CM Revanth Reddy Inaugurates Aramghar - Zoopark Flyover: ట్రాఫిక్ రద్దీ నివారించేందుకు మరో ముందడుగు పడింది. నగరంలో ఆరాంఘర్ - జూపార్క్ ఫ్లై ఓవర్‌ను సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎంపీలు అసదుద్దీన్ ఒవైసీ, అనిల్ కుమార్ యాదవ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. నగరం నుంచి బెంగుళూరు హైవేకు ఉన్న ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు జూపార్క్ నుంచి ఆరాంఘర్ (Aramghar) వరకూ 4.08 కిలోమీటర్ల పొడవునా దాదాపు రూ.800 కోట్లతో ఈ పైవంతెనను బల్దియా నిర్మించింది. గతేడాది డిసెంబరులో ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేసినా కొన్ని కారణాల వల్ల నిలిచిపోయింది. ఎస్ఆర్‌డీపీలో భాగంగా నిర్మించిన ఈ ఫ్లైఓవర్ పీవీ ఎక్స్‌ప్రెస్ తర్వాత నగరంలో రెండో అతి పెద్ద వంతెన కావడం విశేషం. నగరంలోని ముఖ్య ప్రాంతాల్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరించేందుకు జీహెచ్ఎంసీ వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా పైవంతెనలు, ఆర్వోబీలను నిర్మిస్తూ ట్రాఫిక్ ఇక్కట్లను దూరం చేస్తోంది.
భాగ్యనగరాన్ని విశ్వ నగరంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్ట్ (ఎస్ఆర్‌డీపీ)లో భాగంగా రూ.5,937 కోట్ల అంచనా వ్యయంతో జీహెచ్ఎంసీ 42 ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. ప్రయాణ వేగాన్ని పెంచడం, సమయాన్ని తగ్గించడం, వాయు కాలుష్యాన్ని తగ్గించడం, కనిష్ట భూ సేకరణ నిధుల ఆధారంగా ఎస్ఆర్‌డీపీకి ప్రాధాన్యత ఇచ్చారు. జూపార్క్ ఫ్లైఓవర్ 23వ ఫ్లైఓవర్ కాగా.. ఇప్పటికీ 14 చోట్ల ఆర్వోబీ, ఆర్‌యూబీలు అందుబాటులోకి వచ్చాయి. ఓవైసీ ఫ్లై ఓవర్, అబ్దుల్ కలాం ఫ్లై ఓవర్, చాంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్ అందుబాటులోకి తీసుకురాగా.. ఆరాంఘర్ - జూపార్క్ ఫ్లై ఓవర్‌తో శంషాబాద్ విమానాశ్రయం వరకూ ప్రయాణం సాఫీగా సాగనుంది. ఆరాంఘర్, శాస్త్రిపురం, కలాపత్తర్, దారుల్ ఉల్ం, శివరాంపల్లి, హసన్ నగర్ జంక్షన్లలో ట్రాఫిక్ రద్దీకి శాశ్వత ఉపశమనం లభించనుంది. నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వరకు రవాణా మెరుగుపరచడమే కాకుండా సిగ్నల్ ఫ్రీ రవాణా వ్యవస్థకు దోహదపడనుంది.
'పైవంతెనకు మన్మోహన్ సింగ్ పేరు!'
వైఎస్ హయాంలో అతి పెద్ద ఫ్లైఓవర్ పీవీ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించుకున్నామని.. మళ్లీ ఇప్పుడు రెండో అతి పెద్ద ఫ్లై ఓవర్ నిర్మించుకుని మనకు మనమే పోటీ అని నిరూపించుకున్నామని సీఎం రేవంత్ అన్నారు. 'హైదరాబాద్ నగర అభివృద్ధికి మెట్రో విస్తరణ, మూసీ పునరుజ్జీవనం లాంటి ప్రాజెక్టులు చేపట్టాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ అభివృద్ధికి ఎవరితో కలిసి పనిచేయడానికైనా మేం సిద్ధం. ఎంఐఎంను కలుపుకుని ముందుకు వెళ్తాం. ఇది ఓల్డ్ సిటీ కాదు… ఒరిజినల్ సిటీ.. ఒరిజినల్ హైదరాబాద్. అభివృద్ధికి నిధులివ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పనులు పూర్తి చేసే బాధ్యత ఇక్కడి ప్రజా ప్రతినిధులదే. త్వరలోనే గోషామహల్ లో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తాం. ఈ ఫ్లై ఓవర్‌కు డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలని సూచిస్తున్నా.' అని సీఎం పేర్కొన్నారు.
విశేషాలివే..
- ఆరాంఘర్ - జూపార్క్ ఫ్లై ఓవర్ నగరంలో రెండో అతి పెద్ద ఫ్లైఓవర్. రాబోయే 20 ఏళ్ల ట్రాఫిక్ దృష్ట్యా ఫ్లై ఓవర్ నిర్మాణం.
- ఈ ప్రాజెక్ట్ వ్యయం రూ.800 కోట్లు కాగా.. 280 మీటర్ల మేరలో 2 ర్యాంపులు ఉన్నాయి. (ఆరాంఘర్ వైపు 184 మీటర్లు, జూపార్క్ వైపు 95 మీటర్లు).
- ఆరు లేన్లతో ఇరువైపులా 3 లేన్లతో ఈ పైవంతెనను నిర్మించారు. ఫ్లైఓవర్ పొడవునా ఎల్ఈడీ లైటింగ్.