మావోయిస్టులకు షాక్ తగిలింది. కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవితో పాటు ఐదుగురు లొంగిపోయారు. గత కొంత కాలంగా మావోయిస్టులకు పోలీసులకు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోంది. ఇటీవల మావోయిస్టు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా కూడా పోలీసులు అటవీ ప్రాంతాన్ని జల్లెడ పట్టారు. విశాఖ ఏజెన్సీలో అణువణువు కూంబింగ్ నిర్వహించారు. మావోయిస్టులకు చెక్ పెట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితుల్లో ఏవోబీ బోర్డర్లో ఆరుగురు మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేయడం… ఆపై వారు సరెండర్ అయ్యినట్టు ప్రకటించటం మావోయిస్టు పార్టీకి పెద్ద షాక్ అని చెప్పాలి.


ఏఓబీలో కీలక మావోయిస్టు నేతలు ఆరుగురిని అరెస్టు చేసినట్లుగా ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. అరెస్టయిన వారిలో మావోయిస్టు డివిజనల్ కమాండర్ సహా మరికొంత మంది నేతలు ఉన్నట్లు తెలిపారు. మావోయిస్టులకు గిరిజనుల్లో ఆదరణ కరవైందన్నారు. తమ ఎదుట లొంగిపోయిన వారిలో గాదర్ల రవి ఉన్నట్టు చెప్పారు. 


గత నెలలో లొంగిపోయిన స్పెషల్ జోనల్ కమాండర్ ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో మావోయిస్టు పరిస్థితులు వివరించారని  చెప్పారు. అక్కడ పరిస్థితులు బాగాలేని కారణంగా ఒక డివిజనల్ కమాండర్, ఇద్దరు కమాండర్లు, ముగ్గురు మెంబర్లు లొంగిపోయారని డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. గత నెలలో లొంగిపోయిన స్పెషల్‌ జోనల్‌ కమాండ్‌ చెప్పిన వివరాల ఆధారంగా కొందరిని అరెస్టు చేసినట్టు డీజీపీ వెల్లడించారు. 


అరెస్ట్‌ అయిన వారిలో మావోయిస్టు అగ్రనేత ఆర్కే గన్‌ మెన్లు ఉన్నారని వివరించారు సవాంగ్. స్థానిక సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడంతో మావోయిస్టు ప్రాబల్యం తగ్గిందని అభిప్రాయపడ్డారు. గిరిజన ప్రాంతాల్లో ఎక్కడా ఇప్పుడు  భూ సమస్యలు కూడా లేవని, దాదాపు 19వేల 919 కుటుంబాలకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చారని వివరించారు. ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలు ఆదివాసీ ప్రాంతలకు చేరుతున్నాయని డీజీపీ గౌతం సవాంగ్ వెల్లడించారు. ఇక మిగతా మావోయిస్టులపై కూడా తమ నిఘా కొనసాగుతుందని సవాంగ్ వివరించారు.


ప్రభుత్వం నుంచే మావోలకు అన్ని పథకాలు


‘‘స్థానిక సమస్యలపై గతంలో మావోయిస్టులు వచ్చి స్థానికులతో మాట్లాడేవారు. ఇప్పుడు ప్రభుత్వం నుంచే అన్ని సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. గిరిజన ఏరియాల్లో 20 వేల కుటుంబాలకు ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది. గత రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోంది. మహిళలకు సంబంధించి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ఆదివాసీ గూడేలకు సైతం చేరుతున్నాయి. బేస్ ఏరియాల్లో సైతం మావోయిస్టుల ప్రభావం తగ్గినట్టు రిపోర్టులు వచ్చాయి. గతంలో మావోయిస్టులు తిరిగిన ప్రాంతాల్లో ఇప్పుడు పథకాలు అందుతున్నాయి. 


గతంలో మావోయిస్టులు పోరాటాలు, ఉద్యమాలు చేసేవారు. అలా రక్తపాతం ద్వారా సమస్యలు పరిష్కారం కావని ఆదివాసీలకు అర్థమైంది. విద్య, వైద్యం సమస్యలు ఇప్పుడు ఆదివాసీలకు లేవు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం పోరాడదామని మావోయిస్టులు అంటున్నా గిరిజనులు ఆసక్తి చూపట్లేదు. గతంలో ఏవోబీలో 8 మావోయిస్టు కమిటీలు ఉండేవి ఇప్పుడు 4 కమిటీలు కూడా లేవు. అనేకమంది జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. గత నెల స్పెషల్ జోన్ కమాండర్ సరెండర్ అయ్యారు’’ అని డీజీపీ తెలిపారు.


Also Read: Guntur: డీఎస్పీ ఫ్యామిలీని యాత్రలకు తీసుకెళ్లాడు.. పోలీసు అవతారమెత్తాడు.. వ్యభిచార ముఠా వద్ద దందా మొదలు పెట్టాడు