Pawan Kalyan : విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మతిస్థిమితం లేని యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని పవన్ కల్యాణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దారుణానికి ఒడిగట్టింది ఆస్పత్రిలో పనిచేస్తున్నవారే కావడం చూస్తే అక్కడి నిఘా వ్యవస్థ ఎలా ఉందో అర్థం అవుతోందన్నారు. బాధితులు తమ బిడ్డ కనిపించడం లేదని ఫిర్యాదు చేసినా, ఓ యువకుడిపై అనుమానం వ్యక్తం చేసినా పోలీసులు స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. పోలీసులు వెంటనే స్పందించి ఉంటే ఈ ఘోర అఘాయిత్యం జరిగేదా? అని ప్రశ్నించారు. నిందితులకు కఠిన శిక్ష విధించాలని జనసేన డిమాండ్ చేస్తుందని పవన్ అన్నారు. నిందితులను శిక్షించాలని డిమాండ్ చేసిన జనసేన నాయకులపై కేసులు నమోదు చేయడంలో చూపించే శ్రద్ధ యువతి ఆచూకీ తెలుసుకోవడంలో చూపించాల్సిందన్నారు. 


దిశ చట్టం ఎప్పుడు అమల్లోకి


వైసీపీ ప్రభుత్వం మహిళల రక్షణకు దిశ చట్టం తీసుకొచ్చినా అది ఇప్పటికీ అమలుకు నోచుకోలేదని పవన్ కల్యాణ్ అన్నారు. ఆ చట్టంతో నిందితులను శిక్షించే పరిస్థితి లేదన్నారు. పోలీసులు మహిళ రక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని పవన్ కోరారు. తమ బిడ్డలను కనిపించడంలేదని ఎంతో ఆందోళనతో పోలీసులను ఆశ్రయించే తల్లిదండ్రులకు భరోసా ఇచ్చేలా వెంటనే స్పందించాలి కోరారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరుగుతున్నాయని పవన్ అన్నారు. 2020తో పోలిస్తే 2021లో మహిళపై దాడులు 25 శాతం పెరిగాయని మాజీ డీజీపీ స్వయంగా ప్రకటించారన్నారు. ఇకపై ప్రభుత్వం పోలీసు వ్యవస్థను తమ రాజకీయ అవసరాలకు కాకుండా ప్రజల రక్షణ వినియోగించాలన్నారు. విజయవాడ యువతి అత్యాచార ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలన్నారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని, ఆ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. దిశ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందో ప్రజలకు వివరణ ఇవ్వాలని పవన్‌ డిమాండ్ చేశారు. పోలీసులు మహిళలకు రక్షణకు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని పవన్ కోరారు.