Gollaprolu Dumping Yard issue in Pithapuram | పిఠాపురం: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రంతో పాటు తన నియోజకవర్గం పిఠాపురంలో ప్రక్షాళన మొదలుపెట్టారు. ఇచ్చిన హామీలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు. పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు గ్రామంలో ఏళ్ల తరబడి, పెను సమస్యగా ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా పవన్ కళ్యాణ్  ఇదివరకే జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి వచ్చిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి అందజేశారు. సమస్య మరింత జఠిలం కాకుండా, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుగా తాత్కాలిక పరిష్కారాన్ని చూపించారు. పవన్ కళ్యాణ్ ఆదేశాలతో జిల్లా యంత్రాంగం పనులు మొదలు పెట్టింది.


1.5 ఎకరాల వైశాల్యంలో ప్రస్తుతం ఇష్టమొచ్చినట్లు చెత్తను పడవేస్తూ పరిసరాలను వ్యర్థ పదార్ధాలతో నింపడాన్ని అరికట్టేందుకు, డంపింగ్ యార్డ్ ను, 0.25 ఎకర వైశాల్యంలో క్రమపద్ధతిలో పడవేసేలా, దాని చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ, ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించే దిశగా అడుగులు వేస్తున్నాం. ఈ డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరించడం మూలంగా అక్కడే ఉన్న ప్రభుత్వ వైద్యశాలకు ఎన్నో సంవత్సరాలుగా ప్రధాన మార్గం డంపింగ్ యార్డ్ తో మూసుకుపోవడంతో వెళ్లేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ప్రధాన మార్గం తెరుచుకోనుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.




డంపింగ్ యార్డ్ పక్కనే ఉన్న SC స్మశాన వాటికకు వెళ్లేందుకు, డంపింగ్ యార్డ్ చెత్త నుండి వెళ్ళేవారు. ఇక మీదట ఆ మార్గంలోఎటువంటి చెత్త వేయకుండా, దారి ఏర్పాటు చేశాం. కొన్ని సంవత్సరాలుగా చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు భారీగా పేరుకుపోయి, వేసవికాలంలో మంటలు చెలరేగుతూ, ప్రమాదకరంగా మారడమే కాకుండా కాలుష్యానికి కారణమయ్యాయి. ఇప్పుడు డంపింగ్ యార్డ్ చుట్టూ పచ్చదనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనితో ప్రమాదకర పరిస్థితులు కాస్త ఆహ్లాదకర వాతావరణంగా, అందంగా మారిపోనున్నాయని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు.


Also Read: AP Liquor Shops: మద్యం షాపులు దక్కించుకున్న వారికి బెదిరింపులు, సీఎం చంద్రబాబు సీరియస్! 


గొల్లప్రోలు విద్యార్థుల త్రాగునీటి సమస్య తీర్చిన పవన్ కళ్యాణ్
పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు బాలుర ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు 4 సంవత్సరాల నుండి రక్షిత త్రాగునీటి సదుపాయం లేదు. సరైన తాగునీరు లేక 449 మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలుసుకుని వారి సమస్యను పరిష్కరించారు. స్కూల్ సమీపంలోని శ్రీ వెంకటేశ్వర రైస్ మిల్ వద్ద మంచినీరు ఉందని.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో రైస్ మిల్ యాజమాన్యంతో జిల్లా అధికారులు మాట్లాడి విద్యార్థులకు మంచి నీరు ఇచ్చేలా ఒప్పించారు.




రూ.4 లక్షల సీఎస్ఆర్ నిధులతో RO ప్లాంట్ కు రైస్ మిల్ నుంచి గొల్లప్రోలు బాలుర ప్రాథమికోన్నత పాఠశాలకు మంచినీటి సరఫరా ఏర్పాటు కోసం డెడికేటెడ్ పైప్ లైన్ ఏర్పాటు చేశారు. దాంతో విద్యార్థులకు స్వచ్ఛమైన రక్షిత త్రాగునీరు అందించేలా అధికారులు వెంటనే చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ వేంకటేశ్వర రైస్ మిల్ యాజమాన్యానికి పవన్ కళ్యాణ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.