వివాహేతర సంబంధాలు ఎంతటి అనర్థాలకు దారి తీస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రోజూ ఇలాంటి ఎన్నో ఘటనలు వెలుగులోకి వస్తుండగా.. దాదాపు ప్రతి కేసులోనూ ఎవరో ఒకరు హత్య లేక ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే విజయవాడలో చోటు చేసుకుంది. నిందితుడు ఏపీ పోలీస్ బాస్ అయిన డీజీపీకి వ్యక్తిగత అంగరక్షకుడు (గన్‌మెన్). దీంతో ఈ కేసు ప్రాధాన్యం సంతరించుకుంది. విజయవాడలోని పటమట పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన బుధవారం చోటు చేసుకుంది.


వివాహేతర సంబంధం వల్ల దారితీసిన హత్యకు సంబంధించి వివరాలు ఇవీ.. విజయవాడ నగర ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ డిపార్ట్‌మెంట్‌లో శివ నాగరాజు అనే వ్యక్తి కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. ఇతను పటమట స్టేషన్‌ పరిధిలోని రామలింగేశ్వర నగర్‌లో ఉన్న పుట్ట రోడ్డులో కిరాయి ఇంట్లో భార్యాపిల్లలతో ఉంటున్నాడు. ఈ క్రమంలో అదే భవంతిలో పెంట్‌ హౌస్‌లో మచిలీపట్నానికి చెందిన వెంకటేష్‌ (24) అనే వ్యక్తి కూడా నివాసం ఉండేవాడు. ఇతను అక్కడే ఆటో నగర్‌లో ఐస్‌క్రీమ్‌ షాపు నడుపుతుంటాడు. 


ఒకే భవనంలో వేర్వేరు పోర్షన్లలో నివాసం ఉండడంతో శివనాగరాజు భార్యతో వెంకటేష్‌కు పరిచయమైంది. అది మెల్లగా వివాహేతర సంబంధానికి దారి తీసింది. శివనాగరాజు లేని సమయంలో అతని భార్య తరచూ వెంకటేష్‌ను కలుస్తూ ఉండేది. ఈ విషయం చుట్టుపక్కల వారి ద్వారా భర్త శివనాగరాజుకు తెలియడంతో భార్యను నిలదీశాడు. ప్రవర్తన మార్చుకొని, సరిగ్గా ఉండాలని హెచ్చరించాడు. అంతేకాక, ఈ విషయం ఆ ఇంటి యజమానికి చెప్పి పెంట్ హౌస్‌లో ఉంటున్న వెంకటేష్‌ను ఖాళీ చేయించాడు. దీంతో అతను సొంతూరు మచిలీపట్నం వెళ్లిపోయాడు. 


అయినా శివనాగరాజు లేని సమయంలో అతని భార్య దగ్గరికి వెంకటేష్ వస్తూ ఉండేవాడు. విషయం మళ్లీ అతనికి తెలియడంతో దీనిపై గత ఆరు నెలల క్రితం పెద్ద గొడవ కూడా అయ్యింది. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. ఇరు వర్గాల పెద్దలు వీరి మధ్య సయోధ్య కుదిర్చి గత జూన్‌లో మళ్లీ కాపురానికి పంపించారు. అయినా, ఆమె వెంకటేష్‌తో సంబంధాన్ని ఆపలేదు. తరచూ ఫోన్‌లో మాట్లాడుతుండేది. మంగళవారం పని మీద వెంకటేష్‌ విజయవాడకు వచ్చినప్పుడు.. అదే సమయంలో శివనాగరాజు నైట్ డ్యూటీ ఉండడంతో వెళ్లిపోయాడు. దీంతో వెంకటేష్‌ బుధవారం తెల్లవారుజామున శివనాగరాజు ఇంటికి వచ్చాడు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో గోడ దూకి ఇంట్లోకి వెళ్లాడు. 


ఆ సమయంలో అలికిడి అనిపించడంతో ఇంటి యజమానులు వెళ్లి చూడగా వెంకటేష్‌ లోపలికి వెళ్లి గడియ వేసుకున్నాడు. ఎంత తట్టినా తలుపు తీయకపోయేసరికి, బయట గడియపెట్టి జరిగిన విషయాన్ని రాత్రి విధుల్లో ఉన్న శివనాగరాజుకు ఫోన్ చేసి చెప్పారు. అతను కోపంతో వచ్చి లోపల ఉన్న వెంకటేష్‌ను చేతులు, కాళ్లు కట్టేసి ఇష్టమొచ్చి హింసించాడు. ఈ విషయాన్ని పక్కన ఉన్న వాళ్లు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పటమట పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని, అప్పటికే గాయాలపాలైన వెంకటేష్‌ను వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను అప్పటికే చనిపోయాడు. వైద్యులు చనిపోయినట్లు ధ్రువీకరించడంతో సంబంధిత వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు.