ACB Notice To KTR In Formula E Race Issue: ఫార్ములా ఈ రేస్ వ్యవహారానికి సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు (KTR) ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 9న విచారణకు హాజరు కావాలని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు గచ్చిబౌలి ఓరియన్ విల్లాకు వెళ్లిన అధికారులు.. నోటీసులిచ్చారు. ఈసారి కూడా లీగల్ టీంకు అనుమతి లేదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. కాగా, ఈ కేసులో విచారణకు హాజరు కావాలంటూ ఇప్పటికే కేటీఆర్‌కు ఏసీబీ అధికారులు నోటీసులిచ్చారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం బంజారాహిల్స్‌లోని ఏసీబీ కార్యాలయానికి హాజరయ్యారు. అయితే, ఆయన వెంట లాయర్లను పోలీసులు అనుమతించకపోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.


కేటీఆర్ తీవ్ర అసహనం


తన న్యాయవాదిని తన వెంట అనుమతించకపోవడంపై కేటీఆర్ పోలీసులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తన వెంట లాయర్లు ఎందుకు రాకుడదని.. వస్తే మీకు వచ్చిన నష్టం ఏంటని ప్రశ్నించారు. దాదాపు అరగంటపాటు అక్కడ ఎదురుచూసిన కేటీఆర్.. చివరికి ఏసీబీ ఆఫీసులోపలికి వెళ్లకుండానే వెనుదిరిగారు. రోడ్డుపైనే తన స్పందనను రాతపూర్వకంగా ఏసీబీ అధికారులకు అందజేశారు. హైకోర్టు తీర్పు తర్వాత చట్టప్రకారం ముందుకెళ్లాలని అందులో పేర్కొన్నారు.


మరోవైపు, విచారణకు అడ్వకేట్‌కు అనుమతి ఇవ్వాలంటూ ఏసీబీకి కేటీఆర్ న్యాయవాది నోట్ ఇచ్చారు. నోట్ తీసుకున్న ఏసీబీ అధికారులు లాయర్లను వెంట పంపించేందుకు అనుమతించలేదు. చట్ట ప్రకారం ప్రతి పౌరుడికి ఉన్న తన హక్కులను వినియోగించుకోవచ్చునని.. లాయర్లను లోపలికి అనుమతించకపోవడంపై కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏసీబీ ఆఫీసు నుంచి కేటీఆర్ వెళ్లిపోయారు. అటు నుంచి నేరుగా తెలంగాణ భవన్ కు వెళ్లి పార్టీ నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. కాగా.. కేటీఆర్ విచారణకు హాజరయ్యే ముందు నందినగర్‌లోని తన తండ్రి, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఇంటికి వెళ్లారు. అక్కడ లీగల్ టీమ్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఫార్ములా ఈ కారు రేసు కేసుకు సంబంధించి ఏసీబీ ప్రశ్నలపై ఎలా స్పందించాలి, చెప్పాల్సిన సమాధానాలపై లాయర్లతో చర్చించారు. 


కీలక అంశాలు బయటపెట్టిన ప్రభుత్వం


మరోవైపు, ఫార్ములా ఈ రేస్ వ్యవహారానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక అంశాలను బయటపెట్టింది. రేస్ నిర్వహించిన గ్రీన్ కో సంస్థ ద్వారా బీఆర్ఎస్ పార్టీకి రూ.కోట్లలో లబ్ధి చేకూరినట్లు తెలిపింది. ఎన్నికల బాండ్ల ద్వారా ఆ పార్టీకి రూ.41 కోట్లు చెల్లించినట్లు చెప్పింది. గ్రీన్ కో, అనుబంధ సంస్థలు 26 సార్లు బాండ్లు కొన్నట్లు పేర్కొంది. 2022, ఏప్రిల్ 8 - అక్టోబర్ 10 మధ్య ఇవి కొనుగోలు చేసినట్లు వెల్లడించింది.


అటు, దీనిపై స్పందించిన కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. గ్రీన్ కో సంస్థ 2022లో ఎన్నికల బాండ్లు ఇచ్చిందని.. 2023లో ఫార్ములా ఈ రేస్ జరిగిందని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీకి కూడా గ్రీన్ కో బాండ్లు ఇచ్చిందని.. ఫార్ములా ఈ రేస్ కారణంగా గ్రీన్ కో నష్టపోయిందని వివరించారు. పార్లమెంట్ ఆమోదించిన ఎన్నికల బాండ్లు అవినీతి ఎలా అవుతుందని నిలదీశారు. దేశవ్యాప్తంగా అన్ని పార్టీలకు వచ్చిన బాండ్లపై చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.


Also Read: Aramghar -Zoopark Flyover: ఆరాంఘర్ - జూపార్క్ పైవంతెనను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి - నగరంలోనే రెండో పెద్ద ఫ్లైఓవర్, ప్రత్యేకతలివే!