తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌కు ఏసీబీ మరోసారి నోటీసులు ఇవ్వనుంది. నేటి ఉదయం విచారణకు వచ్చిన కేటీఆర్ వాహనాన్ని గేటు వద్ద ఏసీబీ అధికారులు అడ్డుకున్నారు. కేవలం కేటీఆర్ ను మాత్రమే విచారణకు అనుమతిస్తామని అధికారులు చెప్పారు. లాయర్ సమక్షంలోనే విచారణ జరపాలని, అది తన హక్కు అన్నారు కేటీఆర్. విచారణ లాయర్ల సమక్షంలో జరగడం ఇదేమీ కొత్త కాదని, ప్రస్తుతం తన కేసు విచారణలో ఉందన్నారు. అరెస్ట్ చేయకూడదని సైతం హైకోర్టు చెప్పిందని.. చట్ట ప్రకారం తాను నడుచుకుంటున్నట్లు చెప్పారు. అరగంటకు పైగా వేచి ఉన్నా, లాయర్ సమక్షంలో విచారణకు అనుమతివ్వకపోవడంతో కేటీఆర్ ఏసీబీ ఆఫీసు నుంచి తెలంగాణ భవన్ కు వెళ్లిపోయారు.
రాష్ట్రంలో రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడుస్తోందని విమర్శించారు. దర్శకుడు రాజమౌళి కంటే గొప్పగా పోలీసులు, అధికారులు కథలు చెబుతున్నారంటూ మండిపడ్డారు. లాయర్లను అనుమతించకపోవడం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమే. ఈ కేసు వల్ల రేవంత్ రెడ్డి సాధించేది ఏం లేదు. అయితే తనను ఏసీబీ ఆఫీసులో కూర్చోబెట్టి తన ఇంటికి పోలీసులను పంపించి తనిఖీలు పేరుతో వేధింపులకు గురిచేయాలని చూశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. పట్నం నరేందర్ రెడ్డి విషయంలో జరిగిందే తన విషయాలో చేయాలని సర్కార్ చూస్తోందన్నారు. పోలీసులు రేవంత్ రెడ్డి ఇచ్చే పేపర్లు, ఇతర వస్తువులు తీసుకెళ్లి తన ఇంటికి వెళ్లో ఏదో చోట పెట్టేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు.
ఫార్ములా ఈ రేసుతో గ్రీన్ కో నష్టపోయింది: కేటీఆర్
హైదరాబాద్: గ్రీన్‌కో ఎన్నికల బాండ్ల వివాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. బీఆర్ఎస్ పై బురద జల్లే ప్రయత్నం జరుగుతోందన్నారు. గ్రీన్ కో సంస్థ 2022లో ఎన్నికల బాండ్లు ఇచ్చిందని పేర్కొన్న కేటీఆర్.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు సైతం ఆ సంస్థ బాండ్లు ఇచ్చిందన్నారు. గ్రీన్ కో బాండ్లు ఇచ్చిన ఏడాదికి 2023లో ఫార్ములా ఈ-రేసు జరిపామని పేర్కొన్నారు. ఫార్ములా ఈ-రేసు నిర్వహణ వల్ల గ్రీన్ కో సంస్థ నష్టాల పాలైందన్నారు. ఎన్నికల బాండ్లు అనేది చట్టబద్ధమే అయినప్పుడు, వాటికి పార్లమెంట్ అనుమతిస్తుంటే అవినీతి ఎలా అవుతుందని కేటీఆర్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎలక్షన్ బాండ్లతో పాటు దేశ వ్యాప్తంగా అన్ని పార్టీల బాండ్లపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. గ్రీన్ కో బీఆర్ఎస్ కు రూ.41 కోట్లు చెల్లించడంపై ఆరోపణలు వస్తున్నాయి. ఫార్ములా ఈ రేసు కేసుపై తెలంగాణ ప్రభుత్వం ఈ విషయాన్ని తెలిపింది. గ్రీన్‌కో దాని అనుబంధ సంస్థలు ఏప్రిల్ 8, 2022 నుంచి అక్టోబర్ 10 మధ్య 26 సార్లు బాండ్లు కొన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం బయటపెట్టింది.