Cherlapally Railway Terminal : తమ నెట్ వర్క్ మరింత విస్తరించేందుకు రైల్వే మరో కొత్త రైల్వే స్టేషన్ ను అందుబాటులోకి తెచ్చింది. రూ.430కోట్లతో కొత్తగా నిర్మించిన చర్లపల్లి టెర్మినల్‌ ను సోమవారం నాడు ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కేంద్ర బొగ్గు, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్న, ఎంపీ ఈటల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. గనుల శాఖ మంత్రి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సైతం వర్చువల్‌గా పాల్గొన్నారు. టెర్మినల్ ప్రారంభానికి సంబంధించి అధికారులు ముందుగానే ఏర్పాట్లు పూర్తి చేశారు. 


అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకున్న చర్లపల్లి రైల్వే టెర్మినల్


అంతర్జాతీయ విమానా శ్రయ తరహాలో ఆధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టర్మినల్‌ను రూపొందించారు. ఈ స్టేషన్‌ నుంచి 24 రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. ఇక్కడ ఐదు లిఫ్టులతోపాటు, ఐదు ఎస్కలేటర్లను సైతం ప్లాట్‌ఫామ్స్‌లో ఏర్పాటు చేశారు. అలాగే పార్సిల్ బుకింగ్ సౌకర్యాన్ని కూడా కల్పించారు. 25 జతల రైళ్లను హ్యాండిల్ చేసేలా ఈ స్టేషన్‌లో ట్రాకులు ఏర్పాటు చేశారు. అందుకోసం 10 కొత్త ట్రాకులను నిర్మించారు. వాహనాల పార్కింగ్ కోసం సువిశాలమైన స్థలాన్ని ఏర్పాటుచేశారు. విశాలమైన లాంజ్ లు, ప్రయాణికులకు విలాసవంతమైన సౌకర్యాలను అందుబాటులో ఉంటారు.


చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో మొత్తం మూడు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌లు ఉన్నాయి. అందులో ఒకటి గతంలోనే నిర్మించగా, కొత్తగా 2 టెర్మినల్స్ ను నిర్మించారు. ఈ టెర్మినల్ అందుబాటులోకి వస్తే.. మరో రెండు ప్రధాన రైళ్ల రాకపోకలు సైతం ఇక్కడి నుంచే నిర్వహించనున్నారు అధికారులు. ఇక్కడ్నుంచి ఇక నుంచి ప్రస్తుతం నడుస్తున్న సమయానికే ప్రతీ రోజు నాంపల్లి నుంచి బయల్దేరే ఎంజీఆర్ చెన్నై సెంట్రల్-హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్‌- చెన్నై ఎక్స్‌ప్రెస్‌ చర్లపల్లి నుంచి బయల్దేరనుంది. అదే విధంగా గోరఖ్‌పూర్‌-సికింద్రాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ సైతం చర్లపల్లి నుంచి బయలుదేరుతుంది. ఈ కొత్త టెర్మినల్ ఏర్పాటుతో నాంపల్లి, సికింద్రాబాద్, లింగంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లపై ఒత్తిడి తగ్గనుంది.


రాష్ట్రంలో, దేశవ్యాప్తంగా రైల్వేలో మౌలిక సదుపాయాలను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలలో ఈ టెర్మినల్ ఓ భాగం. అమృత్ భారత్ పథకం కింద 44 రైల్వే స్టేషన్లను అప్‌గ్రేడ్ చేస్తుండగా.. చర్లపల్లి టెర్మినల్‌తో పాటు జమ్మూ రైల్వే డివిజన్, ఈస్ట్ కోస్ట్ రైల్వేలో రాయగడ రైల్వే డివిజన్ భవనానికి శంకుస్థాపన సహా ఇతర రైల్వే ప్రాజెక్టులను కూడా ప్రధాని మోదీ నేడు ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టులు ప్రాంతీయ అనుసంధానాన్ని మెరుగుపరచడం, పర్యాటకాన్ని పెంచడం, ఉపాధి అవకాశాలను సృష్టించడం, ఆయా ప్రాంతాల సామాజిక-ఆర్థిక అభివృద్ధికి దోహదపడతాయని భావిస్తున్నారు.






సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణం


రూ.720 కోట్లతో పునర్నిర్మిస్తోన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు ఓ పక్క నిర్మాణ పనులు జరుగున్నప్పటికీ మరోపక్క రైళ్ల రాకపోకలు సాగుతున్నాయి. ఇది ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తోంది. ఇక స్టేషన్ లో పాదాచారుల వంతెన నిర్మాణం పేరుతో కొన్ని రైళ్లను రద్దు చేయడం మరిన్ని ఇబ్బందులకు కారణమవుతోంది. ప్లాట్ ఫామ్స్ ఖాళీ లేకపోవడంతో రైళ్లను శివార్లలోనే ఆపుతుండడం గమనార్హం.


Also Read : Morning Top News: తెలంగాణ సమగ్రాభివృద్ధి కోసం విజన్‌ 2050 , లోకేష్ మాటకు , వైసీపీ ఘాటైన ట్వీట్ వంటి మార్నింగ్ టాప్ న్యూస్