Formula E Car Race Case | హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఏసీబీ తనపై నమోదు చేసిన కేసు కొట్టి వేయాలన్న కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఫార్ములా ఈ రేసులో కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేయగా.. తనపై చర్యలు చేపట్టవద్దని, కేసు కొట్టివేయాలని కేటీఆర్ ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. ఇదివరకే వాదనలు ముగియగా, మంగళవారం ఉదయం కేటీఆర్ పిటిషన్ ను హైకోర్టు డిస్మిస్ చేసింది. ఇలాంటి కేసులలో అరెస్ట్ చేయవద్దని తీర్పునివ్వడం కుదరదని స్పష్టం చేసింది.
ఫార్ములా ఈ కారు రేసు కేసులో తెలంగాణ ప్రభుత్వ వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. కేటీఆర్ ను అరెస్ట్ చేయవద్దన్న మధ్యంతర ఉత్తర్వులు సైతం ఎత్తివేసింది. ఇలాంటి కేసుల్లో ఏసీబీ దర్యాప్తులో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు పేర్కొంది. చట్ట ప్రకారం నడుచుకోవాలని హైకోర్టు సూచించింది. చట్టాలు అందరికీ ఒకటేనని అందరికి రూల్ అఫ్ లా వర్తిస్తుందన్న హైకోర్టు స్పష్టం చేసింది. దాంతో కేటీఆర్ సుప్రీంకోర్టు వెళ్లే యోచనలో ఉన్నారు.
ఈడీ విచారణ నుంచి కేటీఆర్‌కు ఊరట
ఫార్ములా ఈ రేసు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేటీఆర్ క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసిన వెంటనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన విజ్ఞప్తిని ఈడీ ఆమోదించింది. నోటీసుల ప్రకారం రేపు విచారణకు హాజరు కాలేనని మరికొంత సమయం కావాలని కేటీఆర్ కేటీఆర్ కోరారు. కోర్టు తీర్పు వల్ల ప్రస్తుతానికి విచారణకు రాలేనని కేటీఆర్ చేసిన రిక్వెస్ట్‌ను ఈడీ ఓకే చేసింది. తదుపరి విచారణ తేదీని ఈడి త్వరలో వెల్లడించింది.
Also Read: KTR: ఫార్ములా ఈ రేస్ వ్యవహారం - కేటీఆర్‌కు మరోసారి ఏసీబీ నోటీసులు, లీగల్ టీంకు నో ఎంట్రీ
ఫార్ములా ఈ కేసులో అక్రమాల ఆరోపణపై విచారణ
బీఆర్ఎస్ హయాంలో నిర్వహించిన ఫార్ములా ఈ కారు కేసు విషయంలోరూ.55 కోట్లు అక్రమంగా తరలిపోయాయని తెలంగాణ ప్రభుత్వం విచారణ చేపట్టింది. కేసులో ఏ1 గా కేటీఆర్ పేరు చేర్చింది. ఏ2గా ఉన్న అర్వింద్ కుమార్, ఏ3 ఉన్న మాజీ ఉన్నతాధికారి బీఎల్ఎన్ రెడ్డిలకు సైతం ఏసీబీ నోటీసులు జారీ చేసి విచారణ చేపట్టింది. అయితే అంతకంటే ముందు తెలంగాణ ప్రభుత్వం కేసు నమోదుకుగానూ గవర్నర్ జిష్ణు దేవ్ శర్మకు లేఖ రాసింది. నెల రోజులకు ఆయన పర్మిషన్ ఇవ్వడంతో ఆ ఉత్తర్వులు సీఎస్ నుంచి అందగానే ఏసీబీ అధికారులు కేటీఆర్ పై కేసు నమోదు చేశారు.
నగదుకు సంబంధించిన అంశం కనుక ఈడీ సైతం రంగంలోకి దిగింది. గ్రీన్ కో సంస్థ ఫండ్స్ ఇచ్చినందుకు వారి కంపెనీలపై సైతం ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. రూ.41 కోట్లు ఎలక్టోరల్ బాండ్లు బీఆర్ఎస్ కు వచ్చాయని, విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయని సీఎం రేవంత్, కాంగ్రెస్ మంత్రులు చెబుతున్నారు. ఈ క్రమంలో జనవరి 6న కేటీఆర్ ఏసీబీ ఆఫీసుకు రాగా, లాయర్లను అడ్డుకోవడంతో కేటీఆర్ వెనక్కి వెళ్లిపోయారు. తాను చట్ట ప్రకారం నడుచుకుంటానని, కానీ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడుస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.