ఇటీవల ముగిసిన టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన భారత స్టార్ జావెలిన్ త్రో ఆటగాడు నీరజ్ చోప్రా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో నిలిచాడు. భారత గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో భారత్‌కు తొలి పతకం అందించాడు. ఏకంగా స్వర్ణం సాధించి భారతీయుల 100ఏళ్ల నిరీక్షణకు తెరదించాడు. 




టోక్యో ఒలింపిక్స్‌కి వెళ్లే ముందు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నీరజ్ చోప్రాది 16వ ర్యాంకు. ఒలింపిక్స్ ఫైనల్లో అతడు ఈటెను ఏకంగా 87.58మీటర్లు విసిరి స్వర్ణ పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఫైనల్లో అత్యుత్తమ ప్రదర్శన, తనకంటే మెరుగైన క్రీడాకారులపై మంచి ప్రదర్శన చేసినందుకుగానూ నీరజ్ చోప్రా పెద్ద సంఖ్యలో పాయింట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. మొత్తం 1315పాయింట్లతో ఏకంగా 14 స్థానాలు ఎగబాకి వరల్డ్ నెంబర్ 2గా నిలిచాడు. జర్మనీకి చెందిన జోహన్నెస్ వెటర్  1396 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. పొలాండ్‌కు చెందిన మార్సిన్, చెక్ రిపబ్లిక్‌కు చెందిన జాకుబ్, జర్మనీకి చెందిన జూలియన్ వెబెర్ టాప్ -5లో నిలిచారు.   


AlsoRead: In Pics: టోక్యోలో ఆడిన ఒడిశా హాకీ ప్లేయర్లను సన్మానించిన నవీన్ పట్నాయక్... రూ.2.5కోట్ల నజరానా, DSP ఉద్యోగం


ఒలింపిక్స్‌లో ఫైనల్ కోసం నిర్వహించిన అర్హత పోటీల్లో నీరజ్ అద్భుత ప్రదర్శన చేశాడు. దీంతో యావత్తు భారత్ అతడికి ఫైనల్లో పతకం ఖాయం అనుకున్నారు. అనుకున్నట్లుగానే నీరజ్ చోప్రా పతకం సాధించాడు. భారత్ తరఫున వ్యక్తిగత విభాగంలో స్వర్ణం సాధించిన రెండో అథ్లెట్‌గా నిలిచాడు.  టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా బంగారు పతకం సాధించిన ఘనతతో అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రతి సంవత్సరం ఆగస్టు 7న ‘జాతీయ జావెలిన్ త్రో డే’గా జరుపుకోవాలని ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. 


AlsoRead: Neeraj Chopra: ఈ 23 ఏళ్ల నీరజ్ చోప్రా.. 100 ఏళ్ల భారత్ కలను సాకారం చేశాడిలా..


జావెలిన్‌ త్రోలో స్వర్ణంతో సత్తాచాటి అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా సాధించిన విజయం.. టోక్యో ఒలింపిక్స్‌లో ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో పది అద్భుత సందర్భాల్లో ఒకటిగా చోటు దక్కించుకుంది. ప్రపంచ అథ్లెటిక్స్‌ సమాఖ్య ఈ జాబితాను ప్రకటించింది. 23 ఏళ్ల నీరజ్‌.. ఫైనల్లో జావెలిన్‌ను 87.58 మీటర్ల దూరం విసిరి అథ్లెటిక్స్‌లో దేశానికి తొలి పసిడి అందించిన సంగతి తెలిసిందే. అభినవ్‌ బింద్రా (2008) తర్వాత విశ్వ క్రీడల్లో వ్యక్తిగత స్వర్ణం సాధించిన భారత క్రీడాకారుడు నీరజ్ చోప్రా.