Pawan Kalyan Eluru Tour: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. జనసేన కౌలు రైతుల భరోసా యాత్ర (JanaSena Rythu Bharosa Yatra)లో భాగంగా ఇదివరకే అనంతపురం జిల్లా నుంచి రైతులకు ఆర్థిక సహాయం అందజేత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నేడు ఏలూరు జిల్లాలో పర్యటించి ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి, వారికి రూ.1 లక్ష ఆర్థికసాయం అందించనున్నారు పవన్ కళ్యాణ్. ఏలూరు మీదుగా పెదవేగి, లింగపాలెం మండల నుంచి చింతలపూడికి జనసేనాని పవన్ కళ్యాణ్ చేరుకోనున్నారు.
రూ.1 లక్ష ఆర్థిక సాయం..
అనంతరం చింతలపూడిలో నిర్వహించే రచ్చబండ కార్యక్రమంలో ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలకు రూ.1 లక్ష చెక్ అందజేయనున్నారని ఆ పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. రెండో విడత "జనసేన కౌలు రైతు భరోసా యాత్ర"లో నేడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న 40 మంది కౌలు రైతుల కుటుంబాలను జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పరామర్శించనున్నారు. ఆ రైతుల కుటుంబానికి లక్ష రూపాయలు చొప్పున చెక్కులు అందచేస్తారు.
పవన్ పర్యటనకు ఆటంకాలు..
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కౌలు రైతుల భరోసా యాత్రలో భాగంగా శనివారం నాడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో పర్యటించనున్నారు. అయితే పవన్ కళ్యాణ్ రైతులకు ఆర్థిక సాయం అందించే కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు అధికార పార్టీ వైఎస్సార్‌సీపీ నేతలు విశ్వ ప్రయత్నాలు మొదలుపెట్టారని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. చింతలపూడి నియోజకవర్గం ధర్మాజీగూడెం వద్ద ఆర్ అండ్ బి రహదారిని అడ్డంగా తవ్వించేస్తూ, ఉన్నపళంగా జేసీబీతో రోడ్డును ఇలా మార్చడాన్ని చూసి జనం సైతం ఆశ్చర్యపోతున్నారని జనసేన పార్టీ రాజకీయ కార్యదర్శి పి హరి ప్రసాద్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
చింతలపూడిలో పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా ఏర్పాట్లు పరిశీలించేందుకు వెళ్తున్న పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.. మార్గం మధ్యలో రోడ్డును తవ్వడాన్ని చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు జనసేన పార్టీ ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు అధికార వైఎస్సార్‌సీపీ చేస్తున్న పనులు సబబు కాదన్నారు.