Shami Vs Bumrah: ప్లేయర్ల ఫిట్ నెస్ పై బీసీసీఐ వ్యవహార ధోరణిని మాజీ కోచ్ రవి శాస్త్రి కడిగిపారేశాడు. ముఖ్యంగా స్టార్ పేసర్ మహ్మద్ షమీ.. గాయం కారణంగా సుదీర్ఘంగా క్రికెట్ కు దూరంగా ఉండటం ఏంటని ప్రశ్నించాడు. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ఇన్నాళ్లుగా షమీతో ఏం చేస్తున్నారని అడిగాడు. నిజానికి బోర్డర్- గావస్కర్ ట్రోఫీ (బీజీటీ)లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు తోడుగా షమీ ఉంటే కథ వేరేగా ఉండేదని చాలామంది అభిప్రాయ పడ్డారు. సిరీస్ సగం ముగిసిన తర్వాత షమీని పిలిపించాలని కూడా డిమాండ్లు వెల్లువెత్తాయి. అయితే బీసీసీఐ ధోరణితో ఆటగాళ్ల పునరావాసంపై ప్రశ్నలు రేకెత్తుతున్నాయని శాస్త్రి విమర్శించాడు. ఆటగాళ్ల గాయాల అప్డేట్ పై ఇంత గోప్యం ఎందుకని, ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వాలని సూచించాడు.
షమీని ఆసీస్ టూర్ కు తీసుకొస్తే బాగుండేది..
నిజానికి 2023 ప్రపంచ కప్ వన్డే ఫైనల్ తర్వాత చీలమండ గాయంతో షమీ జట్టుకు దూరమయ్యాడు. ఆ తర్వాత ఏడాది తనకు శస్త్ర చికిత్స కూడా జరిగింది. అప్పటి నుంచి షమీ కోలుకుంటూనే ఉన్నాడు. జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందుతున్నాడు. అయితే రిహాబిలిటేషన్ ను జట్టుతో పాటే కొనసాగించి ఉంటే బాగుండేదని శాస్త్రి అభిప్రాయ పడ్డాడు. అతడిని టీమిండియాతో పాటు ఆసీస్ టూర్ కు తీసుకొచ్చి, ఎప్పటికప్పుడు మోనిటర్ చేస్తే మంచి ఫలితాలు ఉండేవని వ్యాఖ్యానించాడు. అంతర్జాతీయ ఫిజియోలతో కలిసి ఈ విషయంలో ఇంకాస్త మెరుగ్గా వర్కౌట్ చేసి ఉంటే బాగుండేదని పేర్కొన్నాడు. షమీ లేని లోటు బీజీటీలో స్పష్టంగా కనిపించిందని వ్యాఖ్యానించాడు. బుమ్రాకు తోడుగా అతనుంటే ఫలితాలు వేరేగా వచ్చేవని పేర్కొన్నాడు. ఇక షమీ లేని లోటుతో బౌలింగ్ భారం బుమ్రా, సిరాజ్ లపైనే పడింది. ఇద్దరు సిరీస్ లో చెరో 150కిపైగా ఓవర్లు బౌలింగ్ చేశారు.
పేస్ ఆల్ రౌండర్ ఉన్నాడుగా..
ఇక ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అయితే ఒక అడుగు ముందుకేసి నాలుగో టెస్టు నుంచి షమీని ఆడిస్తే బాగుండేదని వ్యాఖ్యానించాడు. అప్పటికే జట్టులో బుమ్రా, సిరాజ్ ఉన్నారని వారికి తోడుగా షమీ ఆడేవాడని, రోజుకు కొన్ని ఓవర్లు చొప్పున అతడితో బౌలింగ్ వేస్తే బాగుండేదని, నితీశ్ రెడ్డి రూపంలో బ్యాకప్ పేసర్ కూడా అందుబాటులో ఉన్నాడని గుర్తు చేశాడు. ఈ సిరీస్ లో సిరాజ్ ఎంతో కష్టపడినప్పటికీ, అతనికి లక్కు కలిసి రాలేదని పేర్కొన్నాడు. అదే షమీ కూడా తోడుంటే టీమిండియాకు చాలా హెల్ప్ అయ్యుండేదని, బుమ్రా కూడా మధ్యలో గాయాల బారిన పడకుండా షమీ సలహాలు ఇచ్చేవాడని వ్యాఖ్యానించాడు. ఏదేమైనా టీమ్ మేనేజ్మెంట్ తప్పుడు ప్రణాళికలకు మూల్యం చెల్లించుకుంది. ఐదు టెస్టుల సిరీస్ ను 1-3తో చేజార్చుకుంది. దీంతో ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించింది.