర్డినెన్స్‌ ఇచ్చింది. కామన్‌ గుడ్‌ ఫండ్‌ కింద అర్చకులకు రూ.40 కోట్లు, ఇతర సంక్షేమానికి రూ.5 కోట్లు, దేవాదాయ పరిపాలనా నిధికి రూ. 5 కోట్లు కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. 

సినీ నటుడు కృష్ణుడు అరెస్టు

సినీ నటుడు కృష్ణుడు అరెస్టయ్యారు. మియాపూర్‌లోని ఓ విల్లాలో పేకాట ఆడుతూ ఆయన పోలీసులకు పట్టుబడ్డారు. పేకాట ఆడిస్తున్న పెద్దిరాజుతో పాటు మొత్తం 8 మందిని పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. శుక్రవారం రాత్రి మియాపూర్‌లోని ఓ విల్లాపై ఎస్‌వోటీ పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగానే కృష్ణుడు కూడా పేకాట ఆడుతూ చిక్కారు. మియాపూర్‌లోని శిల్పా పార్కులో పెద్దిరాజు అనే వ్యక్తితో కృష్ణుడు పేకాట నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. పేకాటరాయుళ్లను మియాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించగా.. నిందితులను వ్యక్తిగత పూచీకత్తుపై విడిచిపెట్టారు. శనివారం సాయంత్రం విచారణకు రావాలని ఆదేశించారు.

కృష్ణా జిల్లాలో బాలికపై సామూహిక అత్యాచారం

కృష్ణా జిల్లాలో బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. మాయమాటలు చెప్పి బాలికను పశువుల పాకలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం మరో ఇద్దరు యువకులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. తర్వాత బాలికను తీసుకెళ్లి ఇంటి ముందు వదిలివెళ్లిపోయారు. చిరిగిన బట్టలతో ఉన్న కూతురును చూసి తల్లిదండ్రులు బాలికను విషయం ఆరా తీసింది. వెంటనే బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

బద్వేల్ ఉపఎన్నికకు టీడీపీ అభ్యర్థిగా ఓబుళాపురం రాజశేఖర్

బద్వేల్ ఉపఎన్నికకు టీడీపీ అభ్యర్థిగా ఓబుళాపురం రాజశేఖర్​పేరును అధినేత చంద్రబాబు ఖరారు చేశారు. మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి సోదరుడైన నారాయణ రెడ్డి కుమారుడు భూపేష్ ను దాదాపుగా ఖరారు చేశారు. ఇంఛార్జిల నియామకం పెండింగ్ ఉన్న నియోజకవర్గాలపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు పార్టీ కేంద్ర కార్యాలయంలో 3 రోజుల పాటు వరుస సమీక్షలు నిర్వహించారు. సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే వెంకట సుబ్యయ్య మృతితో బద్వేల్ కు ఉపఎన్నిక నిర్వహించనున్నారు. షెడ్యూల్ ప్రకటన రాకముందే టీడీపీ అభ్యర్థిని ఖరారు చేశారు.

Background

ఈ నెల 21 లేదా 22 నుంచి ఏపీ  అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అయిదు లేదా ఏడు రోజులపాటు ఈ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. తిరిగి డిసెంబరులో మరోసారి సమావేశాలను నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. దీనిపై తుది నిర్ణయం ఇంకా రావాల్సిఉంది. ఈ నెలలో అసెంబ్లీ సమావేశాల్లోనే శాసనమండలి ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్​ల ఎన్నికలు నిర్వహించాలని పునరాలోచిస్తున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల కోటాలో 11 ఎమ్మెల్సీల ఖాళీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.