Antarvedi Sri Lakshmi Narasimha Swamy Temple:  దక్షిణ కాశీగా పేరున్న అంతర్వేది నరసింహస్వామి టెంపుల్‌ అంటే భక్తులకు చాలా విస్వాసం. ప్రతీ ఏటా మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి రోజున శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటుంది దేవాదాయ ధర్మాదాయశాఖ.. దీని కోసం దాదాపు నెల రోజుల నుంచి అమలాపురం ఆర్డీవో సమక్షంలో అన్ని ఏర్పాట్లు చేస్తుంటారు.


గజమాల సమర్పించడం ఆనవాయితీ


ఈ కల్యాణ మహోత్సవానికి ఉభయగోదావరి జిల్లాల నుంచే కాకుండా తెలుగు రాష్ట్రాలనుంచి వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు.. అయితే కల్యాణ మహోత్సవానికి ముందు స్వామివార్లకు గజమాల సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.. ఈ కార్యక్రమాన్ని అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ నిర్మాత అయిన దివంగత కొపనాతి కృష్ణమ్మ వారసులు నిర్వహించడం ఆనవాయితీ. కల్యాణ మహోత్సవం రోజున ఈ కార్యక్రమాన్ని కూడా అగ్నికుల క్షత్రియులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు..


తరతరాలుగా వస్తున్న సంప్రదాయం..
అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి భారీ గజమాల సమర్పించేందుకు ఆలయ నిర్మాత ఓడలరేవు గ్రామానికి చెందిన కొపనాతి కృష్ణమ్మ వంశీయులు ప్రతీ ఏటా భారీ ర్యాలీగా ఈ యాత్రను చేపడుతున్నారు. కోనసీమ వ్యాప్తంగా ఉన్న అగ్నికుల క్షత్రియ సామాజీక వర్గీయులు ఈ భారీ యాత్రను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంటారు. ఓడలరేవులో ఉన్న ఆయన మునిమనవలు ఈ గజమాలను ఆలయ అర్చకులకు అందిస్తారు.. ఇది ఓడలరేవు గ్రామం నుంచి ప్రారంభమయ్యి అంతర్వేది వరకు భారీ యాత్రగా వెళ్లి స్వామికి గజమాల సమర్పించేవరకు సాగుతోంది.. 


Also Read: పెళ్లి కావలసిన వాళ్లు వస్తే సంవత్సరంలో పెళ్లి అవుతుంది, కోరిన కోరికలు నెరవేర్చే స్వామి


ఆలయ నిర్మాత కృష్ణమ్మ ప్రారంభించినదే.. 
ఓ బ్రాహ్మణుడు అంతర్వేదిలో లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని కట్టేందుకు అన్వేషిస్తున్న క్రమంలో ఓడలరేవులో సాగరనదీ సంగమం వద్ద ఓడల వ్యాపారం చేస్తున్న అదే ప్రాంతంలోని అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన కొపనాతి ఆదినారాయణ సమర్దుడని తెలుసుకుని ఈ ఆలయ నిర్మాణం చేపట్టాలని కోరినట్లు ప్రతీతి. అయితే ఆయన ఆలయాన్ని నిర్మించలేనని తేల్చి చెప్పిన క్రమంలో ఓ రాత్రి వేళ నరసింహస్వామి కలలోకి వచ్చారని చెబుతారు. అందుకే ఆయన ఆలయ నిర్మాణానికి సిద్ధపడినట్టు ప్రచారంలో ఉంది. ఆయన పూర్తిచేయలేకపోగా ఆయన కుమారుడు అయిన కొపనాతి కృష్ణమ్మ ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి ఆలయాన్ని పూర్తి చేసి ఆయనే ప్రతిష్టంచారని అంటారు.


దేవాదాయ శాఖ ప్రాధాన్యత ఇవ్వడం లేదని విమర్శ 


ఈక్రమంలోనే నరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి ఆయన గజమాల సమర్పించి కల్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆనాటి నుంచి కొపనాతి కృష్ణమ్మ వంశీయులు అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి గజమాల సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే అంతర్వేది కల్యాణ మహోత్సవంలో ఆలయ నిర్మాత కొపనాతి కృష్ణమ్మ వారసులకు దేవాదాయ ధర్మాదాయ శాఖ అంతటి ప్రాధాన్యత ఇవ్వడంలేదని అగ్నికుల క్షత్రియ పెద్దలు ఆరోపిస్తున్నారు.. 


Also Read: డబ్బులు, లక్ కలిసి రావాలంటే ఇంట్లో ఈ పెయింటింగ్స్ పెట్టుకోవాలి.. బుద్ధుడి బొమ్మని అక్కడ పెడితే మంచిదట